సాంప్రదాయ పద్దతిలో సాగుతున్న బీజేపీ విధానాలను కొంత పుంతలు తొక్కించిన ఘనత నరేంద్ర మోడీది. ‘గుజరాత్ మోడల్’ అంటూ ప్రపంచమంతా ప్రచారం చేసుకున్న ఆయన 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థి అయ్యారు. ప్రశాంత్ కిషోర్ లాంటి నిపుణుల సాయంతో దేశమంతా మోడీకి నీరాజనాలు పడుతుంటే బీజేపీ కూడా ఆయననే తమ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించవలసి వచ్చింది. 10 ఏళ్లు వరుసగా పరిపాలించిన కాంగ్రెస్ పై వ్యతిరేఖత కూడా కలిసి రావడంతో బీజేపీ 2014 ఎన్నికలలో అధికారంలోకి రావడం మోడీ ప్రధాని కావడం జరిగిపోయింది. ఇక అక్కడి నుంచి మోడీ ‘కాంగ్రెస్ మార్క్’ రాజకీయాలనే ఫాలో అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.
పెద్ద నోట్ల రద్దు
‘బ్లాక్ మనీ’ని నియంత్రించేందుకు 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోడీ ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ఆర్థికవేత్తలు, మేధావులు, విపక్షాలు, బీజేపీ నాయకులు వ్యతిరేకించినా మోడీ పట్టించుకోలేదు. ఈ నిర్ణయం వ్యతిరేఖ ఫలితాలు ఇస్తుండటంతో మోడీ ఈ రద్దుపై పలుమార్లు మాట మార్చారు. ‘ఆన్లైన్ ట్రాన్సక్షన్స్’ ను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం మొదలెట్టారు. ఆ తరువాత ఈ నిర్ణయంతో ఉగ్రవాదం తగ్గిపోయిందని ప్రచారం చేసుకున్నారు. ఏదైమైనా ఆర్థికవేత్తలు చెప్పినట్లే దేశంలో ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది. యస్వంత్ సిన్హా, అరుణ్ శౌరి, శత్రుజ్ఞ సిన్హా లాంటి బీజేపీ నాయకులు ఈ నిర్ణయాన్ని బహిరంగంగానే విమర్శించారు. విమర్శించిన నేతలను శంకరగిరి మాన్యాలను పట్టించే బాధ్యత ‘మోడీ-షా’ ద్వయం తీసుకుంది. ఇంకేముంది మోడీ విధానాలకు వ్యతిరేఖంగా గళమెత్తిన నేతలు బీజేపీకి దూరం కావలసివచ్చింది.
తమకు వ్యతిరేకంగా పావులు కదిపిన ప్రతి ఒక్కరిని మోడీ ‘నయానో-భయానో’ తమ వశం చేసుకున్నారని విమర్శలు ప్రచారంలో ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, టీఆర్ఎస్, అన్నా డీఎంకే లాంటి పార్టీలు మోడీ ఏది చెబితే అది చేస్తాయని ఉదాహరణలు ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో బీజేపీ పలు రాష్ట్రాలలో అవలంబిస్తున్న విధానాలను చూస్తుంటే మోడీ మార్క్ క్లియర్ గా కనబడుతోంది. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్-జెడిఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం నుంచి మొదలెట్టి తాజాగా మధ్యప్రదేశ్ వయా రాజస్థాన్ వరకూ మోడీ తమ పాచికలు విసిరారు. గతంలో ఇలాంటి విధానాలను బీజేపీ ఎప్పుడూ ఫాలో కాలేదు. సీనియర్లు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను కూడా మోడీ పట్టించుకోవడం మానేశారని విమర్శలు వినబడుతూనే ఉన్నాయి.
సొంత అజెండానే నమ్ముకున్న మోడీ
‘పుల్వామా’ ఎటాక్, హిందుత్వ వాదనను తన ప్రచార అస్త్రంగా చేసుకోని మోడీ 2019లో తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇక అక్కడి నుంచి ‘మోడీ’ తన సొంత అజెండాని అమలు చేయడం మొదలెట్టారని తెలుస్తోంది. తమతో పాటు మొదటి నుంచి నడుస్తున్న పార్టీలను దూరం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే శివసేన, శిరోమణి అకాలీదళ్ పార్టీలను మోడీ సాగనంపారని విమర్శలు వచ్చాయి. తమను సంప్రదించకుండా తమ మాతృసంస్థ ‘ఆర్ఎస్ఎస్’ ద్వారా ఒత్తిడి తీసుకువచ్చే ఈ రెండు పార్టీలను దూరం పెట్టాలని మోడీ-షా ద్వయం నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినబడ్డాయి. జరిగిన ప్రచారం మేరకు ‘మహా’ ఎన్నికల సమయంలో శివసేనను, తాజాగా వ్యవసాయ సంస్కరణ బిల్లు సందర్భంగా శిరోమణి అకాలీదళ్ కు చెక్ పెట్టేశారు.
నమో మోడీ
‘పీపీఏ’ బిల్లు రైతులకు చాలా నష్టం కలిగిస్తుందని తెలిసినా ఒక్క పార్టీ కూడా వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకోకుండా మోడీ చేసుకోగలిగారంటూ దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బీజేపీకి తానొక్కడినే పెద్ద దిక్కు అనే భావన కోసం ఇలాంటి నిర్ణయాలు మోడీ తీసుకుంటున్నారని వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ‘వ్యక్తిగత పూజ’, ‘వారసత్వ రాజకీయాలకు’ దూరం అని చెప్పే బీజేపీని కొత్త పుంతలు తొక్కిస్తూ తాను లేనిది బీజేపీ లేదనే స్థాయికి మోడీ తీసుకువస్తున్నారని ఆయన వ్యతిరేకులు విమర్శలు చేస్తున్నారు. ‘నమో మోడీ’ అనే వారిని అందలం ఎక్కిస్తూ కాదనే వారిని మంగళం పాడుతూ మోడీ తన మార్క్ చూపిస్తున్నారని ఢిల్లీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఇక్కడ చెప్పవలసిన అవసరం ఎంతయినా ఉంది. 2019 ఎన్నికల ముందు ప్రజలలో దేశ భక్తి, హిందుత్వ వాదాన్ని నరనరాల ఎక్కించి 300కి పైగా మోడీ సీట్లను సంపాదించాడట. కరోనా మహమ్మారి నియంత్రణ చర్యలలో విఫలం, జీడీపీ -23కి పడిపోయిందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు ‘స్వదేశీ’ ఉద్యమాన్ని మోడీ చక్కగా వాడుకుంటున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. తనపై నెగటివ్ కామెంట్స్ వస్తున్న ప్రతిసారి ఏదో ఒక రూపంలో మోడీ దానిని అధిగమిస్తారని విపక్షాలు కూడా మెచ్చుకునే స్థాయికి చేరుకున్నారు. ఇలాంటి తెలివితేటలు దేశ అభివృద్ధి కోసం ఉపయోగిస్తే ఎంతో బాగుటుందని నెటిజన్స్ కోరుకుంటున్నారు!1











