రాజకీయాల్లో ఇందిరా గాంధీ హయాం నుంచి పాదుకున్న వ్యక్తి పూజా సంస్కృతి క్రమంగా తమిళనాడులో ఎంజీఆర్, జయలలితల జమానా వరకూ కొనసాగుతూ వచ్చింది. తమిళ ప్రజలు జయలలితకు, సినీ నటిమణులు ఖుష్బూ, నమితలకు కూడా ఆలయాలు నిర్మించి పూజలు చేస్తూ వ్యక్తి పూజా విధానాన్ని పరాకాష్టకు చేర్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అభిమాన నాయకులకు, హీరోలకు గుళ్ళు గోపురాలు అయితే పెద్దగా కట్టలేదు కానీ వీధివీధినా విగ్రహాలను నెలకొల్పే సంస్కృతిని బాగా పెంచి పోషించారు. ఈ కోవలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డిలు అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సంస్కృతి ప్రారంభమవుతోందా అనిపిస్తోంది? 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ల్యాండ్ సైడ్ విక్టరీ సాధించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ అభిమాని ఆలయాన్ని నిర్మిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం రాజంపాలెంలో జగన్ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వైసీపీ నేత కురకూరి నాగేశ్వర్‌రావు ఈ గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ గుడి నిర్మాణానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రావు శంకుస్థాపన చేశారు. జగన్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతోనే ఆయనకు గుడి కడుతున్నామని చెప్పడం విశేషం.
పాలకులుగా ప్రజా సంక్షేమానికి పాటుపడడం వారి విధి. ఈ విధులను సక్రమంగా నిర్వహిస్తే ప్రజలే వారి మనసుల్లో గుడి కట్టుకుని ఆరాధిస్తారు. అలా కాకుండా ఇలా బహిరంగంగా గుళ్లు గోపురాలు కడుతూ రాష్ట్రంలో కొత్త సంస్కృతిని తీసుకురావడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదీగాక రాజకీయనాయకుడిగా జగన్ కు ఉన్న అనుభవం ఏ పాటిదో అందరికీ తెలిసిందే. ఆయన పాద యాత్రలు చేస్తోన్న సమయంలో తలలపై చేతులు పెట్టి ఆశీర్వదించడం, ముద్దులు కురిపించడం వంటి చేష్టలతో విమర్శలు కూడా ఎదుర్కొనాల్సి వచ్చింది. సరే ముఖ్య మంత్రి అయ్యారు. తాను అనుకున్న విధంగా సంక్షేమ, అభివద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారనుకోండి. పాలనా క్రమంలో అవన్నీ సాధారణమే కానీ కొత్తగా జరుగుతున్నదేంటని అంటున్నారు. అంటే ఆయన తండ్రి వైఎస్సార్, ఎన్టీఆర్, తమిళనాడు తరహాలో తాను కూడా వ్యక్తి పూజా విధానాన్ని ప్రోత్సహిస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. తను చేసే మంచి ద్వారా ప్రజల మన్ననలు పొందాలి వారి హృదయాల్లో పదికాలాలపాటు గుర్తుండిపోవాలి అనుకోవాలే తప్ప ఇలా గుళ్ళు గోపురాలను ప్రోత్సహించడం ఏంటనే విమర్శలు వినవస్తున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి అంటే దేవుడు కాదని ప్రజాసేవకుడనే విషయాన్ని గుర్తుంచుకోవాలనే చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. వ్యక్తి ఆరాధన, వ్యక్తి పూజ ప్రజాస్వామ్య వ్యవస్థ సిద్ధాంతాలకు విరుద్ధం. సీఎం జగన్ ఇలాంటి ఆహ్వానించదగని, ఆమోదం పొందని కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మెజారిటీ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు!










