స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం అనేది ఘోరమైన దుర్ఘటన. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా చెబుతున్నారు. ఆ ప్రమాదానికి సంబంధించి స్వర్ణ ప్యాలెస్ యజమానితో పాటు, రమేష్ హాస్పిటల్ ఎండీ పైన కూడా కేసులు పెట్టారు. విచారణకు అది అవసరం కావొచ్చు. కానీ హాస్పిటల్ ఎండీ పోలీసులకు చిక్కలేదు. పరారీలో ఉన్నారని ప్రచారం జరిగింది. ప్రమాదం బెజవాడలో జరిగితే.. ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రి బ్రాంచిల వారిని కూడా విచారించారు. మొత్తానికి ఏదో విచారణ పేరుతో.. ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
ఈలోగా.. వ్యవహారానికి చుట్టూ రాజకీయ ప్రచారాలు మొదలయ్యాయి. హాస్పిటల్ ఎండీ తెలుగుదేశానికి సానుభూతి పరుడు. ఎన్నికల్లో ఆర్థికంగా కూడా సహకరిస్తూ ఉండే వ్యక్తిగా పేరుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ ఆయన పేరు రమేష్ బాబు మాత్రమే. ఈ ప్రమాదాన్ని రాజకీయ దుమారంగా మార్చదలచుకున్న వారంతా ఆయన పేరును హఠాత్తుగా రమేష్ చౌదరిగా మార్చారు. ఆ రకంగానే పోస్టులు హోరెత్తించారు. ప్రచారంలో దిగ్విజయం సాధించారు. అది చాలదనుకున్నారేమో.. రమేష్ బాబును, మాజీ సీఎం చంద్రబాబు తన ఇంట్లోనే దాచుకున్నారని, కాపాడుతున్నారని అంటూ.. కమ్మకుల నాయకుడిగా ఆయనపై కూడా ముద్ర వేశారు. ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే.
కానీ కేసు విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు సింపుల్ గా ఒక ప్రశ్న అడిగింది. విద్యుత్తు పరంగా లోపాల వల్ల ప్రమాదం అంటూ జరిగినప్పుడు- ఆ హోటల్ లో కొవిడ్ కేర్ సెంటర్ నడపడానికి అనుమతి ఇచ్చిన అధికార్లది కూడా తప్పే కదా? అని ప్రశ్నించింది.
ఈ ప్రశ్న చాలా చిన్నది. కానీ చాలా లోతైన అర్థం ఉన్నది. అందులో లాజిక్ కూడా ఉంది. చాలా చిన్న లాజిక్. అంత చిన్న లాజిక్ ప్రభుత్వానికి ఎందుకు తట్టలేదు. అనుమతులు ఇచ్చిన అధికారులు అసలు పద్ధతిగా తనిఖీలు నిర్వహించారా? లేదా, ఈ సీజన్లో హోటల్ వ్యాపారం ఎటూ శవాసనం వేసింది గనుక.. ఆమేరకు కోవిడ్ కేర్ సెంటర్ రూపేణా ఎవరికైనా అనుచిత లబ్ధి చేకూర్చడానికి తూతూ మంత్రపు తనిఖీలతో అనుమతులు ఇచ్చేశారా? అనేది సందేహం! ఆ దిశగా ప్రభుత్వం ముందే ఆలోచించకపోవడమే చిత్రం.
స్వర్ణ ప్యాలెస్ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని సాక్షాత్తూ హోం మంత్రి కూడా తేల్చేశారు. మౌలికంగా అది ఆస్పత్రి వారి భవనం కాదు. అక్కడ ఉన్న వైరింగ్ ఏర్పాట్లకు ఆస్పత్రి వారెలా బాధ్యత తీసుకోవాలి. ప్రమాదం సమయంలో సిబ్బంది, డాక్టర్లు ఎంత మేరకు అందుబాటులో ఉన్నారనే విషయంలో ఆస్పత్రిని తప్పుపట్టవచ్చు. అంతే తప్ప.. అగ్ని ప్రమాదానికి ఆస్పత్రి వారిని ఎలా బాధ్యుల్ని చేస్తారు. ఇలాంటివి కూడా సామాన్యులకు అనిపించే లాజిక్ లోపాలు! ఈ లాజిక్ లు ఇంకా చిన్నచిన్నవి. బహుశా ఇంత చిన్న లాజిక్ లు కూడా ప్రభుత్వానికి స్ఫురించకపోవచ్చు.