మెగా డాటర్ సుస్మిత ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ‘షూటౌట్ ఎట్ ఆలేరు’ పేరుతో తెరకెక్కే ఈ వెబ్ సిరీస్ కు ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఓ వివాదాస్పద కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. త్వరలో ఈ వెబ్ సిరీస్ జి 5 ఒరిజినల్ లో ప్రసారం కాబోతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సుస్మిత కంటిన్యూగా వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచనలో ఉన్నారు. మక్కా మసీదు పేలుళ్ల నేపథ్యాన్ని తీసుకొని కొంతమంది పోలీసులు – నేరస్తుల రియల్ లైఫ్ స్టోరీస్ ఆధారంగా దీన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ – సీనియర్ హీరో శ్రీకాంత్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ వెబ్ సిరీస్ టీజర్ ను విడుదల చేశారు. ఉగ్రవాది వికార్ అహ్మద్ అలియాస్ వికారుద్దీన్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రధారి అని తెలుస్తోంది. 2010 మక్కా మసీదు కాల్పుల్లో అతను కీలకపాత్ర వహించాడు. అతను ఓ కానిస్టేబుల్ ను కూడా కాల్చి చంపాడు. వరంగల్ జైలు నుంచి అతన్ని హైదరాబాద్ కు తరలిస్తుంటే తప్పించుకోవాలని ప్రయత్నించడంతో అతన్ని పోలీసులు కాల్చి చంపారు.
ఇది ఎన్ కౌంటర్ అని వికార్ తండ్రి కూడా అప్పట్లో ఆరోపించారు. ఈ వాస్తవ ఘటనలతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ కీలక పాత్రలను పోషిస్తున్నట్లు సమాచారం. మొత్తం 8 ఎపిసోడ్స్ గా ఇది రూపొందుతోంది. డైరెక్టర్ ఆనంద్ రంగా మంచి దర్శకుడు. ఆయన రూపొందించిన ఓయ్ సినిమా కమర్షియల్ గా వర్కవుట్ కాకపోయినా మంచి సినిమా అనే గుర్తిపును తెచ్చుకుంది. ఈ సిరీస్ విజయవంతమైతే ఆనంద్ రంగా మళ్లీ బిజీ అయిపోతారు. ఇప్పటికే ఆయన కొన్ని కథలతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ వెబ్ సిరీస్ టీజర్ కు కూడా మంచి స్పందన లభిస్తోంది.











