2021 జనవరి నాటికి ఏపీలో జిల్లాల విభజనపై దాదాపు ఓ క్లారిటీ వచ్చేలా ఉంది. ఇదే ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుల్లోనూ, ప్రజల్లోనూ అసంతృప్తిని రాజేస్తోంది. పార్లమెంట్ యూనిట్‌గా తీసుకుని జిల్లాల విభజన చేయాలని సీఎం భావిస్తున్నా.., నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. ప్రధానంగా కందుకూరు, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఇప్పుడున్న లోక్ సభ స్థానాల ప్రాతిపదికన జిల్లాను విభజిస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవని తమ సమస్యలు ఏకరవు పెడుతున్నారు.
సర్వేపల్లి నెల్లూరులోనే ఉండాలంటున్న నేతలు..!
కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో వికేంద్రీకరణ పరిపాలన, ప్రజా శ్రేయస్సు, ఆర్ధిక స్థిరత్వం ప్రాతిపదికన సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు జిల్లాలోనే ఉండాలని ప్రజలు, వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు. దీనికి ప్రాతిపదికగా సర్వేపల్లి నెల్లూరు నగరానికి 25 కి.మీ దూరంలో ఉండగా.., తిరుపతికి 120 కి.మీ దూరంలో ఉన్నదని…, ప్రజలు ఏ అవసరం ఆయినా
తిరుపతికి వెళ్లాలంటే కష్టమంటున్నారు.
సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాలు దాదాపుగా నెల్లూరు నగరానికి ఆనుకొని ఉన్నాయి. తూర్పు దిక్కున ముత్తుకూరు, తోటపల్లి గూడూరు మండలాలు, దక్షిణం వైపు వెంకటాచలం మండలం ఉంది. మనుబోలు, పొదలకూరు మండలాలకు నెల్లూరు మధ్య 12 నుంచి 16 కిలోమీటర్లు మాత్రమే. సర్వేపల్లి నియోజకవర్గం దాదాపుగా నెల్లూరు నగరం అంతర్భాగంగా ఉందన్న విషయం ఈ భౌగోళిక అంశాలే రుజువు చేస్తున్నాయి. దీంతోపాటు.. సర్వేపల్లి పరిధిలోని రైతాంగం సాగునీటికోసం సోమశిలపై ఆధారపడుతున్నారు. విభజన జరిగితే ప్రాజెక్టు నెల్లూరు జిల్లా పరిధిలోకి వస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో వ్యవసాయపరంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఆందోళన కూడా అన్నదాతలను వేధిస్తోంది.
పరిశ్రమల శాఖ తప్ప ఇంకేమీ మిగలదంటున్న నేతలు…!
నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతం రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రిగా ఏపీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. సర్వేపల్లిని తిరుపతిలో కలిపితే.., ఆయన వద్ద ఉన్న పరిశ్రమల శాఖ తప్ప, 80 శాతం పరిశ్రమలు తిరుపతికి వెళ్లిపోతాయి. ఎందుకంటే..? ఇన్నిరోజుల జిల్లా ఆర్థిక కార్యకలాపాలకు వెన్నెముకలా ఉన్న కృష్ణపట్నం పోర్టు ముత్తుకూరు మండలంలో ఉంది. ఈ పోర్టు పరిధిలో 22 భారీ పరిశ్రమలు, 70కిపైగా చిన్న పరిశ్రమలు నడుస్తున్నాయి. కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ పార్కు కోసం వేలాది ఎకరాలు సేకరించి ఉన్నారు. ఇవన్నీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నాయి. ఇప్పుడు విభజిస్తే పోర్టు, పరిశ్రమలు తిరుపతి జిల్లాలో కలిసిపోతాయి. దీంతోపాటు..,, శ్రీసిటీ ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు జిల్లాల మధ్యలో విస్తరించి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగితే ఇది పూర్తిగా తిరుపతి జిల్లాలో కలిసిపోతుంది. దీంతో పరిశ్రమల శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లాలో పరిశ్రమలంటూ లేకుండా పోతాయి.
ఆర్థికంగా, ఉపాధి పరంగా నెల్లూరు జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ఇక విద్య పరంగా నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకే ఒక యూనివర్సిటీ. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వెంకటాచలం మండలం కాకుటూరు వద్ద ఉంది. సర్వేపల్లి తిరుపతిలో కలిస్తే ఈ వర్సిటీ కూడా తిరుపతిలో కలిసిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే కొత్తగా ఏర్పడబోయే నెల్లూరు జిల్లాకు సోమశిల ప్రాజెక్టు తప్ప ముఖ్యమైనవి ఏమీ లేకుండా పోతాయి.
