ఏపీలో 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను విపరీతంగా ఆకట్టుకున్నారు. తాను ఉద్యోగ పక్షపాతిరి అని, సకాలంలో పీఆర్సీలు ఇస్తానని, డీఏలు చెల్లిస్తానని చెప్పేవారు. తాను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ తీసుకొస్తానంటూ ఉద్యోగులను విపరీతంగా తనవైపు ఆకర్షించారు. కట్ చేస్తే జగన్ ప్రభుత్వ అధికార గడువు కూడా ముగిసిపోతోంది. ఇంతవరకూ ఉద్యోగులకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా.. కనీసం జీతాలు కూడా సమయానికి ఇవ్వని పరిస్థితికి తెచ్చారు. ఇక డీఏలు, పీఆర్సీల బకాయిలైతే పేరుకుపోయాయి.
జగన్ అధికారం చేపట్టాక ఇప్పటి దాకా ఒక్క డీఏ బకాయిని కూడా చెల్లించలేదు. 2018 జూలై నుంచి 2021 డిసెంబరు వరకు ఉద్యోగులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డీఏ, 11వ పే రివిజన్ కమిషన్ బకాయిలు సుమారు రూ.19 వేల కోట్లకు చేరుకున్నాయి. 2023, జనవరి, జూలై డీఏలను ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రకటించలేదు. 2022 జూలై డీఏని 2023లో ప్రకటించారు. ఈ రెండు డీఏలకు కలిపి ఉద్యోగులకు దాదాపు రూ.7 వేల కోట్ల దాకా బకాయిలు అందాల్సి ఉంది. సీపీఎస్ ఉద్యోగులకు ప్రతి నెలా ప్రాన్ ఖాతాల్లో జమ చేయాల్సిన సొమ్మును కూడా సకాలంలో జమ చేయడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు.
సీపీఎస్ ఉద్యోగులు అందరికి సంబంధించి వారి జీతాల నుంచి ఏడాది కంట్రిబ్యూషన్ రూ.2300 కోట్లు, ప్రభుత్వ వాటా కూడా ఏడాదికి రూ.2300 కోట్లు ఉంటుంది. కానీ, ఈ ఏడాది మార్చి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నుంచి కంట్రిబ్యూషన్ సొమ్ము కట్ చేస్తున్నారు. కానీ, నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్‌కు చెల్లించట్లేదు. ఆ మొత్తం 8 నెలల బకాయిలు రూ.1,592 కోట్లుగా ఉందని అంచనా. మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్‌లు, ఏపీజేఎల్‌ఐ రుణాలు, రిటైర్ అయిన ఉద్యోగులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, వారి పీఆర్సీ, డీఆర్ బకాయిలు, జీపీఎఫ్ రుణాలు ఇతర బిల్లుల రూపంలో దాదాపుగా రూ.2,927 వేల కోట్లను ప్రభుత్వం నిలిపేసింది. అన్నీ కలిపి ఉద్యోగులకు ఈ నాలుగున్నరేళ్ల కాలంలో మొత్తంగా ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.31 వేల కోట్లకుపైగానే సొమ్మును ప్రభుత్వం కాజేసిందని ఉద్యోగులు వాపోతున్నారు.
ఈ సంగతి అటుంచితే కనీసం నెలనెలా ఇవ్వాల్సిన జీతాలు కూడా ఒకటో తారీఖు రాని పరిస్థితి దాపురించింది. ప్రతి నెలా 1న జీతాలు ఇచ్చే ప్రక్రియ మొదలవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. అలా జీతాల చెల్లింపు నెల సగం వరకు సాగుతూనే ఉంటోందని.. ఎవరికి ఏ రోజున, ఎన్ని రోజులు ఆలస్యంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ తాము ఈఎంఐలు కట్టలేక.. అప్పులు చేసుకొని జీవనం సాగించాల్సి వస్తోందని ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థిక సమస్యలు చెప్పుకోలేని విధంగా ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వంపై తీవ్రమైన అసహనంతో ఉన్న ఉద్యోగులు ఈసారి జగన్‌కు మద్దతు తెలిపేది లేదని తేల్చి చెప్పేశారు. ఇలాంటి వ్యక్తిని మరోసారి సీఎం చేయాలా? అని ఉద్యోగులు మండిపడుతున్నారు. అందుకే ఇక జగన్ మాకు అవసరం లేదని తేల్చి చెబుతున్నారు.











