ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు చర్యలు చురుగ్గా సాగుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా మరో 13 జిల్లాలు రానున్నాయి. ప్రతి పార్లమెంటు నియోజకర్గాన్ని ఒక జిల్లా చేయడంతోపాటు, అరకు పార్లమెంటు నియోజకవర్గాన్ని రెండు జిల్లాలు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశం ఇచ్చారు. సీఎం ఆదేశాలతో పలు జిల్లాల కలెక్టర్లు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఊపందుకున్న ప్రక్రియ
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. కొన్ని జిల్లాలు మూడు ముక్కలు కానున్నాయి. మరికొన్ని జిల్లాలు రెండు జిల్లాలుగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సిన స్థల పరిశీలన జరుగుతోంది. ఇటీవల తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. జిల్లాల ఏర్పాటుకు సరిహద్దులు, కార్యాలయాలకు భవనాలు, స్థలాల పరిశీలన వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్లు వెంటనే రంగంలోకి దిగిపోయారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన భవనాలను పరిశీలిస్తున్నారు. కృష్ణా జిల్లాకు మచిలీపట్నం కేంద్రంగా ఉంది. తాజాగా విజయవాడ మరో కొత్త జిల్లాగా ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుకు బందరు రోడ్డులోని రోడ్లు, భవనాల శాఖకు చెందిన ఆరంతస్తుల భవనాన్ని కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. గుంటూరు జిల్లా ఉన్నతాధికారులు కూడా కొత్త జిల్లాల ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఇలా కలెక్టర్లు నెల రోజుల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాలని సీఎం ఆదేశించంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
వచ్చే ఏడాది సంక్రాంతికి కొత్త జిల్లాలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తారని తెలుస్తోంది. అంటే మరో రెండున్నర నెలల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సీఎం కార్యాలయంలో ప్రత్యేక అధికారికి బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా వచ్చే ఏడాది ప్రారంభంలోనే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి రానుంది.