ఏపీలో ప్రభుత్వ స్కూళ్లకు సంబంధించి మరో వినూత్న ఆలోచన చేశారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. స్కూళ్లను దత్తత ఇవ్వాలనే కాన్సెప్ట్‌ను ముందుకు తెస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నాడు – నేడు పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. డబ్బా కొట్టుకుంది. కానీ క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులేమి జరగలేదు. కేవలం ఉన్న బడులకు రంగులు, కుర్చీలు, బల్లలు తప్ప పెద్దగా మారలేదు. స్కూళ్లలో వసతులు మెరుగుపడలేదు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కొత్త ఆలోచన చేస్తున్నారు.
విదేశాల్లో స్థిరపడిన ప్రముఖులు, దేశంలో మంచి స్థాయిలో ఉన్న దాతల సహకారం తీసుకున బడులు బాగు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మంచి స్థాయిలో ఉండి 50 ఏళ్లకు పైబడిన వారంతా ఒకప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో చదివిన వారే. అలాంటి వారిని కలిసి తాము చదివిన స్కూళ్లకు ఏదైనా మంచి చేయాలనే ఆలోచన కల్పిస్తే వారే ముందుకు వస్తారు. ఇందుకోసమే లోకేష్ బృందం ఓ ప్లాన్ రెడీ చేస్తోంది.
ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు తమ గ్రామాల్లోని స్కూళ్లను దత్తత తీసుకునేలా ఆయా స్కూళ్లకు అవసరమైన మౌలికసదుపాయాలతో ప్రత్యేకమైన వెబ్‌సైట్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు లోకేష్. కార్పొరేట్ సంస్థల సహకారాన్ని కూడా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏపీ విద్యావ్యవస్థలో అద్భుతమైన సంస్కరణలు తీసుకువచ్చి దేశానికే ఏపీ పాఠశాలలు ఆదర్శంగా నిలిచేలా లోకేష్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే టీచర్ల కొరత లేకుండా ఏటా డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించారు











