కరోనా లాక్ డౌన్ కారణంగా.. 6నెలల నుంచి జనం థియేటర్స్ ముఖం ఎరుగకుండా ఉన్నారు. ఒటీటీలకు బాగానే అలవాటు పడినప్పటికీ .. థియేటర్స్ లో చూసే థ్రిల్లే వేరని వారికి బాగా తెలుసు. అన్ లాక్ 5.0 లో భాగంగా త్వరలోనే థియేటర్స్ ను రీఓపెన్ చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి తెరమీద బొమ్మ పడేందుకు అనుమతినిస్తూ .. 50 శాతం సీట్ల సామర్ధ్యాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది. దాంతో థియేటర్స్ తెరవడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
మరి థియేటర్స్ ఓపెన్ అయితే.. అందులో ప్రదర్శించడానికి అప్పటికి ఏ సినిమా రెడీ గా ఉంటుంది ? అని ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. అయితే రామ్ గోపాల్ వర్మ .. తన ‘కరోనా వైరస్’ సినిమాని విడుదల చేస్తానంటున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో అందరు దర్శకులూ ఇంట్లోనే కూర్చుని కాలక్షేపం చేస్తే.. వర్మ మాత్రం సినిమా మీద సినిమా తీసేసి జనానికి వరుసగా షాకులిచ్చాడు. తన ఏటీటీ ప్లాట్ ఫామ్స్ లో కొన్ని అడల్టరీ సినిమాలు తీసి బాగానే సొమ్ము చేసుకున్నాడు. ఇప్పుడు థియేటర్స్ తెరిచాకా కూడా వర్మ ఆ అవకాశాన్నీ వదలకపోవడం చర్చనీయాంశమైంది. అగస్త్య మంజు దర్శకత్వంలో వర్మ నిర్మాణంలో తెరకెక్కిన కరోనా వైరస్ .. అక్టోబర్ 15న విడుదలవడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఏ వైరస్ కారణంగా .. థియేటర్స్ ఇన్నాళ్ళూ మూతపడ్డాయో .. అదే వైరస్ మీద వర్మ తీసిన సినిమా థియేటర్స్ రీ ఓపెనింగ్ రోజునే రానుండడం విడ్డూరమే.