ఏపీలో అన్ని స్థానాల్లో విజయం మనదే అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఏపీ సీఎం జగన్. మాటల్లో కనిపించిన కాన్ఫిడెన్స్ ఆయన మొహంలో కనిపించడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధుల ప్రకటన సమయంలో ముఖ్యమంత్రితో పాటు వైసీపీ నాయకుల్లో ఉత్సాహం కొరవడింది. అధికార పార్టీ పెద్దలంతా నీరసంగా కనిపించారు. విశాఖ పోర్టులో డ్రగ్స్ దొరికిన తర్వాత జగన్ టీమ్ టెన్షన్ మరింత పెరిగింది. అదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో.. తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు భవిష్యత్తు కళ్ల ముందు కనిపించినట్లయింది. అధికారం కోల్పోయిన కేసీఆర్, పవర్లో ఉండగానే కస్టడీలోకి వెళ్లిన కేజ్రీవాల్ ఘటనలు జగన్ అండ్ కోని టెన్షన్ పెడుతున్నాయి.
ఎలాగైనా అధికారంలోకి రావాలి.. పర్మనెంట్‌గా పవర్లో ఉండాలనే కోరికను వైసీపీ అధినేత జగన్ ఏనాడు దాచుకోలేదు. తప్పులు చేసి ప్రత్యర్దులపై నిందలు వేయడం, నాటకాలతో జనాన్ని మోసం చేయడంలో జగన్ ఎప్పుడో ఆరితేరిపోయారు. ప్రజామోదంతో పని లేకుందా.. దొంగ ఓట్లు, ప్రతిపక్షాల సానుభూతిపరులు ఓట్ల తొలగింపుతో మరోసారి సీఎం సీటు కూర్చోవడానికి ఏపీ ముఖ్యమంత్రి చేస్తున్న నీతిమాలిన వ్యవహారాలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉన్నాయి. బటన్ పథకాలతో జనానికి సొమ్ములు పంచడంతో విజయం మనదే అని ఊదరగొట్టేస్తున్నారు. పైకి ఎన్ని చెప్పినా.. జగన్ టీమ్‌లో ఓటమి భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దేశంలో తిరుగులేని ప్రజాదరణతో ఉన్న భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవడంతో వైసీపీ ఆశలు ఆవిరైపోయాయని విశ్లేషకులు అభిప్రాయం.
సొంత ఇమేజ్ పెంచుకోవడంలో బటన్‌తో బిజీ అయిపోయిన సీఎం జగన్ ఏపీ ఇమేజ్‌ను భారీగా డ్యామేజ్ చేశారు. ఎవరో విదేశీ కంపెనీలు, పక్క రాష్ట్రాల ఇన్వెస్టర్లు కాదు కదా.. వైసీపీ ముఖ్య నాయకులే సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సాహసం చేయలేకపోతున్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో ముఖ్యమంత్రి ఆయన సన్నిహితులతో పాటు వైసీపీ నాయకులంతా వందలు, వేల కోట్లు వేనకేసుకున్న విషయం బహిరంగ రహస్యం. అయితే ఈ డబ్బంతా ఎక్కడికి పోయింది అంటే సమాధానం ఉండదు. కబ్జా చేసిన భూములు అమ్ముకోవడం ద్వారా.. ఇసుక, మద్యం విక్రయాలతో వచ్చిన డబ్బంతా పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిపోతుందనే వాదన వినిపిస్తోంది.
ఒకసారి రాష్ట్రం దాటిపోయిన డబ్బు తిరిగి రావడం లేదు. విశాఖలో పట్టుబడిన డ్రగ్స్ వ్యవహారం తర్వాత.. వైసీపీ బడా నేతలు తమ అక్రమ సంపాదనతో డ్రగ్స్ దందా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గంజాయి అక్రమ రవాణా, ఎర్ర చందనం స్మగ్లింగ్ వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా వెనకేసుకొంటున్న వేల కోట్లు చాలవన్నట్లు.. పేదల భూములు, ఆస్తులను కబ్జా చేస్తున్నారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మర్చడానికి కోడికత్తి, వివేకానందరెడ్డి హత్య, గీతాంజలి మరణం వంటి అంశాలను తెరపైకి తెస్తున్నారు. డబ్బు, అధికారంపై వ్యామోహమే తప్ప ప్రజలకు మేలు చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన్న ధ్యాస వైసీపీ అధినేత జగన్‌కు కొంచెం కూడా లేదని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ.
అధికారం పోతే తన పరిస్థితి ఎలా ఉంటుందో.. తెలంగాణలో బీఆర్ఎస్ అవస్థలు చూశాక జగన్ టీమ్‌కి బాగా అర్ధమైంది. కేసీఆర్ ప్రభుత్వంతో పోల్చుకొంటే జగన్ పాలన మరింత అరాచకంగా సాగింది. వైసీపీ విధానాలను ప్రశ్నించిన వారిపై పగ సాధించే రీతిలో ఒకవైపు పోలీసు కేసులు, మరో వైపు పార్టీ శ్రేణులతో దాడులతో ప్రజలను బెంబేలెత్తించారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగతంగా నీచాతి నీచమైన మాటలు వదిలారు. ఇన్ని దారుణాలు చేసి తర్వాత అధికారం కోల్పోతే తన పరిస్థితి కేసీఆర్ కంటే ఘోరంగా, అధ్వాన్నంగా ఉంటుందనే ఆందోళనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. జగన్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టి, వైసీపీ నేతల తప్పులకు శిక్ష వేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు. ప్రజల మద్దతు కోల్పోయిన జగన్‌ను వదిలించుకొని.. తెలుగుదేశం, జనసేన కూటమితో చేతులు కలపడంతో ఢిల్లీలో లెక్కలు పూర్తిగా మారిపోయాయని స్పష్టమవుతోంది.
తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు సహకరించిన అధికారులు ఊచలు లెక్క పెడుతున్నారు. ఇక భూముల వ్యవహారంపై విచారణ ప్రారంభమైతే, ఇంకెన్ని బాగోతాలు బయటికొస్తాయే చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీలో జగన్ సర్కారు ఐదేళ్ల పాలనలో అంతకు మించి దోపిడీ చేసింది. వైసీపీ నేతలు కబ్జా చేసిన భూముల విలువ లక్షల కోట్లలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పదని మెజార్టీ సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత తన భవిష్యత్తు ఏమిటనే భయం జగన్‌ను వెంటాడుతుందనే చర్చ నడుస్తోంది.











