వలస కూలీలు,కొవిడ్ బాధితులు,నిరుపేదలకు,కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అండగా నిల్వడంతోపాటు అత్యవసర సమయాల్లో ఎంతోమంది ప్రాణాలు కాపాడేలా చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న నటుడు సోనూసూద్.తాజాగా తెలుగు రాష్ట్రాలకు సోనూసూద్ సహకారంతో అందుతున్న సేవలకు సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు,సోనూసూద్‌కు మధ్య ట్విట్టర్‌లో ఆసక్తికర సంభాషణ జరిగింది.
సూపర్ హీరో కచ్చితంగా సోనుసూద్..
తెలంగాణకు చెందిన ఒక కరోనా బాధితుడు ట్విట్టర్లో కేటీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.కేవలం పది గంటల్లోనే తాము కోరిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను అందించినందుకు ధన్యవాదాలు చెప్పడంతో పాటు కరోనా కష్టకాలంలో మీరెంతోమందికి సాయం చేశారు.మీ సహాయాన్ని మేం మర్చిపోలేమని,సూపర్ హీరో అని కేటీఆర్‌కు మెసేజ్ పెట్టాడు.ఇందుకు స్పందించిన కేటీఆర్ ‘బ్రదర్.. నేను ప్రజలతో ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని.నా వంతు బాధ్యత నేను చేస్తున్నా.మీరు చెప్పిన సూపర్ హీరో కచ్చితంగా సోనుసూద్.అతనికి కృతజ్ఞతలు చెప్పండి అంటూ కేటీఆర్.. సోనూసూద్‌ని ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చారు.దీంతో.. కేటీఆర్ ట్వీట్‌కు సోనూ సూద్ స్పందించారు.మీ ఆప్యాయతకు చాలా ధన్యవాదాలు.మీరు తెలంగాణ కోసం ఎంతో చేసిన హీరో.మీ నాయకత్వంలో తెలంగాణ ముందుకెళ్తోంది.నేను తెలంగాణను నా రెండో ఇంటిగా, నా వర్క్ స్టేషన్‌గా భావిస్తున్నాను.తెలంగాణ ప్రజలు నాపై చాలా ప్రేమను చూపిస్తారు అని ట్వీట్ చేశారు.ఈ ట్వీట్‌కు కేటీఆర్‌కు మరో రిప్లై ఇచ్చారు.‘చాలా ధన్యవాదాలు బ్రదర్.లక్షలాది మందికి స్పూర్తినిస్తూ మీరు ప్రారంభించిన గొప్ప పనిని కొనసాగించండి’అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సోనూసూద్ సాయం ఎంతో..
ఈ ఒక్క విషయంలోనే కాదు..తెలుగు రాష్ట్రాల్లో సోనూసూద్ చేస్తున్న సాయానికి సంబంధించిన ఘటనలెన్నో ఉన్నాయి.ఓ రైతుకు ట్రాక్టర్ బహుకరించడం,దివ్యాంగులకు సాయం చేయడం,అంధురాలికి జీవనోపాధి కల్పించడం లాంటి ఘటనలూ ఉన్నాయి.ఇక వలసకూలీలు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయడం, సొంత ఖర్చుల ద్వారా వాళ్లని ఇళ్లకు పంపడం అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.సినిమాల్లో విలన్‌గా నటిస్తున్న సోనూసూద్ నిజ జీవితంలో రియల్ హీరోగా ప్రశంసలందుకున్నారు.ఇక ఇటీవలి కాలంలోనూ తెలుగు రాష్ట్రాల్లో కొవిడ్ విషయంలో చాలామందికి అత్యవసరమైన సాయం చేశారు సోనూసూద్.ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న సోనూసూద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు అందుతున్నాయి.ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీజర్ బాక్సులు,ఆక్సిజన్ కాన్సట్రేటర్లు,ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొచ్చారు.జోగులాంబ గద్వాల జిల్లాకు ఫ్రీజర్ బాక్సులను పంపించేందుకు సిద్ధమయ్యారు.తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామాల సర్పంచుల విజ్ఞప్తుల మేరకు ఫ్రీజర్ బాక్సులను సరఫరా చేయనున్నారు.జోగులాంబ గద్వాల జిల్లా బొంకూరు,రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం అవుషాపూర్,వనపర్తి జిల్లా కొత్తపేట మండలం సంకిరెడ్డిపల్లి,కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తోగలగల్లు,మద్దికెర మండలం మద్దికెర,ఓర్వకల్లు గ్రామాలకు సాధ్యమైనంత త్వరగా ఫ్రీజర్ బాక్సులను పంపించనున్నట్లు ఆయా గ్రామాల సర్పంచులకు హామీ ఇచ్చారు సోనూసూద్.
అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్..
ఇవే కాకుండా ఇప్పటికే ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని తెలిపిన సోనూసూద్ దేశంలో వీలైనన్ని చోట్ల ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.www.umeedbysonusood.com వెబ్ సైట్‌లో ఆక్సిజన్ ఎక్కడికి పంపాలో చెబితే డీటీడీసీ ద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ పంపుతానని సోనూసూద్ తెలిపారు. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాలకు కాన్సన్ట్రేటర్లు వచ్చాయి.హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన రాఘవ శర్మ(75)కు కొరియర్ ద్వారా ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ పంపించిన విషయం తెలిసిందే.ఇక వరంగల్ జిల్లాలోని కరీమామాబాద్ కేంద్రంగా పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చారు సోనూసూద్. తద్వారా స్థానికంగా ఆక్సిజన్ అవసరమైన వారి ప్రాణాలు కాపాడేందుకు వీలు కల్పించారు.ఇక ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు కావాల్సిన వారు www.umeedbysonusood.com ద్వారా తమ వివరాలతో రిజిస్టర్ చేసుకున్నాక వచ్చే వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తే రిప్లై వస్తుందని,కార్యాచరణ మొదలవుతుందని సోనూసూద్ ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో రోజూ వేలాదిమంది నుంచి వినతులు వస్తున్న నేపథ్యంలో అమెరికా,ఫ్రాన్స్ నుండి కాన్సన్ ట్రేటర్లను తెప్పిస్తున్నారు సోనూసూద్.వీటితోపాటు రెండు తెలుగురాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు,నెల్లూరుతో పాటు తెలంగాణలోని సిద్ధిపేటలోనూ ఈ ప్లాంట్లు నిర్మాణం కానున్నాయి.