సంక్రాంతి వచ్చిందంటే చాలు వారం ముందు నుంచే ఏపీలో కోడి పందాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో ఈ సంసృతి ఎక్కువగా ఉంది. ఒక్క ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఏటా కోడి పందాల్లో రూ.150 కోట్లు చేతులు మారుతున్నాయని అంచనా. కోడికి కత్తి కట్టి పందేలు వేయడం నిషేధం. హైకోర్టు ఆదేశాలు ఉన్నా, గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాల్లో సంక్రాంతి నాటికి బరులు సిద్ధమవుతూ ఉంటాయి. ఎవరు అధికారంలో ఉంటే వారి అండదండలతో లక్షలు ఖర్చు చేసి బరులు ఏర్పాటు చేస్తారు. ఆయా బరుల్లో వేలాది మంది వారం పాటు పెద్ద ఎత్తున కోడి పందాలకు హాజరవుతుంటారు. అయితే, ఈ ఏడాది పోలీసులు కోడి పందాలపై ఉక్కుపాదం మోపారు.
ఎన్నడూ లేని విధంగా ..
కోస్తా జిల్లాల్లో ఇప్పటికే 40కు పైగా బరులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1300లకు పైగా కోడి కత్తులు, 300 మంది కోడి పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. సంక్రాంతి రోజు కోడి పందాల్లో పాల్గొన్నా, బరులు నిర్వహించినా బైండోవర్ కేసులు బనాయిస్తామని స్వయంగా ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చరించారు. కృష్ణా జిల్లా ఎస్పీ ఓ అడుగు ముందుకు వేసి ఎవరైనా కోడి పందాలు నిర్వహిస్తే తాట తీస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కృష్ణా జిల్లాలోనే 370 మంది పేకాట రాయుళ్లు, 66 మంది కోడి పందాళ రాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 16 పందెం కోళ్లు, 1238 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కంకిపాడు ప్రాంతంలో ఏర్పాటు చేసిన కోడి పందాల బరిని పోలీసులు ధ్వంసం చేశారు. నగదు కౌంటింగ్ మిషన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
భీమవరం కేంద్రంగా కోడి పందాలు
సంక్రాంతి వచ్చిందంటే ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు, పేకాట, గుండాటలు, అశ్లీల నృత్యాలు, కోత ముక్క పెద్ద ఎత్తున ఆడతారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడకు వచ్చి భీమవరం, కైకలూరు, ఉండి, రాజానగరం, రాజమండ్రి నగరాల్లో లాడ్జీల్లో వారం పాటు మకాం వేసి కోడి పందాలకు దిగుతుంటారు. ఇలాంటి వారికి పోలీసులు సీరియస్ హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జిలపై కూడా నిఘా పెట్టారు. ఎవరు ఏ పనిపై వచ్చారు. ఎన్ని రోజులు బస చేస్తారు, అనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఎవరైనా కోడి పందాల కోసం వస్తే గనుక వెంటనే వెళ్లిపోవాలని గోదావరి జిల్లాల ఎస్పీలు హెచ్చరించారు. ఇప్పటికీ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్ అమల్లోకి తీసుకువచ్చారు.
ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు
సంక్రాంతికి కోడి పందాలను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు, ఆయా జిల్లాల ఎస్పీలు హెచ్చరికలు జారీ చేశారు. కోడి పందాలు నిర్వహించినా, పాల్గొన్నా బైండోవర్ కేసులు తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీ నేతలకు కూడా అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తోంది. దీంతో కోడి పందాలపై మాట్లాడేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే పేకాట శిబిరాలతో ప్రభుత్వానికి భారీ డ్యామెజ్ జరిగిందని, ఇక కోడి పందాలకు కూడా గేట్లు ఎత్తి వేస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
రాజుగారి మీద కోపమే కారణమా?
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామరాజుపై ఉన్న ధ్వేషంతోనే సీఎం జగన్మోహన్‌రెడ్డి కోడి పందాలపై పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. తిరుగుబాటు ఎంపీ నియోజకవర్గంలోనే భారీగా కోడిపందాలు నిర్వహిస్తూ ఉంటారు. ఏపీలో ఎక్కడా జరగని విధంగా నరసాపురం పరిసరాల్లో కోడి పందాలు జరుగుతుంటాయి. వీటిని అరికట్టి కోడి పందాలకు బ్రేక్ వేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- పవన్ ప్రశ్న : జగన్‌రెడ్డీ లోపం మీలోనా.. మీ వ్యవస్థలోనా?