గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సమూల ప్రక్షాళన మొదలైందనే చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే ఆ దిశగా వడివడిగానే అడుగులు వేస్తోంది. అందులో భాగంగా మహారాష్ట్ర, తమిళనాడు, తమిళనాడు, పంజాబ్ పీసీసీ ఛీప్ లు సత్తా కలిగిన యువ నేతలను ఎంపిక చేసింది. పలు దఫాలుగా జరిగిన వడపోతల ద్వారా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత తెలంగాణలో పార్టీలో ఏ మేర జోష్ కనిపిస్తుందో ప్రత్యక్షంగా చూసిన హస్తం పార్టీ.. ఇప్పుడు పార్టీ ఏపీ శాఖపైనా దృష్టి సారించింది. ప్రస్తుతం ఏపీసీసీ చీఫ్ గా మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కొనసాగుతున్నారు. తెలుగు నేల విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిర్జీవంగా మారిపోయింది. వరుసపెట్టి 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి సింగిల్ సీటు కూడా దక్కని వైనమే ఇందుకు నిదర్శనం.
సాకేతో లాభమేమీ లేదు
ఇలాంటి క్రమంలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన మాజీ మంత్రి రఘువీరెడ్డి పార్టీకి పునరుజ్జీవం పోద్దామని చాలానే యత్నించారు. అయితే ఆయన యత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఈ క్రమంలో ఆ పదవిని వదులుకున్న ఆయన నేరుగా తన స్వగ్రామం అనంతపురం జిల్లా నీలకంఠాపురం వెళ్లి ఎంచక్కా వ్యవసాయం చేసుకుంటున్నారు. రఘువీరా తప్పుకుంటాననగానే అదే జిల్లాకు చెందిన మరో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కు పీసీసీ పగ్గాలు అప్పగించారు. ఆదిలో కాస్తంత దూకుడుగానే వెళ్లిన సాకే.. ఆ తర్వాత ఏమైందో గానీ స్పీడు తగ్గించేశారు. పార్టీలో వెన్నంటి నడిచే నేత ఒక్కరూ లేని నేపథ్యంలోనే సాకే డల్లయ్యారన్న వాదనలు లేకపోలేదు. ఈ క్రమంలో సాకేతో పని కాదని తేల్చేసుకున్న అధిష్ఠానం.. ప్రత్యామ్నాయం కోసం చూస్తోంది. ఏపీసీసీ చీఫ్ గా కొత్త నేతను ఎన్నుకునే దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించింది.
విడతలవారీగా మంతనాలు
ఇప్పటికే నాలుగు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లను మార్చేసిన అధిష్ఠానం ఆయా రాష్ట్రాల్లో పార్టీలో కనిపిస్తున్న జోష్ తో ఫుల్ ఖుషీగానే ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏపీలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సాకే ప్లేస్ లో పీసీసీ కొత్త చీఫ్ గా ఎవరైతే బాగుంటుందన్న దిశగా ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని తేల్చేందుకు రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలతో మంతనాలు సాగిస్తోంది. ఇప్పటికే ఓ విడతలో పార్టీకి చెందిన ఏపీ దళిత నేతలు చింతా మోహన్, జీవీ హర్షకుమార్, జేడీ శీలంలతో రాహుల్ గాంధీ భేటీ అయి వారి అభిప్రాయాలను తీసుకున్నారు. ఇక రెండో విడత చర్చల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన కీలక నేతలు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజుతో బుధవారం నాడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా భేటీ అవుతారట. ఈ ముగ్గురు నేతలతో రాహుల్ గాంధీ విడివిడిగానే భేటీ కానున్నట్లుగా సమాచారం. మరి ఈ వడపోతల్లో ఏపీసీసీ చీఫ్ గా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంపై ఆసక్తికర ఊహాగానాలు సాగుతున్నాయి.
Must Read ;- ఏపీ కాంగ్రెస్ పై రాహుల్ ఫోకస్.. కొత్త పీసీసీని ప్రకటిస్తారా?











