నీలకంఠాపురం రఘువీరారెడ్డి.. అదేనండి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీసీసీ చీఫ్ గా సుధీర్ఘ కాలం పాటు కొనసాగిన మన రఘువీరారెడ్డి ఇప్పుడేం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. పీసీసీ పదవిని తన సొంత జిల్లా అనంతపురానికే చెందిన మరో మాజీ మంత్రి శైలజానాథ్ చేతిలో పెట్టేసి తన సొంతూరు నీలకంఠాపురం వెళ్లిపోయిన రఘువీరా ఎంచక్కా వ్యవసాయం చేసుకుంటున్నారు కదా. ఈ క్రమంలో ప్యాంటు షర్టుతో పాటు ఖద్దరును కూడా వదిలేసిన రఘువీరా.. పల్లెల్లో మన రైతుల మాదిరే పంచె కట్టుకుని మెడలో తువ్వాలు వేసుకుని, మాసిన గడ్డంతో నిజంగానే రైతు బిడ్డలా మారిపోయిన వైనం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. మొన్నామధ్య తన సొంతూళ్లో ఆలయ ఉత్సవాల కోసం ఏకంగా ఆలయ పరిసరాల్లో పనులు చేస్తూ, గొడ్డలితో కట్టెలు కొడుతూ కనిపించిన రఘువీరా మరింతగా ఆశ్చర్యానికి గురి చేశారు. ఆ రూపాన్ని చూసి.. ఏంటబ్బా రఘువీరా ఇంతగా మారిపోయారు అన్న మాట రాని మానవుడు ఉండడేమో.
రాహుల్ నుంచి పిలుపు
మరి ఇదే తరహా సాధారణ జీవితాన్ని రఘువీరా భవిష్యత్తులోనూ కొనసాగిస్తారా? లేదంటే వ్యవసాయ శాఖ మంత్రితో పాటు రెవెన్యూ మంత్రిగానూ తనదైన శైలిలో రాజకీయాలు చేసిన పాత రఘువీరాలా మారిపోతారా? అన్న చర్చ ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి రఘువీరాకు పిలుపు వచ్చిందట. స్వయంగా రాహుల్ గాంధీ నుంచే వచ్చిన ఆ పిలుపు సారాంశం ఏమిటంటే.. తిరిగి రాజకీయాల్లోకి రావాలని, మరోమారు పాలిటిక్స్ లో యాక్టివ్ కావాలని, ఏపీ కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కేలా చర్యలు చేపట్టాలని, అందుకోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించాలని, అవసరమైతే.. మరోమారు పీసీసీ పగ్గాలు చేపట్టాలని రఘువీరాకు హస్తిన నుంచి పిలుపు వచ్చిందట. ఇప్పటికైతే ఈ పిలుపు పట్ల రఘువీరా స్పందించలేదనే చెప్పాలి. మరి తన సొంత పార్టీ హైకమాండ్ కు ఆయన ఏం చెప్పారో తెలియదు గానీ.. హస్తం పార్టీ పిలుపు రఘువీరా ఎలా తీసుకుంటారు అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు తెర లేసింది.
రఘువీరాకు పిలుపు నేపథ్యమిదే
కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ క్రమంగా బలహీనపడుతోంది. అందివచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమే. కాంగ్రెస్ పార్టీతో సింగిల్ గా కాకున్నా. విపక్షాలన్నీ కలిస్తే ఐక్య కాంగ్రెస్ విజయం తథ్యమే. ఇదే భావనతో అన్ని రాష్ట్రాల పార్టీ శాఖలను కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ చేస్తోంది. ప్రత్యేకించి తెలంగాణ పీసీసీ పగ్గాలను రేవంత్ కు ఇచ్చిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ను కూడా హైకమాండ్ గుర్తించింది. ఏపీలో కూడా రఘువీరా లాంటి కీలక నేతలు మళ్లీ యాక్టివేట్ అయితే వైసీపీకి గట్టి పోటీ అయితే ఇవ్వొచ్చన్న దిశగా హైకమాండ్ భావిస్తోంది. ఇందుకోసం ఏపీసీసీకి ఇప్పుడు అర్జెంట్ గా కొత్త సారథి కావాలి. ఈ క్రమంలో చాలా పేర్లను పరిశీలించిన హైకమాండ్ చివరాఖరుకు రఘువీరాను హస్తినకు రావాలంటూ కబురు పంపింది. మరి ఈ కబురును గౌరవించి రఘువీరా ఢిల్లీ ఫ్లైటెక్కుతారా? ఫ్లైటెక్కినా హైకమాండ్ ఆదేశించగానే.. తనకు ఇష్టమైన సాగును పక్కన పడేసి తిరిగి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తారా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.
Must Read ;- ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ ఫోకస్.. కొత్త పీసీసీని ప్రకటిస్తారా?