విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకి 2025 బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది అబూదాబికి కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. జనవరి నుంచి నవంబర్ వరకు అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 9 శాతం పెరిగింది. మొత్తం 27 లక్షల మంది విశాఖ విమానాశ్రయం నుంచి విదేశాలకు ప్రయాణించారు. అంటే నెలకు సుమారు రెండున్న లక్షల మంది వైజాగ్ మీదుగా ఫారిన్ కంట్రీస్‌కి వెళ్లారన్న మాట. గత ఏడాదితో పోల్చుకుంటే రెండున్నర లక్షల మంది పెరిగారు. ఇక నవంబర్‌లో ఇక్కడ ఇంటర్నేషనల్ కార్గో టెర్మినల్ ప్రారంభమైంది. ఈ సంవత్సరం డొమెస్టిక్ కార్గొ ద్వారా సుమారు 5 వేల టన్నుల సరకు రవాణా చేశారు.
ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వైజాగ్ ఎయిర్‌పోర్టు.. కస్టమర్ శాటిస్ఫ్యాక్షన్ ఇండెక్స్‌లో తొమ్మిదో ర్యాంకు సాధించింది. ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ డేగా ఎయిర్ స్టేషన్‌గా ప్రారంభమైన విశాఖపట్నం ఎయిర్‌పోర్టు ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయికి అభివృద్ధి చెందింది. ఇక్కడి నుంచి డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కమర్షియల్ ఫ్లయిట్స్ నడుస్తున్నా.. ఈ ఎయిర్‌పోర్టు భారత నౌకా దళానికీ సేవలు అందిస్తోంది.
ప్రస్తుతం భోగాపురం వద్ద నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం పూర్తయితే.. వాణిజ్య విమానాలు చాలా వరకు కొత్త ఎయిర్‌పోర్టు నుంచి నడిచే అవకాశం ఉంది. జనవరిలోనే భోగాపురం నుంచి ఫ్లయిట్స్ నడపాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం నిర్మించిన తర్వాత.. బేగంపేట ఎయిర్‌పోర్టు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలోకి వెళ్లింది. విశాఖలో మాత్రం నూతన విమానాశ్రయం అందుబాటులోకి వచ్చినా.. కొంత కాలం వరకు ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు యథావిధిగా నడుస్తుంది. తర్వాత కాలంలో దశల వారీగా.. భారత నౌకాదళం ఆధీనంలోకి వెళ్లే ఛాన్స్ ఉంది.











