స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎస్ఈజెడ్) ను కనుగొన్న వాడికి అతి పెద్ద దండం పెట్టాలి. మిగతా రాష్ట్రాల మాట పక్కన ఉంచితే ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఈ మాట చెబితే ప్రజలు ఉలిక్కి పడతారు. అభివృద్ధి పేరిట కంపెనీలకు భారీగా భూములను కేటాయించడం అనేకంటే అప్పగించడం అని చెప్పడం సరైనది. నామమాత్ర ధరకే వందలాది ఎకరాలు కేటాయించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ‘వ్యాన్ పిక్’ భూముల విషయం అందరికి గుర్తుండే ఉంటుంది. వేల ఎకరాలతో మొదలెట్టి లక్ష ఎకరాలు దాక భూమిని సేకరించారు. కోస్తా తీరం వెంబడి సేకరించిన ఈ భూములను నిమ్మగడ్డ & కోకి ధారాదత్తం చేశారు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద రగడ జరిగింది. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసింది. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది.
అదే సమయంలో ఏపిక్ భూములను వైఎస్ సర్కార్ పప్పులు బెల్లాలుగా పారిశ్రామిక వేత్తలకు పంచి పెట్టింది. వీటిపై కేసులను అధికారులు, అప్పటి పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఎదురుకుంటూనే ఉన్నారు. అధికారం కోసం సుదీర్ఘ కాలం వేచిచూసిన జగన్ 2019లో అధికారంలోకి వచ్చారు. వచ్చి రాగానే ప్రజలకు పథకాల రూపంలో డబ్బులు పంచడం లాంటి పనులు చేయడం తప్పా అభివృద్ధి వైపు అడుగు వేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు ఆయన దాకా చేరాయేమో గాని వెంటనే 10 వేల మెగా సోలార్ పార్కులు నిర్మిస్తానని ప్రకటించాడు. ఇప్పటికే లక్షలాది ఎకరాల సేకరణ చేయాలని అధికారులను ఆదేశించాడు.
పరిశ్రమలకు భూములు ఇవ్వడం తప్పు కాదనే అనుమానం మీకు రావచ్చు. ఇక్కడే ఉంది అసలు తిరకాసు. 25 ఏళ్లకు లీజు అగ్రిమెంట్ చేసుకుంటారట. ఎకరానికి కేవలం ఐదు రూపాయలు మాత్రమే వసూల్ చేసి కార్పొరేట్ లకు లక్షలాది ఎకరాలను అప్పగించనున్నారని తెలుస్తోంది. సరే పోనీ ఇది కూడా అభివృద్ధిలో భాగం అనుకుందాం. ఇక్కడ తయారు చేసిన హైబ్రీడ్ కరెంటును బయటికి కూడా అమ్మేసుకోవచ్చని అనుమతి కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే ఉంది అసలు ట్విస్టు కేంద్ర ప్రభుత్వ భూ సేకరణ చట్టం ప్రకారం 6 లక్షల ఎకరాల భూమి సేకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేయరాదు. ఇంకేముంది ప్రభుత్వం, పరిశ్రమలు తయారు చేసిన డీపీఆర్ ప్రకారం రైతుల నుంచి భూముల కొనుగోలుకు బడా పారిశ్రామిక వేత్తలు రంగంలోకి దిగుతారని మేధావులు, నిపుణులు ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకేముంది వేలాదిమంది తమ భూములను ఇవ్వలేని పరిస్థితి నెలకొంటోంది. ఇదే సమయంలో ప్రభుత్వానికి ఇతోధికంగా జరిగే మేళ్ల గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.











