ఏపీలో మద్యం ప్రియులకు శుభవార్త. ఇప్పటిదాకా కోరుకున్న మద్యం దొరక్క నానా ఇబ్భందులు పడ్డ మధుపాన ప్రియులకు మాల్సు అందుబాటులోకి రానున్నాయి. కోరుకున్న మద్యం బ్రాండ్లు దొరక్కపోవడంతో తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా వస్తోంది. దీన్ని అదుపు చేయలేక అబ్కారీ శాఖ చేతులెత్తేసింది. వారు ఎంత కట్టుదిట్టం చేసినా మద్యం అక్రమంగా తరలించే వారికి మాత్రం ముకుతాడు పడటం లేదు.
కొందరు పోలీసులు కూడా అక్రమార్జనకు అలవాటు పడి మద్యం అక్రమంగా తరలిస్తూ ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు. ఇక సరిహద్దుల్లో పోలీసు అధికారులకు అక్రమ మద్యం రవాణా కాసులు కురిపిస్తోంది. ఇదంతా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ఇలా ప్రతి నెలా రూ.600 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి అక్రమార్కులు గండి కొడుతున్నారు. దీనిని అరికట్టడంతోపాటు, ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు కొత్త మద్యం పాలసీని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అన్నీ బ్రాండ్లు దొరికే విధంగా మద్యం మాల్సు ఏర్పాటు చేయడానికి అబ్కారీ శాఖ తీవ్ర కసరత్తు చేస్తోందని సమాచారం.
దశల వారీగా మద్య నిషేధం అంటే ఇదేనా?
మద్య నిషేధం చేస్తామని 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తరవాత దాన్ని దశల వారీగా మద్య నిషేధంగా మార్చారు. అంటే ఏటా 20 శాతం షాపులు తగ్గించుకుంటూ పోతే ఐదేళ్లలో షాపులన్నీ బంద్ అవుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రభుత్వం ఒకవైపు షాపులు తగ్గించుకుంటూనే మద్యం మాల్సు ప్రారంభించాలని చూస్తోంది. షాపులు తగ్గించడం, మద్యం ధరలు విపరీతంగా పెంచడం ఇవన్నీ మందుబాబులను మద్యం మాన్పించేందుకేనని వైసీపీ ప్రభుత్వం చెప్పుకుంటోంది.
మద్యం షాపులు తగ్గించడంపై కొందరు ప్రశంసలు కూడా కురిపించారు. చెప్పినమాట ప్రకారం మొదటి ఏడాదిలో 20 శాతం షాపులు తగ్గించామని చెప్పుకున్నారు. ఇక మద్యం ధరలు 200 శాతం పెంచడం ద్వారా మద్యం కొనాలంటే భయపడే పరిస్థితి తీసుకువచ్చామని వైసీపీ నాయకులు చెప్పుకుంటున్నారు. ఇది కూడా మద్యపాన నిషేధంలో భాగమనే సమర్ధించుకుంటున్నారు.
షాపులు తగ్గిస్తే ఆదాయం తగ్గాలి కదా?
ఏపీలో మద్యం షాపులు తగ్గించినా అబ్కారీ శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం పెరుగుతూనే ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు, బార్ల సైసెన్సు ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రూ.23000 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది కరోనా లాక్ డౌన్ ప్రభావం మద్యం అమ్మకాలపై పడింది. మార్చి 15 నుంచి 40 రోజుల పాటు వైన్ షాపులు మూసివేశారు. ఆ కాలంలో ప్రభుత్వం రూ.3300 కోట్ల ఆదాయం కోల్పోయింది.
ఆ తరవాత షాపులు తెరచుకున్నాయి. తాజాగా బార్ల కూడా తెరవడంతో ప్రభుత్వానికి ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. కోరుకున్న మద్యం బ్రాండ్లు లేకపోవడంతో తెలంగాణ నుంచి అక్రమ మద్యం పోటెత్తుతోంది. ప్రతి నెలా ఏపీ ప్రభుత్వం రూ.600 కోట్ల ఆదాయం కోల్పోతోంది. అక్రమ మద్యం అరికట్టి, ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం మద్యం మాల్సు కాన్సెప్టును తీసుకువచ్చింది. దీన్ని కూడా మద్యపాన నిషేధంలో భాగంగానే అమలు చేస్తున్నామని
ప్రచారం చేసుకునే అవకాశం లేకపోలేదు.
ప్రజలకు ఏం సమాధానం చెప్పుకుంటారు?
మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలా సమర్ధించుకుంటారో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఏపీలో వైన్ షాపులు 20 శాతం తగ్గినా ప్రభుత్వ ఆదాయం మాత్రం 23 శాతం పెరిగింది. షాపులు తగ్గించడం మద్య నిషేధంలో భాగం అయినప్పుడు మద్యం అమ్మకాలు, ప్రభుత్వ ఆదాయం కూడా తగ్గాలి. కానీ అలా జరగడం లేదు. ప్రభుత్వానికి ప్రస్తుతం కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు.
అప్పులు తీసుకునే పరిమితులు రాష్ట్ర ప్రభుత్వం దాటిపోయింది. ఇక కొత్త అప్పులు చేయడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకే మద్యం మాల్సు పెట్టాలని సీఎం యోచిస్తున్నారని తెలుస్తోంది. ఏపీలోని ప్రధాన నగరాల్లో మద్యం మాల్సు ప్రారంభించడం ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.6000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంపై తప్ప, మద్య నిషేధంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థం అవుతోంది.











