ఏపీలో రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీ తిరిగి అధికారంలోకి రావాలని చూస్తోంది. అందులో భాగంగానే ఇన్ని రోజులు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్రను మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర 21 రోజులపాటు .. 21 లోక్‌సభ నియోజకవర్గాల్లో జరగనుంది. మేమంతా సిద్ధం పేరుతో నిర్వహిస్తున్న సభలకు జనాలు పెద్దగా రావడం లేదు. జనాలు రావడం లేదనడం కంటే జగన్ సభలపై జనాలు ఆసక్తి చూపడం లేదు. ఇదే విషయాన్ని గ్రహించిన పార్టీ నేతలు బస్సు యాత్రకి సంబంధించి వ్యూహాం మార్చాలని ఆదేశించారు. అయితే బస్సు యాత్రకి సంబంధించిన ప్లాన్ ఐ ప్యాక్ టీమ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఐ ప్యాక్ టీమ్ చెప్పిన ప్లాన్ ప్రకారం వెళ్తుంటే ఫలితాలు అంతగా రావడం లేదు.
జగన్ సభలపై వైసీపీ వ్యూహం మార్చాలని ఐ ప్యాక్ టీమ్‌కి పార్టీ పెద్దల వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రెండురోజులుగా జరుగుతున్న మేమంతా సిద్ధం సభలపై వస్తోన్న ఫీడ్ బ్యాక్‌ను చూసి తన స్ట్రాటజీ మార్చుకోవాలని ఐ ప్యాక్ టీమ్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సభలకు జనాలు రాకపోవడంపై పునరాలోచనలో పార్టీ పెద్దలున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకొని వాటిని మార్పు చేసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. మేమంతా సిద్ధమంటూ ఇడుపులపాయ నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన బస్సుయాత్ర మొక్కుబడిగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు ఇలాంటి విమర్శలు చేస్తుంటే అర్థం చేసుకోవచ్చు… గానీ సొంత పార్టీ నుంచే బస్సుయాత్రపై నిట్టూర్పులు వినపడుతున్నాయి. బస్సుయాత్ర నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుందని ఐ ప్యాక్ టీమ్‌తోపాటు పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బస్సుయాత్ర ఈ నెల 27న ఇడుపులపాయలో మొదలై ప్రొద్దుటూరులో బహిరంగ సభతో కడప జిల్లాలో ముగించారు. అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డకు బస్సుయాత్ర చేరుకుంది.. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరిగి యాత్ర ప్రారంభమైంది. ఈ సభల సందర్భంగా కనీసం స్థానిక వైసీపీ నాయకులతో ఏం జరుగుతోందన్న మాట కూడా పార్టీ అధినేత జగన్ నుంచి లేకపోవడంతో పార్టీ నాయకుల్లో నిరాశ నెలకొంది. దానికి తోడు నియోజకవర్గానికి 50 మందితో మాత్రమే జగన్ ఫొటోలు తీసుకుంటారనే నిబంధన విధించినట్టు తెలుస్తోంది. ఇదే నిబంధనో అర్థం కాకుండా ఉంది. ఈ నిబంధనతో వైసీపీ శ్రేణులు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. ఆళ్లగడ్డలో జరిగిన సభ సమయంలో నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై కనీసం సిటింగ్ ఎమ్మెల్యే బ్రిజేంద్ర నాథ్‌రెడ్డితో కూడా జగన్ చర్చించిన పాపాన పోలేదన విమర్శలు వినపడుతున్నాయి. మేధావులు, తటస్థులతో సమావేశం అంటూ మమ అనిపించారనే విమర్శలొస్తున్నాయి.
బస్సుయాత్ర ఉద్దేశమే… స్థానిక వైసీపీ నాయకులతో మాట్లాడ్డం… ఏవైనా అసంతృప్తులు వుంటే సర్దుబాటు చేయడం… అలాగే భవిష్యత్‌పై భరోసా కల్పించేలా స్థానికులను వెన్నుతట్టి ప్రోత్సహించడం. ఇలాంటివి చేస్తారని వైసీపీ నేతలు భావించారు. కానీ ఇవి ఏవీ కూడా మచ్చుకైనా జగన్ బస్సుయాత్రలో కనిపించలేదు. దీంతో బస్సు యాత్ర తీరుతో వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ నేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర లాగా ఉండాలి అని.. లోకేశ్ అందరితో సెల్ఫీలు దిగడం, గ్రామ, మండల స్థాయి నాయకులతో మాట్లాడుతూ వెళ్లారని.. దాంతో టీడీపీ శ్రేణుల్లో ఎంతో ఉత్సాహం నింపారని వైసీపీ నేతలే అంటున్నారు. కానీ జగన్ బస్సుయాత్రలో అటువంటివి ఏమీ లేకుండా ఇదే రీతిలో సాగితే మాత్రం… టైమ్ , ఖర్చులు వేస్ట్ అనే మాట వైసీపీ నేతల నుంచి వినిపిస్తోంది.