తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. జగన్ మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మంత్రులను బూతు మంత్రులుగా అభివర్ణించిన జేసీ.. తెలంగాణ మంత్రుల వ్యాఖ్యలపై స్పందించడానికి చేతగాక జగన్ మంత్రులు చేతులకు గాజులు తొడుక్కున్నారా? అంటూ జేసీ ఓ రేంజిలో ఫైరయ్యారు. జగన్ కేబినెట్ లో నోరు తెరిస్తే బూతులు వల్లె వేసే మంత్రుల నోళ్లు ఇప్పుడెందుకు పెగలడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. జనామోద నేతగా పేరొందిన మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్ఠను తీసేలా తెలంగాణ మంత్రులు మాట్లాడుతుంటే.. ఇటు జగన్ గానీ, ఆయన కేబినెట్ లోని బూతు మంత్రులు గానీ ఎందుకు స్పందించడం లేదని కూడా జేసీ సూటిగానే ప్రశ్నలు సంధించారు.
చేతగానితనంతో భయపెడతావా?
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు ఎంత ఘాటు వ్యాఖ్యలు చేసినా.. సంయమనం పాటిస్తున్నామని చెబుతున్న సీఎం జగన్.. అందుకు కారణంగా తెలంగాణలో ఉన్న సీమాంధ్రుల భద్రతను సాకుగా చూపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను ప్రస్తావించిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. తెలంగాణ ప్రజలు ఎవరినీ ఏమీ అనరని, జగన్ అవసరమైన వ్యాఖ్యలతో ఏపీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. జగన్ సోదరి తెలంగాణలో పార్టీ పెడుతున్నారు కదా.. ఆమెను అక్కడ రాళ్లతో ఏమీ స్వాగతం పలకడం లేదు కదా.. పూలతోనే స్వాగతం పలుకుతన్నారు కదా అని జేసీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఏపీకి చెందిన ఆస్తులు వేల కోట్ల మేర ఉన్నాయని, వాటికి ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదని జేసీ తెలిపారు. అయినా తెలంగాణ సర్కారు వాదనలను ఎదుర్కొనే సత్తా లేకనే జగన్ తన చేతగానితనంతో ఏపీ ప్రజలను భయపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు ఏమీ అనరని.. జగన్ చెప్పేదంతా అభూత కల్పనేనని కూడా జేసీ తేల్చిపారేశారు.
వైెస్సార్ ను దూషించినా స్పందించరా?
ఈ సందర్భంగా జగన్ తీరుపై జేసీ ఓ రేంజిలో విరుచుకుపడ్డారు. రాజశేఖరరెడ్డి జనామోదం కలిగిన నేత అని, పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానించే నేతలున్నారని జేసీ చెప్పారు. అలాంటి నేతపై తెలంగాణ మంత్రులు తీవ్ర పదజాలంతో దూషణలు చేస్తుంటే.. జగన్ ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. ఇక ప్రత్యర్థులపై నిత్యం బూతులతో విరుచుకుపడి బూతు మంత్రులుగా పేరు తెచ్చుకున్న జగన్ కేబినెట్ లోని నలుగురైదుగురు మంత్రులు.. వైఎస్సార్ ను తిడుతున్నా ఎందుకు నోరిప్పడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ నేతల వ్యాఖ్యలకు సమాధానం చెప్పే దమ్ము లేదా? అని ప్రశ్నించిన జేసీ.. చేతులకు ఏమైనా గాజులేసుకున్నారా? అని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ, ఇతర పార్టీ నేతలపై నిత్యం బూతులతో విరుచుకుపడుతున్న ఈ బూతు మంత్రులు.. తెలంగాణ మంత్రులు కనిపిస్తేనే భయపడిపోతున్నారని జేసీ ఆరోపించారు. మొత్తంగా కాస్త లేటుగా వచ్చినా.. జగన్, ఆయన మంత్రులపై జేసీ తనదైన శైలిలో విసుర్లు సంధించారు. మరి జేసీ వ్యాఖ్యలపై జగన్ అండ్ కో ఏమంటుందో చూడాలి.
Must Read ;- మళ్లీ ‘జల్’ హల్ చెల్.. అవి పొలిటికల్ వివాదాలేనా!











