(అమరావతి నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు యువనేతలతో టీంను సిద్దం చేసుకున్నారు. ఆరు నెలలు తీవ్ర కసరత్తు చేసిన చంద్రబాబునాయుడు, టీడీపీలో యువతకు పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది. 25 పార్లమెంటు నియోజకవర్గాలకు 25 మంది అధ్యక్షులతోపాటు, ప్రతి రెండు పార్లమెంటు స్థానాలకు ఒకరిని ఇంఛార్జిగా నియమించనున్నారు. అరకు పార్లమెంటు ఒక్క స్థానానికే ఒక ఇంఛార్జిని నియమిస్తారని తెలుస్తోంది. ఇక 13 జిల్లాలకు ప్రతి జిల్లాకు సమన్వయకర్తను నియమించాలని టీడీపీ అధినేత నిర్ణయించారని సమాచారం.
నేడు విడుదల
టీడీపీలో కార్యవర్గం ప్రకటన కోసం 6 నెలలుగా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పదవులు ఆశించే వారి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చన్నాయుడుతోపాటు, కీలక పదవులను భర్తీ చేయనున్నారు. గుంటూరు పార్లమెంటుకు పార్టీ అధ్యక్షుడిగా శ్రావణ్ కుమార్, నరసరావుపేటకు జీవీ ఆంజనేయులు, బాపట్లకు అనగాని సత్యప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో యువతకు పదవులు ఇచ్చి ప్రోత్సహించాలని టీడీపీ అధినేత తీవ్ర కసరత్తు చేశారని సమాచారం. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచీ ఉన్న సీనియర్ నాయకులే నేటికీ పెత్తనం చెలాయిస్తున్నారు. వారి పెత్తనాన్ని ఆయా ప్రాంతాల్లో యువత జీర్ణించుకోలేకపోతోంది. పార్టీలో కష్టపడ్డ యువతను ఎదగనీయరని భావిస్తున్నారు. అందుకే పెద్దలను పక్కకు పెట్టి యువతకు పగ్గాలు అప్పగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
యువ నాయకత్వంతో ప్రజలకు చేరువ కావడమే లక్ష్యం
ఓటమి ఎన్నో పాఠాలు నేర్పుతుంది.2019 ఎన్నికల్లో ఓటమి తరువాత తెలుగుదేశం పార్టీ కారణాలను 6 నెలలుగా పరిశీలించారు. సమస్యలు తెలుసుకొని చికిత్స మొదలుపెట్టారు.పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి మరో మూడు దశాబ్దాలకు సరిపడా ఊపిరి పొయ్యడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. నాయకులతో సుదీర్ఘ సంప్రదింపులు చేసి నూతన విధానంలో పార్టీకి యువఉత్తేజం తేవాలని నిర్ణయించారట. ప్రజలకు మరింత చేరువవ్వడం,ఎక్కువ మంది యువ నాయకత్వానికి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.ఇప్పటి వరకూ తెలుగుదేశం పార్టీ లో ఉన్న జిల్లా పార్టీ విధానం స్థానంలో పార్లమెంట్ పార్టీ విధానాన్ని తీసుకురానున్నారని స్పష్టం అవుతోంది.











