గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలను పదునుపెడుతున్నాయి. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన రాజకీయ ఎత్తుగడులను అమలుపరుస్తోంది. 150 డివిజన్లకు జరిగే ఎన్నికల్లో ఈసారి కనీసం 100 డివిజన్లకు ఏమాత్రం తక్కువ కాకుండా తమ ఖాతాలోకి వేసుకోవాలని టిఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ మొత్తం వర్కౌట్ చేస్తుంది. టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకుని బిజెపి పార్టీ కూడా ఈసారి ఎలాగైనా హైదరాబాద్ మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయాలని తహతహలాడుతోంది. 150 సీట్లల్లో 80 సీట్లు గెలుస్తామని బిజెపి నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తుంది.
జనసేన మైత్రిపై స్పష్టత ఇచ్చిన బండి..
అయితే తమతో కలిసి వచ్చే రాజకీయ శక్తులతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము సిద్ధమే అని సంకేతాలను బండి సంజయ్ తాజాగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో బిజెపి పార్టీతో జనసేనకు దోస్తీ ఉన్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేయాలనే డిమాండ్ కొన్నిరోజులుగా వినిపిస్తోంది. నిజామాబాద్ ఎన్నికల్లో, దుబ్బాక ఉపఎన్నికల్లో బిజెపి తమ మద్దతునిస్తున్నట్లు జనసేన ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలేదు. బిజెపి కూడా ఆ రెండు స్థానాల్లో జరిగే ఉప ఎన్నికలకు జనసేన మద్దతు ఇచ్చే విషయంలో అంతగా పట్టించుకోలేదని పార్టీ వర్గాల్లో టాక్. కానీ ప్రస్తుతం త్వరలో జరిగే జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పార్టీ కూడా పోటీ చేయబోతున్నట్లు సమాచారం. దీంతో మరొక్కసారి వీళ్ల పొత్తుపై చర్చ జరుగుతోంది.
జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ 150 డివిజన్ల కమిటీకి సంబంధించిన కసరత్తును చేపట్టారు. ఇప్పటికే దాదాపు 50 డివిజన్లకు సంబంధించిన కమిటీని కూడా ఖరారు చేశారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలోనే జనసేనాని డివిజన్ స్థాయి కమిటీల నియామకం చేపట్టడంలో బిజిీగా ఉంటున్నట్లు తెలిసింది. ఈక్రమంలో జనసేనతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలిస్తున్నారని తెలిపారు. తమతో కలిసి వచ్చే శక్తులతో పోటీ చేసేందుకు అంగీకారమే అన్నట్లు ఒక హింట్ కూడా ఇచ్చేశారు. అంటే ఈసారి జరిగే బల్దీయా ఎన్నికల్లో బిజెపి, జనసే పార్టీలు కలిసి బరిలో దిగి తమ సత్తా చాటనున్నాయి. వీరిద్దరి దోస్తీ ఏన్ని సీట్లను సాధించిపెడుతుంతో చూడాలి మరి.
ఇద్దరు పిల్లల నిబంధన టిఆర్ఎస్‌కే మైనస్..
టిఆర్ఎస్ పార్టీపై బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. ఇద్దరి పిల్లల నిబంధన తొలగింపు ప్రక్రియ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్‌కు ఉరితాడుగా మారబోతోందని విమర్శించారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీ చేసే అంశం పరిశీలిస్తున్నామన్నారు. నగరంలోని ఆంధ్ర, ఇతర రాష్ట్రాల సెటిలర్ల ఓట్లన్నీ తమకే అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పార్టీ పంచే డబ్బులు తీసుకుని ఓటు మాత్రం బిజెపికే వేయాలని ఆయన కోరారు. సిద్దిపేటను అభివృద్ధి చేసినట్లుగానే దుబ్బాక నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికలకు, నిజామాబాద్ ఎన్నికల ఫలితాలకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన తెలిపారు. దుబ్బాకలో బిజెపి పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మరో ఉద్యమకారుడు బిజెపి పార్టీ నుంచి అడుగుపెట్టబోతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. త్వరలో గ్రేటర్ నగరంలోని ప్రజా సమస్యలపై బండి సంజయ్ పర్యటించనున్నారు.