అతి త్వరలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ ఉందని మీడియోలో ప్రచారం జరుగుతుండగా విశాఖలో ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ కూల్చివేయటం చర్చానీయాంశమయ్యింది. వివేకా హత్య కేసుకు సంబంధించి వైఎస్ జగన్‌పై వస్తున్న ఆరోపణలపై స్పందించిన వైఎస్ విజయలక్ష్మి (విజయమ్మ)రెండురోజుల క్రితం బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో వివేకా హత్య కేసు విషయంలో నిజం నిగ్గుతేల్చాలని తన కుటుంబసభ్యులందరి డిమాండ్ అని చెప్పారు. తమ కుటుంబంపై విషం కక్కుతున్నారని చెబుతూ ఇతర మీడియా సంస్థల పేర్లను ప్రస్తవించడంతోపాటు ABN- ఆంధ్రజ్యోతి గ్రూపును, ఆ సంస్థల ఎండి రాధాకృష్ణ పై ఎక్కువగా విమర్శలు గుప్పించారు. దీనిపై రాధాకృష్ణ కూడా తన ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలో గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తరువాత రెండు రోజులకు విశాఖలో లీజు స్థలంలో ఉన్న ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్ కూల్చివేత జరిగింది. సెలవు రోజున కూల్చివేతలు మొదలు పెట్టారు. కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకునే సమయానికి కూల్చివేత జరిగిపోయింది. ఈ కూల్చివేతతో ఆర్థికంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఎంత నష్టం వచ్చిందనే విషయం పక్కన బెడితే..అంతర్లీనంగా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద వైఎస్ జగన్ కక్షగట్టారనే కంటే ప్రతీకరేచ్ఛతో రగిలిపోతున్నారని చెప్పాల్సి ఉంటుంది. ఇందుకు కారణం కూడా ఉంది.

తాడేపల్లి కోటలోని రహస్యాలూ తనకు తెలుసంటూ..
వైఎస్ కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, తాడేపల్లి కోటలోని రహస్యాలూ తనకు తెలుసునని ముందే క్లూ ఇచ్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొంత కాలం క్రితం షర్మిల ప్రత్యేక పార్టీ పెడుతున్నారని రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వార్త సంచలనం రేపింది. ఈ వార్త తప్పని కొందరు, కరెక్టేనని కొందరు ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానించినా..షర్మిల పార్టీ పెట్టడం ఖరారైంది. అప్పటికే ఆంధ్రజ్యోతి వైఎస్ జగన్‌కు వ్యతిరేకమనే ప్రచారం ఉండడం, షర్మిల పార్టీ వార్త నిజం కావడంతో జగన్ శిబిరం షాక్‌కి గురికావడంతో పాటు ఆంధ్రజ్యోతిపై మరింత కక్ష పెంచుకున్నారని చెప్పవచ్చు. ఓవైపు షర్మిల పార్టీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 9న పార్టీకి సంబంధించి కీలక ప్రకటన రానుందని భావిస్తున్నారు. ఇదంతా జగన్‌కి నచ్చని అంశంగా బయట చర్చ నడుస్తోంది.
వైఎస్ వివేకా హత్య కేసు విషయం కూడా..
అది చాలదన్నట్లు వైఎస్ వివేకా హత్య కేసు విషయం కూడా వైఎస్ జగన్‌కు చిరాకు తెప్పిస్తోందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. వివేకా కుమార్తె సునీత ఇప్పటికే సీబీఐ అధికారులను కలవడం, పలు సంచలన వ్యాఖ్యలు చేయడంతో రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సందర్భంగా ఎంచుకున్న వైఎస్ విజయలక్ష్మి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో టీడీపీని, ఇతర మీడియాని, పవన్ కల్యాణ్‌ని విమర్శించడంతో పాటు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై పలు వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబంలో విభేదాలు లేవని, షర్మిలకు తమ మద్దతు ఉందని కూడా చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే..షర్మిల పార్టీ అంశంతోపాటు వివేకా హత్య కేసు విచారణ అంశంలోనూ వైఎస్ జగన్‌పై జరుగుతున్న ప్రచారంపై పరోక్షంగా వైఎస్ విజయలక్ష్మి స్పందించారని చెప్పవచ్చు.
షర్మిల ఇంటర్వ్యూ ఉందంటూ ప్రచారం
ఇదే అంశంపై మీడియాలో మరో ప్రచారం మొదలైంది. అతి త్వరలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ ఇంటర్వ్యూలో వైఎస్ షర్మిల ఏ విషయాలు చెబుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఆ ఇంటర్వ్యూలో వైఎస్ షర్మిల ఆ కుటుంబంలో విభేదాలున్నాయనే అంశాన్ని బలపర్చుతారా లేక జగన్ తాను ఒక్కటేనని చెపుతారా అనే చర్చ నడుస్తోంది. ఈ ఇంటర్వ్యూ విషయం బయటకు రావడంతోనే ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ గోడౌన్‌ను కూల్చివేశారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి చాలా సీరియస్‌గా ఉన్నారని, అదే సమయంలో షర్మిల కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో షర్మిల ఇంటర్వ్యూ అంశం కరెక్ట్ అయితే.. తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని సంచలన అంశాలు బయటకు వస్తాయని చెప్పవచ్చు.











