గుణశేఖర్ దర్శకుడిగా ‘శాకుంతలం’ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో టైటిల్ రోల్ ను సమంత చేయనుంది. త్వరలోనే మిగతా నటీనటుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నారు. రానాతో ‘హిరణ్యకశ్యప’ చేయవలసిన గుణశేఖర్, అందుకు ఇంకా సమయం ఉండటంతో ‘శాకుంతలం’ ప్రాజెక్టును గురించి ప్రకటించాడు. లేటెస్ట్ గా ఇందులో సమంత అక్కినేని.. శకుంతలగా నటిస్తోందని రివీల్ చేశాడు కూడా. అయితే ‘హిరణ్యకశ్యప’ పనులు పూర్తయ్యేలోగా చకచకా ఆయన ‘శాకుంతలం’ను చక్కబెట్టేస్తాడనే టాక్ వినిపిస్తోంది. కానీ నిజానికి ‘శాకుంతలం’ ప్రాజెక్టు అనుకున్నంత చిన్నది కాదు .. అది అంత వీజీ కూడా కాదు.
‘శాకుంతలం’ కథను ఎంచుకోవడం గుణశేఖర్ చేసిన సాహసమేననుకోవాలి. చిన్నపిల్లలతో రామాయణం సినిమాను దృశ్యకావ్యంగా మలిచి మెప్పించిన ఘనత ఆయన కెరియర్లో కనిపిస్తూనే ఉంటుంది. అయితే మిగతా కథలకు .. ‘శాకుంతలం’ కథకు తేడా ఉంది. ‘హిరణ్యకశ్యప’ విషయానికొస్తే భారీ సెట్స్ వేసి .. అక్కడక్కడా గ్రాఫిక్స్ ఉపయోగిస్తే సరిపోతుంది. కానీ ‘శాకుంతలం’ అలా కాదు .. ఈ కథ ప్రకృతితో పెనవేసుకుపోయి కనిపిస్తుంది. ఈ కథలో శకుంతలను .. ప్రకృతిని విడదీసి చూడలేం. కణ్వ మహర్షి ఆశ్రమం నేపథ్యంలో సాగే సన్నివేశాలలో ప్రకృతి ప్రధానమైన పాత్రను పోషిస్తుంది.
శకుంతల అందమైన ఉద్యానవనాల్లో విహరించడం .. అక్కడి కొండలు .. జలపాతాలు .. నెమళ్లు .. హంసలు .. లేళ్లు .. కుందేళ్లు .. ఇలా కథలో ప్రకృతికి ప్రధానమైన భాగం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఒక వైపున ఆశ్రమవాసుల జీవితాలను చూపిస్తూ, మరో వైపున దుశ్యంతుడి నేపథ్యంలో వచ్చే ‘హస్తినాపురం’ రాజ్యానికి సంబంధించిన సన్నివేశాలను చూపించవలసి ఉంటుంది. ఇటు ఆశ్రమ జీవితం .. అటు రాజరికం .. ఈ రెండింటికి అవసరమైన సెట్లు .. కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడమనేది చాలా సమయంతోను .. ఖర్చుతోనూ కూడుకున్నదే.
ఇక దుశ్యంతుడు రాక్షసులను సంహరించడం .. క్రూరమృగాలను వేటాడటం తప్పకుండా చూపించవలసిందే. అలాగే శకుంతల నదీ ప్రయాణం .. ఆమె ‘ఉంగరం’ జారిపోతే చేప మింగేయడం .. అది జాలరుల బృందానికి లభించడం మరో కోణం. ఇలా అలనాటి నేపథ్యంలో కథను వివిధ కోణాల్లో చూపిస్తూ .. ఒక దృశ్యకావ్యంలా అద్భుతంగా ఆవిష్కరించవలసి ఉంటుంది. కనుక గుణశేఖర్ తలపెట్టింది సాధారణమైన కార్యమేమీ కాదు .. అదో యజ్ఞం. అనుకున్న విధంగా దానిని పూర్తిచేసే సమర్థుడే ఆయన. కాకపోతే కథాకథనాల పరంగా .. కాస్ట్యూమ్స్ పరంగా .. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా .. చిత్రీకరణ పరంగా ఎక్కువ సమయం తీసుకునే అవకాశం మాత్రం కనిపిస్తోంది.