ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా ప్రారంభించాయి. ఇప్పటివరకు మూడేసి మ్యాచ్‌లు ఆడిన రెండు టీమ్‌లూ రెండేసి విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో రాజస్థాన్ నాలుగో స్థానంలోనూ, బెంగళూరు ఐదో స్థానంలోనూ ఉన్నాయి. శనివారం జరిగే మ్యాచ్‌లో ఈ సీజన్‌లో తొలిసారి పోటీ పడబోతున్నాయి.
తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి మంచి జోరు మీదున్న రాజస్థాన్‌కు బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చెక్ పెట్టింది. ఇక, బెంగళూరు జట్టు హైదరాబాద్, ముంబైపై గెలుపొంది పంజాబ్ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్‌లో తొలిసారిగా డబుల్ హెడర్ మ్యాచ్‌లు శనివారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అబుదాబిలోని శనివారం మధ్యాహ్నం 3:00 గంటలకు జరిగే తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోటీ పడుతున్నాయి. మరి, విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
బెంగళూరు బలాలు
అరోన్ ఫించ్, దేవదత్ పడిక్కళ్ చేరిక బెంగళూరు టీమ్‌కు ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది. ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న ఈ ఇద్దరూ బెంగళూరుకు అదిరిపోయే ఆరంభం ఇస్తున్నారు. ప్రత్యర్థి టీమ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఇక, చివర్లో ఏబీ డివిల్లియర్స్ తన మార్క్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటుతున్నాడు. కోహ్లీ కూడా ఫామ్‌లోకి వస్తే బెంగళూరు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడం కష్టం కాదు. ఇక, బెంగళూరు బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉంది. ముఖ్యంగా చాహల్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముంబైతో మ్యాచ్‌లో నవదీప్ షైనీ అదరగొట్టాడు.
బలహీనతలు
`కింగ్` కోహ్లీ ఇంకా ఫామ్‌లోకి రాకపోవడం బెంగళూరును కలవరపెడుతోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ కోహ్లీ తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అలాగే డేల్ స్టెయిన్, ఉమేష్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లు పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. ప్రత్యర్థి టీమ్‌కు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీంతో వీరిని టీమ్‌లో నుంచి తప్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగే లోయర్ మిడిలార్డర్‌లో డివిల్లియర్స్‌కు తోడుగా ఎవరూ నిలవడం లేదు. ఆల్‌రౌండర్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు.
బెంగళూరు టీమ్ (అంచనా)
అరోన్ ఫించ్, దేవదత్, కోహ్లీ, డివిల్లియర్స్, శివమ్ దూబే, గుర్కీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, ఉదానా, నవదీప్ షైనీ, చాహల్, ఆడమ్ జంపా
రాజస్థాన్ టీమ్ బలాలు
ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ ఈ సీజన్‌లో అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. కోల్‌కతాతో మ్యాచ్‌లో మినహా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అద్బుత ప్రదర్శన చేసింది. సంజూ శాంసన్, కెప్టెన్ స్మిత్ రాహుల్ తెవాటియా భీకర ఫామ్‌లో ఉన్నారు. దీంతో ఈ సీజన్‌లో రాజస్థాన్ టీమ్ అత్యంత బలంగా కనబడుతోంది. ఇక, బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, టామ్ కర్రన్ చక్కని సమన్వయంతో బౌలింగ్ చేస్తున్నారు. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కర్రన్ బ్యాట్‌తో కూడా రాణించి అర్ధ శతకం సాధించాడు.
బలహీనతలు
కోల్‌కతాతో జరిగిన మ్యాచ్ రాజస్థాన్ టీమ్‌లోని లోపాలను బయటపెట్టింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మూకుమ్మడిగా విఫలమయ్యారు. ఫలితంగా రాజస్థాన్ ఈ సీజన్‌లో తొలి ఓటమిని మూటగట్టుకుంది. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఏకంగా 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్ టీమ్ ఈ మ్యాచ్‌లో 174 పరుగులు చేయలేకపోయింది. ఊతప్ప వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు.
రాజస్థాన్ టీమ్ (అంచనా)
జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, ఊతప్ప, రాహుల్ తెవాటియా, పరాగ్, టామ్ కర్రన్, జొఫ్రా ఆర్చర్, అంకిత్ రాజ్‌పుత్, శ్రేయాస్ గోపాల్, జయదేవ్ ఉనద్కత్.
మ్యాచ్ ఫేవరెట్
ఐపీఎల్‌లో బెంగళూరు, రాజస్థాన్ జట్లు తలపడిన చివరి నాలుగు మ్యాచ్‌ల్లో అన్ని సార్లూ విజయం రాజస్థాన్‌నే వరించింది. అయితే బెంగళూరు టీమ్ ఇప్పుడు గతంలోలా లేదు. రాజస్థాన్‌కు పోటీగా ఎదిగింది. సీనియర్లకు తోడు దేవదత్, షైనీ వంటి వారు కూడా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఈ రెండు టీమ్‌ల మధ్య జరుగబోయే ఈ మ్యాచ్ చాలా ఆసక్తికరం అనడంలో సందేహం లేదు.











