తెలుగు దేశం పార్టీకి కార్యకర్తలే అండాదండ. ఆంధ్రుల ఆరాధ్య నటుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన టీడీపీ నాలుగు పదుల ప్రస్థానానికి చేరువైంది. ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో కార్యకర్తలను టీడీపీ ఏనాడూ వదలలేదు. అలాగని పార్టీ కూడా కేడర్ ను ఏనాడూ విడిచిపెట్టిన దాఖలా లేదు. మొత్తంగా పార్టీకి అండాదండగా నిలిచిన కార్యకర్తలకు పార్టీ అధిష్ఠానం కూడా అండగానే నిలుస్తోంది. వెరసి దేశంలోని ఏ ఒక్క పార్టీకి లేని రీతిలో టీడీపీకి క్షేత్రస్థాయిలో పటిష్టమైన కేడర్ ఉందని చెప్పాలి. పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టే కార్యకర్తలు వందలు, వేలల్లో కాదు లక్షల్లో ఉన్న వైనం కూడా టీడీపీకి కొండంత బలంగా చెప్పాలి. అదే సమయంలో తమ కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న కేడర్ కు అన్ని రకాలుగా అండగా నిలిచే విషయంలోనూ టీడీపీకి ఏ పార్టీ కూడా సాటి రాదనే చెప్పాలి. అయినా ఇప్పుడీ చర్చ ఎందుకంటారా? శనివారం నాడు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన షెడ్యూల్ ను కూడా మార్చుకుని ఆసుపత్రికి వెళ్లి మరీ తన పార్టీ కార్యకర్తను పరామర్శించారు కాబట్టి.
కార్యకర్తలంటే బాబుకు ప్రాణం
పార్టీ కేడర్ అన్నా.. ప్రత్యేకించి గ్రామ స్థాయిలోని క్రియాశీల కార్యకర్తలు అన్నా.. పార్టీ అధినేత చంద్రబాబుకు అమితమైన ఇష్టం. తనను చూసేందుకు, తనతో మాట కలిపేందుకు, తనతో కరచాలనం చేసేందుకు దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అటు హైదరాబాద్ లో ఇటు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికో తరచూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో ఈ తరహాలో పార్టీ కేడర్ పెద్ద ఎత్తున తరలివస్తోంది. అయితే ఏ ఒక్కరిని కూడా నిరుత్సాహానికి గురి చేయకుండా చంద్రబాబు ఓపిగ్గా అందరినీ కలుస్తున్నారు. వారితో మాట కలుపుతున్నారు. పార్టీ కోసం వారు ఇస్తున్న సలహాలను స్వీకరిస్తున్నారు. వాటిని అమల్లో కూడా పెడుతున్నారు. ఇలాంటి క్రమంలో శనివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
వీరాభిమానికి బాబు పరామర్శ
శనివారం విజయవాడ నుంచి చంద్రబాబు హైదరాబాద్ కు పయనమయ్యారు. విజయవాడలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు బయలుదేరారు కూడా. అయితే ఆ సమయంలో ఆయనకు ఓ సమాచారం అందింది. పార్టీ వీరాభిమాని ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తనను చూడాలని అనుకుంటున్నారన్న విషయం బాబుకు తెలిసింది. వెంటనే తన కాన్వాయ్ ను ఆసుపత్రి వైపు తిప్పించిన చంద్రబాబు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు కార్యకర్తను కలిశారు. కృష్ణా జిల్లా ప్రసాదంపాడుకు చెందిన బొప్పన రాఘవేంద్రరావు టీడీపీ వీరాభిమాని. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీని వెన్నంటే ఉన్నారు. తాజాగా వయోభారం కారణంగా ఆయన అనారోగ్యంపాలై విజయవాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చంద్రబాబును చూడాలనేదే చివరి కోరిక అని కుటుంబసభ్యులకు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు.. రాఘవేవంద్రరావును పరామర్శించారు. తన కోసం వచ్చిన చంద్రబాబును చూసి రాఘవేంద్రరావు సంతోషం వ్యక్తం చేశారు.
Must Read ;- టీడీపీ కేడర్‌కు దన్నుగా లోకేశ్ మార్కు ఆయుధం











