ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘనంగా ప్రారంభించింది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి బలమైన చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును మట్టికరిపించింది. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, జొఫ్రా ఆర్చర్ విజృంభణతో చెన్నైపై సునాయాసంగా గెలుపొందింది. ఇక, ఉత్కంఠభరిత తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన పంజాబ్ కింగ్స్ లెవెన్.. బెంగళూరుతో జరిగిన రెండో మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది.
కెప్టెన్ రాహుల్ (132 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ఏకంగా 97 పరుగులతో బెంగళూరును పంజాబ్ చిత్తు చేసింది. గత మ్యాచ్‌ల్లో విజయాలు ఇచ్చిన ఉత్సాహంతో ఇరు జట్లూ ఆత్మవిశ్వాసంతో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు షార్జా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. మరి, ఈ రెండు టీమ్‌లలో ఏ జట్టు విజయ పరంపరను కొనసాగిస్తోందో చూడాలి.
రాజస్థాన్ రాయల్స్ బలాలు
సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ వంటి హార్డ్ హిట్టర్లతో రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ విభాగం బలంగా కనబడుతోంది. ఆదివారం జరగబోయే మ్యాచ్‌కు జాస్ బట్లర్ కూడా అందుబాటులోకి రాబోతున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే రాజస్థాన్ టీమ్‌కు మరింత బలం చేకూరినట్టే. మరోవైపు జొఫ్రా ఆర్చర్ ఆల్‌రౌండ్ ప్రతిభ రాజస్థాన్‌ను మరింత బలోపేతం చేస్తోంది. స్టార్ ప్లేయర్స్ లేకపోయినా ఉన్న ఆటగాళ్లందరూ సమష్టిగా రాణిస్తుండడం రాజస్థాన్‌కు కలిసొస్తోంది. లెగ్ స్పిన్నర్ రాహుల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు.
బలహీనతలు
రాజస్థాన్ జట్టులో ఓపెనింగ్, మిడిలార్డర్ సమస్యలు ప్రధానంగా కనబడుతున్నాయి. జాస్ బట్లర్ రాకతో ఓపెనింగ్ సమస్య తీరినట్టే. అయితే మిడిలార్డర్‌లో అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ లేకపోవడం సమస్యగా కనిపిస్తోంది. మిడిలార్డర్‌లో డేవిడ్ మిల్లర్, రాబిన్ ఊతప్ప ఫామ్‌లో లేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. ప్రధాన బౌలర్ జయదేవ్ ఉనద్కత్ తొలి మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఏకంగా 11 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. అలాగే శ్రేయాస్ గోపాల్, టామ్ కర్రన్ కూడా భారీగా పరుగులు సమర్పించుకోవడం రాజస్థాన్ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది.
రాజస్థాన్ జట్టు (అంచనా)
జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్, డేవిడ్ మిల్లర్, రాబిన్ ఊతప్ప, రాహుల్ తెవాటియా, టామ్ కర్రన్, జెఫ్రా ఆర్చర్, జయదేవ్ ఉనద్కత్, శ్రేయాస్ గోపాల్
పంజాబ్ కింగ్స్ లెవెన్ బలాలు
తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైన పంజాబ్ రెండో మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుంది. కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ కారణంగా బెంగళూరుపై భారీ విజయం సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ నిలిచాడు. రాహుల్ ఇదే ఫామ్ కొనసాగిస్తే ప్రత్యర్థి టీమ్‌కు ఇబ్బందులు తప్పవు. మరో బ్యాట్స్‌మెన్ మాయంక్ అగర్వాల్ కూడా అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ మయాంక్ బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. ఇక, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ బంతితో అద్భుతంగా రాణిస్తున్నారు. వీరు ముగ్గురు సమష్టిగా ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయగలుగుతున్నారు.
బలహీనతలు
రాజస్థాన్ టీమ్‌లాగానే పంజాబ్ కూడా ప్రధానంగా మిడిలార్డర్ సమస్యను ఎదుర్కొంటోంది. ఓపెనర్లు ఇచ్చిన శుభారంభాలను సద్వినియోగం చేసుకోలేకపోతోంది. మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్ ఫామ్‌లో లేకపోవడం పంజాబ్ టీమ్‌ను కలవరపరుస్తోంది. తొలి మ్యాచ్‌లోని లోపాలను సరిద్దిద్దుకుని రెండో మ్యాచ్‌లో పంజాబ్ గెలుపొందింది. ఇక, మిడిలార్డర్ వైఫల్యాన్ని సరిదిద్దుకోవడంపై టీమ్ దృష్టి సారించాలి.
పంజాబ్ జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పూరన్, మ్యాక్స్‌వెల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్‌ఖాన్, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, కాట్రెల్, రవి బిష్ణోయ్
మ్యాచ్ ఫేవరెట్
గత మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలతో రెండు టీమ్‌లూ ఉత్సాహంగా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లూ పెద్దగా అంచనాలు లేకుండానే బరిలోకి దిగాయి. స్టార్స్‌ను కాకుండా సమష్టిగా రాణించడంపైనే దృష్టి సారించాయి. ఆదివారం జరుగబోయే మ్యాచ్‌లో ఇరు జట్లకూ సమాన విజయావకాశాలున్నాయి. అయితే జట్టుగా చూస్తే పంజాబ్ కంటే రాజస్థాన్ కాస్త బలంగా కనబడుతోంది.











