మనిషి.. సినిమా- ఈ రెండు పదాలూ ఒకదానితో ఒకటి దగ్గర సంబంధం ఉన్నవే. సినిమా అనే మాట ఒకసారి మనిషి మనసులో పడిందంటే అది సునామీ లాగే పరుగులు పెట్టేస్తుంది.
వరంగల్ నుంచి ఓ 13 ఏళ్ల కుర్రాడు చెన్నై చెక్కేయడం వెనక కూడా కారణం అలాంటిదే. బాబాయి ఫొటో స్టూడియో నడుపుతుంటే అక్కడికి వెళ్లి పని నేర్చుకోవడం, ఆ దగ్గర్లో ఉన్న సినిమా థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసేయడం.. ఇదీ రోజూ ఆ కుర్రాడి దినచర్య. అలా ‘ఇల్లరికం’ సినిమాని ఓ పదిహేను సార్లు చూసేశాడు. ఓ ఫైన్ మార్నింగ్ చెన్నై చెక్కేయడానికి భీజం ఆ సినిమానే అనుకోవాల్సి ఉంటుంది. వరంగల్ లో జీరోగా స్టార్ట్ అయిన ఆ కుర్రాడి జీవితం స్టార్ కెమెరా మేన్ స్థాయికి చేరుతుందని ఎవరైనా ఊహించగలరా? నాటి ఆ కుర్రాడే నేటి సీనియర్ మోస్ట్ కెమెరా మేన్ వి. జయరాం. అటు మలయాళం, ఇటు తెలుగు సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్ గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారాయన. తెలుగులో నందమూరి తారక రామారావు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాలకూ, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి హీరోల సినిమాలకూ పనిచేసి మంచి గుర్తింపు తెచుకున్నారు. సినిమా రంగంలో ఆయన అనుభవాలను ‘లియో న్యూస్’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే అవేంటో తెలుసుకుందాం.
* సినిమాల కారణంగా చదువు నా బుర్రకెక్కలేదు. ఏమైనా సరే సినిమాల్లోకి వెళ్లాల్సిందే అనుకుని ట్రైన్ ఎక్కేశాను. టిక్కెట్ కూడా తీసుకోలేదు. జేబులో ఐదు రూపాయలే ఉన్నాయి. విజయవాడలో దిగిపోయా. కృష్ణా నదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి వెళ్లి ‘అంతా నీదే దయ తల్లీ’ అని చెప్పి మద్రాసు వెళ్లిపోయా. అప్పుడు నా వయసు పదమూడేళ్లు. అలా అనుకోకుండా ప్రముఖ దర్శకుడు గుత్తా రామినీడుగారిని కలిశా. ఆయన ఆంధ్రా క్లబ్ లో ఉద్యోగం ఇప్పించారు. ఆ తర్వాత అది సినిమా ఎడిటింగ్ కు మారింది.
* పగలు ఆంధ్రాక్లబ్, రాత్రి ఎడిటింగ్ పని చేయడంతో మూడున్నర నెలల్లోనే నా ఆరోగ్యం దెబ్బతింది. అయినా సినిమా మీదున్న వ్యామోహం నన్ను అక్కడి నుంచి కదలనివ్వలేదు. క్లబ్ లో ఉన్నప్పుడే నిర్మాత ఆనంద్ బాబుగారిని కలిశాను. ఆయన 1968 జనవరిలో అసిస్టెంట్ కెమెరా మేన్ గా జాయినవ్వమన్నారు. అలా మొదటిసారి కృష్ణగారి‘మోసగాళ్లకు మోసగాడు’కు పనిచేశాను. ఎన్టీఆర్ గారితో ‘మంచికి మరో పేరు’, ‘డ్రైవర్ రాముడు’, ‘వేటగాడు’, ‘సింహబలుడు’ లాంటి సినిమాలకు చేశాను. ఆయన ఆఖరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’కు కూడా నేనే చేశాను.
* సినిమాటోగ్రాఫర్ గా మొదటి సినిమా కె. బాలచందర్ దర్శకత్వంలో పనిచేశాను. చిరంజీవిగారు ఆ సినిమాలో హీరో. ఆయన సినిమాలు చేయకముందు నుంచి కలిసి తిరిగేవాళ్ళం. సినిమాటోగ్రాఫర్ గా ‘షిరిడీ సాయిబాబా మహత్యం’ మంచి గుర్తింపు వచ్చింది. మలయాళంలో మమ్ముట్టికి నేనంటే చాలా గౌరవం. మోహన్ బాబుతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన సొంత బ్యానర్ లో ఎనిమిది సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేశాను. ఆయన నటించిన 501వ సినిమా ‘రాయలసీమ రామన్న చౌదరి’కి కూడా నేనే సినిమాటోగ్రాఫర్.
* సినీ నటి సౌందర్య చనిపోయినప్పుడు చాలా బాధ కలిగింది. ‘శివ శంకర్’ సినిమాలో ఆమె చనిపోయే ఆఖరి సన్నివేశాన్ని నేనే చిత్రీకరించాను. ఆ తర్వాత ఆమె నిజంగా చనిపోయింది. దర్శకుడు రాఘవేంద్రరావుగారి మొదటి సినిమాకి నేను అసిస్టెంట్ కెమెరామెన్. ఆ తర్వాత ‘పెళ్లి సందడి’, ‘పరదేశి’, ‘ఇద్దరు మిత్రులు’, ‘పాండురంగడు’ లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా చేశా.
* సినిమాటోగ్రాఫర్ గా ఎక్కువకాలం కేరళలోనే ఉండిపోయాను. దాదాపు 12 సంవత్సరాలు అక్కడే ఉన్నా. ఇప్పటికీ యాక్టివ్ గా పని చేయడానికి రెడీగా ఉన్నా. రాజకీయాల విషయానికి వస్తే నందమూరి తారక రామారావుగారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత నేనూ, రాఘవేంద్రరావుగారూ ఇంకా అనేకమంది ఆయన వెనకే ఉన్నాం.
* నేను ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోని వెబ్ సిరీస్ లో సినిమాటోగ్రాఫర్ గా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఇక కుటుంబం విషయానికి వస్తే నాకు ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. ఇప్పటికీ నేను సినిమాలు కానీ, వెబ్ సిరీస్ కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు.
సీనియర్ సినిమాటోగ్రాఫర్ వి. జయరాం పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ కింద వీడియో చూడండి.











