ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారుల బదిలీకి రంగం సిద్దమైందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా నిలిచిన సీఎం ముఖ్యకార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీలో ఏపీ వ్యవహారాలు చూసేందుకు బదిలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో ఎస్.ఎస్.రావత్ ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఎస్.ఎస్.రావత్ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇక పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరుగా చేస్తున్న ముత్యాలరాజు, విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ లలో ఎవరో ఒకరిని సీఎంఓకు తీసుకువచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
బదిలీల వెనుక…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచీ సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అన్నీతానై పనులు చక్కబెడుతున్నారు. అయితే అకస్మాత్తుగా ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీలో ఏపీ వ్యవహారాలు చూసేందుకు బదిలీ చేయడంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ బ్యాచ్ కు చెందిన కొందరు అధికారులు ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక స్థానాల్లో పనిచేస్తున్నారు. వారి ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించుకోవడంతోపాటు, సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రధాని అపాయింట్ మెంట్లను సాధించేందుకు ప్రవీణ్ ప్రకాష్ ను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో వైసీపీ అధినేత ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక ప్రస్తుత సీఎస్ నీలం సాహ్నీ పదవీ కాలం ముగిసింది. రెండు నెలల పాటు ఆమె సేవలను పొడిగిస్తూ కేంద్రం అనుమతించింది. త్వరలో ఆమె పదవీ విరమణ చేయనున్నారు. ఆ స్థానంలో ఎస్.ఎస్.రావత్ సీఎస్ గా వస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో రావత్ ను ముఖ్యమంత్రికి ముఖ్యకార్యదర్శిగా తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.