ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత కక్షలకు దిగుతున్నారని కొన్ని మీడియా ఛానళ్ళు ఓ కథనాన్ని ప్రసారం చేశాయి. దమ్మాలపాటిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కక్ష సాధిపులకు ప్రభుత్వం దిగిందని మీడియా కొన్ని రుజువులను చూపింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఏర్పాటుకు ముందే అప్పటి ఇంటలిజెన్స్ ఎస్పీ రఘురామిరెడ్డి ఆదాయపన్ను శాఖకు ఓ లేఖ వ్రాశారని మీడియా కథనాలను ప్రచారం చేసింది. ఆ లేఖలో 2011 నుంచి ఇప్పటి వరకు దమ్మాలపాటి ఐటీ రిటర్న్స్ తమకు అందచేయాలని ఆ లేఖలో కోరినట్లు తెలిపింది. నిబంధనల ప్రకారం సమాచారాన్ని ఇవ్వడం కుదరదంటూ ఆదాయపన్ను శాఖ స్పష్టం చేయడంతో ఆ తరువాత ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసి రఘురామిరెడ్డికే బాధ్యతలు అప్పగించారని కొన్ని మీడియా ఛానళ్ళు వరుస కథనాలను ప్రసారం చేసింది.
దమ్మాలపాటిని టార్గెట్ చేస్తూ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు దిగిందంటూ ఆరోపణలకు ఇది రుజువు అంటూ ఆ మీడియా ఛానళ్ళు వెల్లడించాయి. దమ్మాలపాటినే వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు మరో కారణాన్ని ఆ మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయి. జగన్ అక్రమాస్తుల కేసులో ‘క్విడ్ ప్రోకో’ జరిగిందంటూ వివరంగా హైకోర్టులో దమ్మాలపాటి తమ వాదనలను వినిపించారు. దీంతో తన ఆస్తులకు సంబంధించిన కేసులు సీబీఐకి చేరడానికి ప్రధాన కారణం దమ్మాలపాటి అని ఏపీ సీఎం భావిస్తున్నారని ఆ మీడియా ఛానళ్ళు తమ కథనాలలో తెలిపాయి. అందుకే జగన్ వ్యక్తిగత కక్షను దమ్మాలపాటిపై పెంచుకున్నారని మీడియా తెలపడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంటలిజెన్స్ ఎస్పీ హోదాలో ఎస్పీ రఘురామిరెడ్డి ఆదాయపన్ను శాఖకు వ్రాసిన లేఖను కూడా వారు బయటపెట్టడం గమనార్హం.
ఈ లేఖ బయటికి రావడంతో వైసీపీ శ్రేణులు ఖంగుతిన్నాయి. దీంతో వారు ఎదురుదాడికి దిగారు. అక్రమాస్తుల కేసులో జగన్ ను ఇరికించారనే దమ్మాలపాటికి గత ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ పదవి దక్కిందని ఆరోపణలు చేసింది. ఇదే సమయంలో లేఖలో ఉన్న సంగతి ప్రక్కనబెట్టి రఘురామి రెడ్డి వ్రాసిన లేఖ ఎలా బయటికి వచ్చిందంటూ వైసీపీ వర్గం వాదనలకు దిగింది. ప్రస్తుత జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో 328 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించేది కూడా దమ్మాలపాటి అనే విషయాన్ని వైసీపీ పార్టీ గుర్తు చేస్తోంది. ప్రభుత్వం పలు కేసులలో ఆయనను ఇబ్బంది పెట్టడానికి వ్యక్తిగత కక్షే కారణమంటూ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.











