ప్రజల్లో దేవుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు సోనూ సూద్ తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ప్రగతి భవన్ లో మంగళవారం వీరిద్దరి భేటీ జరిగింది. సోనూ సూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో మందికి ఉపయోగపడ్డాయని కేటీఆర్ సోనూ సూద్ ను అభినందించారు. దేశవ్యాప్తంగా నలుమూలలనుంచి వస్తున్న విజ్ఞప్తులకు ఎప్పటికప్పుడు సోనూ స్పందిస్తున్న తీరుపై మంత్రి ప్రశ్నలు వేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని కితాబిచ్చారు. తన సేవా కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను, ఈ సేవా రంగంలో తన భవిష్యత్తు ప్రణాళికలను మంత్రి కేటీఆర్ కు సోనూ వివరించారు. తన తల్లి స్పూర్తితోనే తాను ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్ ప్రజల పట్ల, ఇక్కడి వారిపై తనకు ఉన్న అనుబంధాన్ని సోనూ సూద్ వివరించారు. ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణకి సేవలందిస్తున్న మంత్రి కేటీఆర్ అంటే కూడా తనకు ఎంతో గౌరవమని సోనూ వివరించారు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే ఇతరులకంటే భిన్నంగా కష్ట సమయాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారంటూ కేటీఆర్ ను ప్రశంసించారు. సమావేశం అనంతరం సోనూ సూద్ భోజన ఏర్పాట్లను కేటీఆర్ చేశారు. అనంతరం ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలకు అభినందనగా శాలువాతో సత్కరించారు. ఓ మెమెంటోను కూడా మంత్రి కేటీఆర్ సోనూ సూద్ కు అందజేశారు. వీరిద్దరి భేటీ మర్యాద పూర్వకంగానే జరిగిందా? వేరే ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్న అన్న అనుమానాలు కూడా ఏర్పడ్డాయి.
Mustr Read ;- సోనూసూద్.. మరో మంచి నిర్ణయం ఫ్రీ ఎడ్యుకేషన్