తెలుగు నేల రాజకీయాల్లో ఇప్పుడో వార్త వైరల్ గా మారిపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత. ఏపీ పీసీసీ చీఫ్ గానే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన నీలకంఠాపురం రఘువీరారెడ్డి.. ఇప్పుడు టీడీపీలో చేరే దిశగా సాగుతున్నారట. టీడీపీలోకి ఆయనను తీసుకొచ్చే దిశగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనదైన శైలి యత్నాలు సాగిస్తున్నారట. ఈ యత్నాలు ఫలించాయో, ఏమో తెలియదు గానీ.. సోమవారం నాడు ఈ వార్త ఒక్కసారిగా వైరల్ గా మారిపోయింది. మెయిన్ మీడియా ఇంకా ఈ వార్తను ప్రసారం చేయకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త ఇప్పుడు తెగ వైరల్ అయిపోయింది. రఘువీరారెడ్డి ఏమిటి? టీడీపీలో చేరడం ఏమిటి? అన్న దిశగా ఆసక్తికర చర్చకు తెర లేసింది.
రాజకీయాలకు దూరంగా రఘువీరా..
తెలుగు నేల ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏపీకి పదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన రఘువీరారెడ్డి.. తెలుగు నేల విభజన తర్వాత ఏపీసీసీ పగ్గాలు చేపట్టారు. అయితే అప్పటికే ప్రజల్లో పార్టీ పలుచనైపోవడం, కీలక నేతలంతా వైసీపీలో చేరిపోవడంతో కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. స్వయంగా రఘువీరానే ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు పీసీసీ చీఫ్‌గా కొనసాగిన ఆయన.. తదనంతరం ఏమనుకున్నారో, ఏమో గానీ.. పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పుకున్నారు. తన సొంత జిల్లా అనంతపురానికే చెందిన మరో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కు పీసీసీ పగ్గాలు అప్పగించిన రఘువీరా నేరుగా తన సొంతూరు నీలకంఠాపురం వెళ్లిపోయారు. తన ఉమ్మడి కుటుంబానికి ఉన్న పొలం పనులతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. గ్రామంలో తన సొంత నిధులతో ఆలయాన్ని అభివృద్ధి చేయించిన రఘువీరా.. పల్లెల్లో ఓ సాదాసీదా రైతు ఎలా ఉంటారో.. అచ్చూ అలాగే మారిపోయారు. అసలు ఇప్పుడు రఘువీరా కనిపిస్తే.. ఠక్కున ఆయనను గుర్తు పట్టడం సాధ్యం కాదు. అంతగా మారిపోయిన ఆయన ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలెట్టే దిశగా కదులుతున్నట్లుగా సమాచారం.
బాబు ఆదేశంతో రంగంలోకి జేసీ..
నీలకంఠాపురంలో ఆలయాన్ని అభివృద్ధి చేసిన రఘువీరా గొప్పతనాన్ని ఇటీవలే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా కొనియాడిన సంగతి తెలిసిందే. అప్పటికే రఘువీరాను టీడీపీలోకి ఆహ్వానించే చర్యలు ప్రారంభమయ్యాయని, రఘువీరా సెకండ్ ఇన్నింగ్స్ కు రంగం సిద్ధం చేసుకుంటున్న విషయాన్ని తెలుసుకునే.. రఘువీరాతో మాట్లాడే పనిని పార్టీ సీనియర్ నేత, ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రఘువీరాతో కలిసి పనిచేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దింపినట్లుగా సమాచారం. సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు సిద్ధమైన రఘువీరా.. తనకు సరైన వేదిక లేదన్న కారణంతో వేచి చూస్తున్నారట. ఇదే విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు.. పార్టీలోకి రావాలంటూ రఘువీరాకు ఆఫర్ చేశారట. జేసీ ప్రభాకర్ రెడ్డితో పంపిన ఈ సందేశానికి రఘువీరా నుంచి కూడా సానుకూల స్పందనే లభించిందని సమాచారం. అయితే రఘువీరా డిమాండ్లు, వాటిని టీడీపీ తీర్చగలదా? అన్న దిశగా ఇప్పుడు చర్చ సాగుతోందని సమాచారం. మొత్తంగా టీడీపీలోకి రఘువీరా చేరే దిశగా యత్నాలు సాగుతున్నాయన్న ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
Must Read ;- టీడీపీకి కేడరే అండ.. కేడర్‌కు బాబు అండ