ఆగ్రహంతో కందుకూరు వైసీపీ ఎమ్మెల్యే..!
2019 ఎన్నికల్లో కందుకూరు నుంచి మాజీ మంత్రి, మానుగుంట మహీధర్ రెడ్డి విజయం సాధించారు. ఒకప్పటి దిగ్గజ రాజకీయ నేతల్లో మానుగుంట తలపండిన వ్యక్తి. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కందుకూరు ఒంగోలుకు 40 కిమీ దూరంలో ఉంటే.., దానిని తీసుకెళ్లి 112 కి.మీ దూరంలో ఉన్న నెల్లూరులో కలపడం ఏమిటని ఆయన పార్టీ అంతర్గత సమావేశాల్లో ప్రశ్నించారు. మొదట నెల్లూరు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు కందుకూరు వద్దని.., లోక్ సభలో అప్పటి నెల్లూరు జిల్లా నేతలు వ్యతిరేకించారని.., మరి ఇప్పుడు కందుకూరు ఎందుకు అని ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైవు కందుకూరు ప్రజలు కూడా నెల్లూరులో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దశాబ్దాలుగా ఒంగోలుతో అనుబంధం ఉందని, 40.కి.మీ దూరంలో ఒంగోలు ఉండగా, 112 కి.మీ నెల్లూరు తమకెందుకు అంటున్నారు. అసలు కందుకూరు పై నెల్లూరు జిల్లా నాయకులకు ప్రేమ వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉందని.., ఏపీ విభజన చట్టంలో ఏర్పాటు చేయాలన్న రామాయపట్నం పోర్టు కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉండటమే కారణమని…, లోక్ సభ స్థానాల ప్రాతిపదిక విభజిస్తే కృష్ణపట్నం పోర్టు తిరుపతికి వెళ్లిపోతోంది అని.., దానిని అడ్డుకోలేక, ప్రకాశం జిల్లా నోట్లో మట్టికొట్టడానికి లేని ప్రేమను నటిస్తూ కందుకూరు నెల్లూరులో కలపాలని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాల విభజనలో రాజకీయం తప్ప, ప్రజా సంక్షేమం ఎక్కడ..?
పరిపాలనపై అవగాహన ఉన్నవారెవరైనా, లోక్ సభ నియోజకవర్గానికి ప్రధాన కార్యాలయం ఉండదని తెలుసు. ఒక్కో జిల్లాకు ఒక్కో పాలనా కేంద్రం ఉంటుంది. మరి లోక్ సభ ప్రాతిపదికన జిల్లాల విభజన ఏ విధంగా ఆమోదయోగ్యమో అన్నది ఓ పెద్ద భేతాళ ప్రశ్నే..? ప్రస్తుత ప్రతిపాదనలో చెబుతున్నట్టుగా పార్లమెంటు నియోజకవర్గాలను యధాతథంగా జిల్లాలను చేస్తే ఏ విధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు అన్యాయం జరుగుతుందో కందుకూరు, సర్వేపల్లి నియోజకవర్గాలే ప్రత్యక్ష ఉదాహరణ.
జిల్లాలు శాశ్వతం, లోక్ సభ అశాశ్వతం..!
పార్లమెంటు నియోజకవర్గాలు శాశ్వతం కాదు. 2026లో మళ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కమిటి వస్తుంది. వారు మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలను కలగాపులగం చేసినా ఆశ్చర్యం లేదు. కానీ జిల్లా అలా కాదు. ఒకసారి ఏర్పాటు చేస్తే, ఇక కదపరు. ఆంధ్రాలో ఇలా వందేళ్లు దాటిన జిల్లాలు కూడా ఉన్నాయి. ఇప్పటి లోక్ సభ ప్రాతిపదిక జిల్లాలు ఏర్పాటు చేస్తే.., నెల్లూరు, ప్రకాశం రెండు జిల్లాల ప్రజలకు తీరని నష్టమని ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు…
చూడాలి.., మరి సర్వేపల్లిని నెల్లూరులో ఉంచుతారో లేక కందుకూరును నెల్లూరులో కలిపి ప్రకాశం జిల్లా కరువుకు మరింత ఆజ్యం పోస్తారో…? అంటే 2021 జనవరి వరకు వేచి చూడాల్సిందే..?