(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. దీంతో లాక్ డౌన్ విధించక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అనధికార కర్ఫ్యూ, లాక్ డౌన్ కొనసాగుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రజలు, వ్యాపారస్తులు స్వీయ లాక్ డౌన్ విధించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో అనేకచోట్ల ప్రజలు వ్యాపారస్తులు లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తున్నారు. వ్యాపార సంఘాలు ఒక అవగాహనతో పనివేళలు కుదించుకుంటున్నాయి. మరికొన్ని చోట్ల అధికార యంత్రాంగం, స్థానిక సంస్థలు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత నుంచి దుకాణాలు, ఇతర వాణిజ్య సముదాయాల్ని మూసేస్తున్నారు. రాత్రి వేళల్లో అనధికారిక కర్ఫ్యూ, లాక్ డౌన్ వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకే దుకాణాలు తెరుచుకుంటాయని ప్రకటించటంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చేవారి రద్దీ బాగా తగ్గిందని వ్యాపారులు అంటున్నారు.
ఉత్తరాంధ్రలో..
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే రకమైన నిబంధనలు కొనసాగుతున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వైరస్ హాట్ స్పాట్లుగా మారడంతో స్థానికంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి. విజయనగరం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, కురపాంలలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత దుకాణాలు మూసేస్తున్నారు. బొబ్బిలిలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే కిరాణా, కూరగాయల దుకాణాలు తెరుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, సోంపేటలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నారు.
మార్గదర్శకాలు పాటించాలంటూ..
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. మాస్క్, ఫేస్ షీడ్, భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే మాస్క్ లేని వారికి రూ.100 నుండి రూ 200 జరిమానా విధిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆంక్షలు మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Must Read ;- రోజుకు 3లక్షలకు చేరుతున్నకరోనా కేసులు.. ఏపీలో ఆందోళనకరం