లోక్‌జనశక్తి పార్టీ(ఎల్‌జెపి) అధినేత, కేంద్రమంత్రి రామ్‌విలాస్(74) పాశ్వాన్ ఇకలేరు. అనారోగ్యం పాలైన ఆయనకు ఇటీవల ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో గురువారం ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈమేరకు ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్.. తన తండ్రి చనిపోయినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. బిహార్‌కు చెందిన పాశ్వాన్ జననేతగా గుర్తింపు పొందారు. ఎనిమిదిసార్లు ఎంపిగా గెలుపొందారు. ప్రస్తుతం రాజ్యసభ్యుడిగా ఉంటూ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు.
కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ నాయకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణ వార్తను ఆయన కుమారుడు చిరాగ్ పాశ్ఆన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. పాపా మీరు ప్రస్తుతం ఈ ప్రపంచంలో లేరు. కానీ మీరు ఎక్కడ ఉన్నా నాతోనే ఉంటారు.. మిస్ యూ పాపా.. అంటూ చిరాగ్ భావోద్వేగంతో ట్వీట్ చేశారు. కొంత కాలం క్రితం రామ్‌విలాస్‌కు హార్ట్ సర్జరీ అయింది.
సిఎం దిగ్భ్రాంతి..
రామ్ విలాస్ పాశ్వాన్ మరణ వార్త విన్న సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో రామ్ విలాస్ పాశ్వన్ అండగా ఉంటూ అందించిన సహకారాన్ని ఈ సందర్భంగా కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. సిఎం కెసిఆర్ తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం పాశ్వన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
దళిత నేత ఇక లేరు..
దేశంలో కీలకమైన దళిత నేతగా రామ్‌విలాస్ పాశ్వాన్‌కు మంచి గుర్తింపు ఉంది. తన రాజకీయ ప్రస్థానం మొదట 1969లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ నుంచి మొదలైంది. అలౌలి నియోజకవర్గం నుండి రామ్‌విలాస్ శాసనసభకు ఎన్నికయ్యారు. అలాగే 1974లో లోక్‌దళ్ ఏర్పడిన తరువాత పార్టీలో చేరి ఆయన ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ కాలంలో ఎమర్జెన్సీని వ్యతిరేకించడంతో ఆయనని అరెస్టు చేసి జైళ్‌కి తరలించారు. 1977లో జనతాపార్టీ నుంచి లోక్‌సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత వరుసగా 1980, 1989, 1996, 1998, 1999,2004, 2014లో పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
లోక్‌జనశక్తి పార్టీని 2000 సంవత్సరంలో రామ్‌విలాస్ స్థాపించి 2004లో యూపిఎ ప్రభుత్వంలో చేరారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2010 నుండి 2014 వరకు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. మళ్లీ 2014లో హజీపూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల ముందు బిజెపి పార్టీతో పొత్తుపెట్టుకుని ఎంపిగా ఎగెలిచిన అనంతరం మోడీ క్యాబినెట్ మంత్రిగా చేరారు. ఈయనకు ఒక రికార్డు కూడా ఉంది. 1996 నుండి 2015 వరకు ఉన్న జాతీయ సంకీర్ణ కేంద్ర ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా రామ్‌విలాస్ పాశ్వాన్‌కు ఘనత ఉంది. ప్రస్తుతం ఆయన ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖలోకొనసాగుతున్నారు.











