ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన బిజీ షెడ్యూల్ నుంచి రిలీఫ్ కోరుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరులో ఆయన విదేశీ పర్యటనకు ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఎప్పుడో గానీ విదేశీ టూర్లకు వెళ్లని జగన్.. ఈ దఫా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళుతున్నారట. ఇప్పటికే ఈ టూర్ షెడ్యూల్ ఖరారు చేసుకున్న జగన్.. దానిని ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఐదు రోజుల పాటు సాగనున్న టూర్ లో జగన్ ఫ్యామిలీ.. లండన్, పారిస్ నగరాల్లో పర్యటించనుందట.
తొలి ఫారిన్ టూర్‌కు రూ.23 లక్షలు
ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూలైలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. అప్పుడు కూడా కటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లిన జగన్.. జెరూసలెంలో పర్యటించారు. సీఎం కుర్చీలో కూర్చున్న అతి స్వల్ప వ్యవధిలోనే జరిగిన ఈ టూర్ కు జగన్ ఏకంగా రూ.23 లక్షలు ఖర్చు చేశారు. సీఎం హోదాలో వెళ్లారు కాబట్టి.. ఆ మొత్తం ఖర్చును సర్కారీ ఖజానా నుంచే విడుదల చేశారు. వ్యక్తిగత టూర్ కు ఇంతమేర ప్రజాధనాన్ని వెచ్చిస్తారా? అంటూ నాడు విపక్ష టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా సీఎం హోదాలో ఉంటూ వ్యక్తిగత విదేశీ టూర్లకు వెళ్లిన నేతను జగన్ నే చూస్తున్నామంటూ కూడా టీడీపీ చేసిన ఆరోపణ జగన్ ను ఇరుకున పెట్టిందని చెప్పాలి. మరి నాడు జెరూసలెం పర్యటనకే రూ.23 లక్షలు ఖర్చు అయితే.. ఇప్పుడు లండన్, పారిస్ లలో జరిగే జగన్ టూర్ కు ఇంకెంత మేర ప్రజా ధనాన్ని వెచ్చిస్తారోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
బాబుకు, జగన్ కు అదే తేడా
సీఎం హోదాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా పలు మార్లు విదేశాలకు వెళ్లినా.. ఏనాడూ ఆయన ఈ పర్యటనలను తన వ్యక్తిగతానికి వినియోగించిన దాఖలా లేదు. ఎప్పుడు విదేశాలకు వెళ్లినా.. రాష్ట్రానికి పరిశ్రమలు రాబట్టేందుకే కృషి చేశారు. అసలు పరిశ్రమలను రాబట్టేందుకే చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసేవారు. అప్పుడెప్పుడో.. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు అయినప్పుడు.. వ్యక్తిగత ఖర్చులతో చంద్రబాబు ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లారు. ఆ తర్వాత విదేశాలకు ఆయన కుటుంబ సమేతంగా వెళ్లిన సందర్భమే లేదని చెప్పాలి. అయితే అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న జగన్.. అధికారిక పనుల కోసం విదేశాలకు వెళ్లడానికి బదులుగా తన వ్యక్తిగత పనుల మీద విదేశీ పర్యటనకు వెళుతూ కొత్త సంస్కృతికి తెర తీశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. సీఎం హోదాలో రాష్ట్ర అభివృద్ది కోసం కాకుండా కేవలం వ్యక్తిగత పనుల మీదే జగన్ పర్యటనలు చేస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి.











