పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కొన్ని కమిటీలు… కోవిడ్ 19 హాస్పిటల్స్ లో నిబంధనల పర్యవేక్షణకు మరికొన్ని కమిటీలు… ప్రతిదానికి కమిటీలు వేస్తూ పోవడమే కనిపిస్తోంది తప్ప… ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదం తో రాష్ట్రంలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్లలో ఎలక్ట్రికల్ సిస్టమ్ పనితీరును గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఈ నెల తొమ్మిదో తారీఖున ఆదేశాలు జారీ చేసింది. విశాఖ జిల్లా విషయానికి వస్తే…26 టాస్క్ ఫోర్స్ కమిటీలను జిల్లా యంత్రాంగం నియమించింది. ఈ కమిటీలు కోవిడ్ కేర్ సెంటర్లు, క్వారంటైన్ సెంటర్లు, కోవిడ్ హాస్పిటల్స్ , ఏరియా హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ తనిఖీ చేసి ఆయా భవనాల్లో ఎలక్ట్రిసిటీ ఏ విధంగా ఉంది ? లోపాలు ఏమైనా ఉన్నాయా? దిద్దుబాటు చర్యలు ఏమైనా తీసుకోవాలా? అన్న దానిపై కూలంకుషంగా పరిశీలించి జిల్లా కలెక్టర్ కు నివేదిక సమర్పించింది.
ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ లో ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, జీవీఎంసీ, ఫైర్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీలు సమర్పించిన నివేదికలు అలా ఉంచితే…. విశాఖపట్నం ఎండాడ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాలలో వాల్మీకి భవనంలో క్వారంటైన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రం పై అంతస్తులో కళాశాల కంప్యూటర్ ల్యాబ్ ఉంది. ఈ ల్యాబ్ లో సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కావడంతో కంప్యూటర్లన్నీ కాలి బూడిదయ్యాయి. క్వారంటైన్ సెంటర్లో ఉన్న 64 మందిని సమీపంలోని భగీరథ బ్లాక్ లోకి అప్పటికప్పుడు షిఫ్ట్ చేశారు.
మళ్లీ టాస్క్ ఫోర్స్ కమిటీల విషయానికి వద్దాం…
రెండు రోజుల పాటు ఈ కమిటీలు చేసిన అధ్యయనం ఏంటి? ఇచ్చిన సలహాలు సూచనలు ఏంటి? ఈ కమిటీ లోపాలు ఉన్నట్టు గుర్తించిందా లేదా? ఏ లోపాలు లేనట్టు కమిటీ గుర్తిస్తే ఈ ప్రమాదం ఎలా జరిగింది? లోపాలు ఉన్నట్టు సూచనలు చేస్తే… యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేనట్టు? ఇలా అనేక ప్రశ్నల వర్షం కురుస్తుంది తప్ప.. సమాధానం మాత్రం దొరికే పరిస్థితి లేదు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు గాని… లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఇదొక పెద్ద ప్రమాదంగా రికార్డ్ అయ్యేది.
పరిశ్రమల్లో అదే పరిస్థితి..
కోవిడ్ 19 లాక్ డౌన్ తరువాత ప్రారంభించే పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే ప్రారంభించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ఇప్పటికే ఆదేశించారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ఎప్పటి కప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలని, ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వీటిని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎల్.జి. పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ లీకేజీ ఘటన తరువాత పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు ఏర్పాటైన హైపవర్ కమిటీ సూచించిన సిఫార్సుల మేరకు జిల్లాలో కమిటీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది.
ఈ కమిటీ లో చైర్మన్ గా జాయింట్ కలెక్టర్, డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, రీజనల్ ఆఫీసర్, ఎపిపిసిబి ఇంజనీర్లు, డిప్యూటి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, జిల్లా అగ్నిమాపక అధికారి మెంబర్లు గాను, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం , మెంబర్ కం కన్వీనర్ గా ఉన్నారు. అయినా పరిశ్రమల్లో ప్రమాదాలు ఆగలేదు.
వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న ప్రజలు ఒక అంచనాకు మాత్రం వచ్చారు. ప్రభుత్వం వేస్తున్న కమిటీలు.. సమర్పిస్తున్న నివేదికలు కేవలం కంటితుడుపు చర్యలుగానే భావిస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల కారణంగా ప్రమాదాలు జరిగితే ఆగమేఘాల మీద చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం అందుకు బాధ్యులైన అధికారులు వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడడం లేదు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంపై మంగళవారం హైకోర్టు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ఇప్పటికైనా ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ప్రయోజనం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.











