ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి అధికారాన్ని పదిలం చేసుకోవడం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిలో కొన్ని తప్పటడుగులు కూడా వేసి చేతులు కాల్చుకుంటున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేయడం దీని కిందికే వస్తుంది. అయితే, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ఇప్పుడు ఎన్ని నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నప్పటికీ అవి ఫలించేలా కనిపించడం లేదు. జగన్ ముఖం అంటేనే ప్రజలు తిరస్కరిస్తున్న పరిస్థితిలో.. వైఎస్ఆర్ సీపీ అధిష్ఠానం గెలుపుకోసం ఎన్ని ఎత్తులు వేసినప్పటికీ ఫలితం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
పది రోజుల క్రితం ముగిసిన తెలంగాణ ఎన్నికల సరళి నుంచి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఓ గుణపాఠం నేర్చుకున్నారు. దాన్ని సీరియస్ గా తీసుకొని మరీ తన పార్టీలో అమలు చేస్తున్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలపై స్థానిక ప్రజల్లో ఉన్న వ్యతిరేతను అంచనా వేయకుండా.. ఒకవేళ తెలిసినప్పటికీ సిట్టింగ్ లకే కేసీఆర్ అన్ని టికెట్లు ఇవ్వడంతో బీఆర్ఎస్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అసలు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఈ పరిణామాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు. వైఎస్‌ఆర్ సీపీలోనూ జనం నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు బొచ్చెడు మంది ఉన్నారు. అలా మొత్తం పార్టీలో 50 నుంచి 60 వరకూ లిస్టు తయారైందని కూడా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల కోసం వీరికి టికెట్ దక్కబోదనే ప్రచారం జోరందుకుంది.
దీంతో సహజంగానే సదరు ఎమ్మెల్యేలు తమకు టికెట్ దక్కదనే భావనతో గోడ దూకడానికి రెడీ అయ్యారు. అధిష్ఠానం తనను దూరం పెడుతుందని నిన్ననే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కాసేపటికే గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవన్‌రెడ్డి రాజీనామా చేశారు. తిప్పల నాగిరెడ్డి తనకు వయోభారం కారణంగా ఈసారి తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ అడగ్గా అధిష్ఠానం నుంచి తిరస్కరణ ఎదురైందట. అందుకే ఆయన కుమారుడు దేవన్ రెడ్డి బయటికి వచ్చేశారు. ఇలా మొదలైన పరంపరలో తర్వాత వికెట్ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అని భావిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీకి ఎమ్మెల్యేల నుంచి పార్టీకి రాజీనామాల రూపంలో షాక్ ల మీద షాక్ లు తగలబోతున్నట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి.
తెలంగాణలో కేసీఆర్ తేలిగ్గా తీసుకున్న విషయాన్ని ఏపీలో జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే, ఆ వ్యూహం ఇక్కడ పారబోదనే జగన్‌కు అర్థం కావడం లేదు. తెలంగాణ ప్రజలు ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతో ఉన్నారు కానీ, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా ఏనాడూ వద్దనుకోలేదు. తమ ఎమ్మెల్యేలను ఓడించాలనుకున్నారు కానీ, కేసీఆర్ ను గద్దె దించాలని చాలా మంది అనుకోలేదు. కానీ, చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత.. కేసీఆర్ సీటుకే ఎసరు పెట్టింది. ఇక్కడ ఏపీలో జగన్ విషయంలో సీన్ వేరు. ఎమ్మెల్యేలపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత కన్నా.. సీఎం జగన్‌పై ఉన్న వ్యతిరేకత ఎక్కువ. సీఎంగా అసలు జగన్మోహన్ రెడ్డిని మరోసారి చూడడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కేసీఆర్ కు తగిలిన సెగ తరహాలోనే జగన్ కు కూడా వచ్చే ఎన్నికల్లో అధికారం కోల్పోయే పరిస్థితే అధికమని ఇప్పటికే సొంత సర్వే రిపోర్టులు కూడా చెబుతున్నాయి.