ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మంచి జోరుమీదుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన రాజస్థాన్ టీమ్ వరుస అపజయాలతో ఆపసోపాలు పడుతోంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తొలి రెండు మాత్రమే గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ రెండు టీమ్‌ల మధ్య ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ శుక్రవారం సాయంత్రం జరుగబోతోంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఢిల్లీ టీమ్ మళ్లీ పాయింట్ల పట్టికల్లో అగ్ర స్థానానికి చేరుకుంటంది. అది జరగనివ్వకూడదని రాజస్థాన్ టీమ్ కృత నిశ్చయంతో ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపొంది ఢిల్లీ జైత్రయాత్రకు, తమ వరుస పరాజయాలకు బ్రేక్ వేయాలని ఊవిళ్లూరుతోంది. ఆ మ్యాచ్‌ల్లో గెలిస్తే స్మిత్ సేన టాప్ ఫైవ్‌లోకి వెళ్లే అవకాశాలున్నాయి. మరి, శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు షార్జా స్టేడియంలో జరుగబోయే మ్యాచ్‌లో గెలుపు ఎవరికి దక్కుతుందో చూడాలి.
ఢిల్లీ టీమ్ బలాలు
ఈ సీజన్‌లో ఢిల్లీ టీమ్ అజేయంగా కనబడుతోంది. ప్రతిభావంతులైన బౌలర్లతో కూడా బౌలింగ్ విభాగానికి బ్యాట్స్‌మెన్ నుంచి మద్దతు లభిస్తోంది. దాంతో స్టార్ ఆటగాళ్లు లేకపోయినప్పటికీ ఢిల్లీ టీమ్ సునాయాసంగా విజయాలు సాధిస్తోంది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫామ్, పృథ్వీ షా, పంత్ దూకుడు, స్టోయినిస్ ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్ ఢిల్లీని విజయాల బాట పట్టిస్తున్నాయి. ఇక, ఈ ఐపీఎల్‌లో బెస్ట్ బౌలర్‌గా కితాబులందుకుంటున్న రబాడా ఢిల్లీ బౌలింగ్ విభాగాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. అలాగే దక్షిణాఫ్రికా పేసర్ నోర్ట్జే, కొత్తగా టీమ్‌లోకి వచ్చిన హర్షల్ పటేల్ కూడా సహకారం అందిస్తున్నారు.
బలహీనతలు
గాయం నుంచి కోలుకుని తిరిగి వచ్చిన స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఇంకా ఫామ్‌లోకి రాకపోవడం ఢిల్లీ శిబిరంలో ఆందోళన కలిగిస్తోంది. అలాగే స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ ఫామ్ కూడా ఢిల్లీ టీమ్‌ను ఇబ్బంది పెడుతోంది. ఇవి తప్ప ఢిల్లీ టీమ్‌లో ప్రస్తుతానికి పెద్దగా లోపాలు లేవనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు గాయపడితే వాళ్ల స్థానాన్ని భర్తీ చేయగల సమర్థులైన ఆటగాళ్లు రిజర్వ్ బెంచ్‌లో లేరు.
ఢిల్లీ టీమ్ (అంచనా)
శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షా, శిఖర్ ధవన్, రిషభ్ పంత్, హెట్ మేయర్, స్టోయినిస్, అక్షర్ పటేల్, అశ్విన్, రాబాడా, హర్షల్ పటేల్, నోర్ట్జే.
రాజస్థాన్ టీమ్ బలాలు
ఈ సీజన్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ జట్టు అదరగొట్టింది. ఆ రెండు మ్యాచ్‌లూ షార్జా స్టేడియంలోనే జరిగాయి. ఆ తర్వాత దుబాయ్, అబుదాబి వేదికల్లో జరిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ రాజస్థాన్ ఓటమి పాలైంది. మళ్లీ తనకు అచ్చొచ్చిన షార్జా మైదానంలో శుక్రవారం ఢిల్లీతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం తమను కచ్చితంగా వరిస్తుందని రాజస్థాన్ నమ్మకంగా ఉంది. ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాడు. అయితే ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. ఇక, ఓపెనర్ జాస్ బట్లర్ తిరిగి ఫామ్‌లోకి రావడం రాజస్థాన్‌కు కాస్త ఊరట కలిగిస్తోంది.
బలహీనతలు
ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడినా తుది జట్టు కూర్పు విషయంలో రాజస్థాన్ ఒక అంచనాకు రాలేకపోతోంది. తుది జట్టును ఎంపిక చేసే విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. ఇక, తొలి రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టిన స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ తర్వాత ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నారు. టీమ్‌లో ఉన్న ఇండియన్ బ్యాట్స్‌మెన్ ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించడం లేదు. స్పిన్నర్ రాహుల్ తెవాటియా నిలకడ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇక, టీమ్‌లోకి కొత్తగా వచ్చిన యశస్వి జైశ్వాల్, కార్తీక్ త్యాగి, అంకిత్ రాజ్‌పుత్ ఆకట్టుకోలేకపోయారు. టాపార్డర్ రాణించకపోవడమే రాజస్థాన్ ఓటములకు ప్రధాన కారణంగా మారుతోంది.
రాజస్థాన్ టీమ్ (అంచనా)
స్టీవ్ స్మిత్, జాస్ బట్లర్, సంజూ శాంసన్, మనన్ వోహ్రా, రాహుల్ తెవాటియా, మహిపాల్, టామ్ కర్రన్, జొఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పుత్, అంకిత్ త్యాగి.
మ్యాచ్ ఫేవరెట్
ప్రస్తుత పరిస్థితులు, బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్స్.. ఇలా ఏ విభాగంలో చూసినా రాజస్థాన్ కంటే ఢిల్లీ జట్టే బలంగా కనబడుతోంది. అయితే ఈ సీజన్‌లో షార్జా వేదిక మీద రాజస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అది స్మిత్ సేనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. షార్జాలో జరుగబోయే మ్యాచ్‌తో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కుతామని నమ్మకంగా ఉంది. మరి, ఢిల్లీ జోరు కొనసాగుతుందో, రాజస్థాన్ నమ్మకం గెలుస్తోందో చూడాలి.