సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ కు ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. జగన్ సర్కార్ కు వరుసగా వ్యతిరేక తీర్పులను ఏపీ హైకోర్టు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ హైకోర్టు జడ్జిలను సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారంటూ లేఖలో జగన్ ఆరోపించారు. దీనికి తోడు పలు సంచలన ఆరోపణలు చేశారు. న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తూ జగన్ రాసిన లేఖను మీడియాకు కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవుతున్నాయి.
30కి పైగా క్రిమినల్ కేసులు నమోదయిన వ్యక్తి సుప్రీంకోర్టు జస్టిస్ పై ఆధారరహిత ఆరోపణలు చేయడంపై బార్ కౌన్సిల్ కూడా మండిపడింది. ఆయనను సీఎంగా కూడా తొలగించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా న్యాయనిపుణులు కోరుతున్నారు. తనపై నమోదయిన అక్రమ కేసులను దారి మళ్లించడానికే జగన్ ఇలాంటి దుస్సాహసానికి దిగారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో టీడీపీ నెటిజన్స్ ఏపీ సీఎం జగన్ ను కరుడుకట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్ ఎస్కోబార్ తో పోలుస్తూ కామెంట్ చేస్తుండటం విశేషం. ఎస్కోబార్ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం.
ఎస్కోబార్ ఎవరు
పాబోలో ఎస్కోబార్ అనే కొలంబియన్ డ్రగ్ లార్డ్. 80వ దశకంలో మత్తుపదార్థాల అక్రమవ్యాపారం ద్వారా కోట్లకు గడించాడు. ఒకానొక దశలో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలవడం విశేషం. ఆ తరువాత రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఆయన కొలంబియా ఛాంబర్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కి సభ్యుడిగా ఎంపికయ్యారు. ఎస్కోబార్ ముఠాకు అతని ప్రత్యర్థి ముఠాకు జరిగిన వార్ లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన కోసం కొలంబియా, యూఎస్ ప్రభుత్వాలు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించాయి. వామపక్ష గెరిల్లాలు కొలంబియన్ సుప్రీంకోర్టును ముట్టడి చేశాయి. ఈ దాడుల వెనుక ఎస్కోబార్ ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
నేరస్థుల అప్పగింత కింద తనను అమెరికాకి బదిలీ చేసే అవకాశం ఉండటంతో ఎస్కోబార్ ప్యాలెస్ ఆఫ్ జస్టిస్‌ని ముట్టడించి ప్రణాళిక ప్రకారం లాస్ ఎక్స్ట్రాడిటబుల్స్కు సంబంధించిన పత్రాలు తగులబెడుతూ ఆ విషయం బయటపడకుండా భవనంలో కొంతభాగాన్ని తగలబెట్టారు. ఈ ముట్టడిలోనూ, దీనిపై సైన్యం జరిపిన చర్యలోనూ ప్యాలెస్ ఆఫ్ జస్టిస్‌లో సగం మంది న్యాయవాదులు చనిపోయారు. ఆ తరువాత కొలంబియా, యూఎస్ అధికారులు ఆయనను కాల్చి చంపారు.
ఏపీ సీఎంతో పోలిక
35 ఏళ్ల క్రితం ఎస్కోబార్ చేసినట్లే ప్రస్తుతం జగన్ చేస్తున్నారని టీడీపీ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అప్పుడు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎస్కోబార్ సుప్రీం కోర్టు పై దాడి చేశాడు. జడ్జ్ లను బందీలుగా పెట్టుకుని…..6,000 డాక్యుమెంట్లు ధ్వంసం చేయించాడు.. #జగన్ రెడ్డికి పాబ్లో ఎస్కోబార్ కి ఉన్న దగ్గర పోలికలు ఉన్నట్లు తమకు అనిపిస్తోందని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తనపై కేసులు వేగవంతం కావడంతో దిక్కుతోచని సీఎం జగన్ న్యాయమూర్తులకు, న్యాయవ్యవస్థలకు దురుద్దేశాలు ఆపాదిస్తూ ఇలాంటి దుస్సాహసానికి దిగారంటూ టీడీపీ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తం మీద ఏపీ సీఎం జగన్ ను కరుడుకట్టిన కొలంబియన్ డ్రగ్ డీలర్ తో పోలుస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.