ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో ఆయన సభ్యుడు. కానీ.. ఒక నేరగాడిని ఆపేసినట్టుగా ఆయనను ఎయిర్‌పోర్టులో అధికారులు ఆపేశారు. విదేశాలకు వెళ్లనిస్తే.. తిరిగి దేశానికి రాకుండా పరారవుతారని నేరగాళ్ల విషయంలో పాటించే నిబంధనలను.. సదరు ఎంపీగారికి వారు గుర్తు చేశారు. ఆగ్రహించి ఉండొచ్చు గానీ.. ఆయన చేయగలిగిందేమీ లేదు. హైకోర్టును ఆశ్రయించి.. నేను పారిపోను.. మళ్లీ తిరిగి భారత్ వస్తాను.. అని వారిని నమ్మించి.. కేవలం రెండువారాల పాటు న్యూయార్క్ వెళ్లడానికి అనుమతి తెచ్చుకున్నారు.
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాంకుల నుంచి రూ.5,700 కోట్ల రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో సుజనాపై ఈడీ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. లుక్ అవుట్ నోటీసులు ఉన్నవారు విదేశాలకు వెళ్లడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ఒప్పుకోవు. దీంతో ఢిల్లీ విమానాశ్రయం నుంచి అమెరికా వెళ్లడానికి ప్రయత్నించిన సుజనా చౌదరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని వెనక్కుపంపారు. దీనిపై సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
సుజనాపై లుక్ అవుట్ నోటీసులు ఎందుకంటే?
సుజనా చౌదరి 120 డొల్లకంపెనీలు పెట్టి బ్యాంకులను రూ.5,700 కోట్లు మోసగించారంటూ ఈడీ అధికారులు 2018లో దాడులు నిర్వహించారు. చెన్నై, హైదరాబాద్ లోని ఏడు ప్రాంతాల్లోని సుజనా కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 120 డొల్ల కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో నిందితుడు సుజనా చౌదరి విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు.
సుజనాపై మూడు కేసులు నమోదు
2018లో సుజనా కంపెనీల్లో సోదాలు నిర్వహించిన ఈడీ మూడు కేసులు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో బ్యాంకులను రూ.364 కోట్లు మోసగించారని బెంగళూరు ఈడీ విభాగం మూడు కేసులు నమోదు చేసింది. చెన్నైలోని బెస్ట్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు లిమిటెడ్ పేరుతో తప్పుడు పత్రాలు సృష్టించి సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.133 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.159 కోట్లు రుణాలు తీసుకుని ఎగవేతకు పాల్పడ్డారని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచింది.
ఈడీ దాడులు నిర్వహిస్తుంది.. వాటివల్ల తేలేదేం ఉండదు.. కేసులు పెడతారు.. అవి కోర్టుల్లో సాగుతూ ఉంటాయి.. బ్యాంకులకు ఎగవేతలు యథాప్రకారం జరుగుతూనే ఉంటాయి.. పట్టించుకునే పనిలేదు.. ఎయిర్‌పోర్టులో అధికారులు ఆపేస్తారు.. కోర్టు అనుమతులతో విదేశాలకు వెళ్లిపోతూ ఉంటాం.. ఇందులో చిత్రమేముంది.. అని సదరు నాయకులు ప్రతి లోపాన్నీ సమర్థించుకోవచ్చు గాక.. కానీ.. ఇలాంటి పరిణామాల వల్ల నెమ్మది నెమ్మదిగా ప్రజల్లో పరువు కూడా పోతుంటుంది. ఆ సంగతి వారు తెలుసుకోవాలి.











