ఏపీ అధికార పార్టీ వైసీపీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. ఇందుకు ప్రతిగా మూడు కేంద్ర మంత్రి పదవులు వైసీపీకి రానున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి, మచిలీపట్టణం ఎంపీ వల్లభనేని బాలశౌరి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్ లకు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. కొన్ని రోజుల కిందట ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్ ఈ మేరకు అంగీకారాన్ని తెలియచేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. గతంలో టీడీపీకి రెండు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వగా ఈసారి వైసీపీకి మూడు పదవులు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
బీజేపీకి అవసరం…జగన్ కు అత్యంత ముఖ్యం
ఇటీవలే పార్లమెంట్ లో బీజేపీ కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టానికి ఎన్డీయే మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ వ్యతిరేకంగా తమ నిరసనను తెలిపింది. అయినా ఈ బిల్లు పాస్ కావడంతో ఆ పార్టీ ఎన్డీయే నుంచి వైదొలిగింది. ఈ నేపథ్యంలోనే జననాయక జనతా పార్టీ (జేజేపీ) కూడా ప్రభుత్వం నుంచి బయటికి రానున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ మిత్రపక్షం శివసేన ఎన్డీయే కూటమి నుంచి వైదొలిగింది. ఎన్డీయేకి జేడీ(యూ) ఒక్కటే నమ్మదగిన మిత్రపక్షంగా ఉంది. తమిళనాడు నుంచి అన్నాడీఎంకే, తెలంగాణ నుంచి టీఆర్ఎస్, ఏపీ నుంచి వైసీపీ ఇప్పటి వరకు ఎన్డీయే నిర్ణయాలను సమర్థిస్తూ వచ్చినా ఆ కూటమిలో జాయిన్ కాలేదు.
జగన్ కున్న కొన్ని పరిస్థితుల దృష్ట్యా ఎన్డీయే నిర్ణయాలను ఆయన సమర్థిస్తూ వస్తూనే ఉన్నారు. అధ్యక్షడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించడంతో బీజేపీ ఏపీలో తన దూకుడిని పెంచింది. ఓ వైపు టీడీపీ, మరోవైపు బీజేపీ నిరసనలతో సీఎం జగన్ ఒత్తిడికి గురవుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా జరిపిన ఢిల్లీ పర్యటనలో ఓ కీలక విషయాన్ని అమిత్ షాతో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అది టీడీపీకి లాభం చేకూరుస్తాయని అందుకే తమపై కాకుండా టీడీపీపై ఆరోపణలు చేయాలని జగన్ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీని అధికారానికి దూరం చేసి రాష్ట్రంలో బీజేపీ ప్రత్నామాయంగా ఎదిగినా తమకు ఎటువంటి ఇబ్బంది లేదని జగన్ చెప్పారని ఢిల్లీ వర్గాల నుంచి వార్తలు వినబడుతున్నాయి.
జగన్ దూరాలోచన
తనపై నమోదయిన కేసుల విషయాన్ని కూడా ప్రస్తావించిన ఆయన బీజేపీకి తాము నమ్మదగిన మిత్రపక్షమని చెప్పినట్లు తెలుస్తోంది. వీలైతే ఎన్డీయే ప్రభుత్వంలో చేరుతామని అమిత్ షాకు చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ ఇంత తొందరపడటానికి ఓ కారణముంది. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో బీజేపీ తమ అభ్యర్థిని నిలబెడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీకి మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి ఇక్కడనుంచి పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆ ఎన్నికలలో తమ పార్టీ ఓడిపోతే రాజకీయ చిక్కులు తప్పవనే ఉద్దేశంతో జగన్ మద్దతు ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టానికి టీడీపీ తమ మద్దతును తెలిపిన విషయం విదితమే. తాము ఆలస్యం చేస్తే చంద్రబాబు మరోమారు ఎన్డీయేలో చేరే అవకాశముందని భావించిన జగన్ ఈ ప్రతిపాదన చేసినట్టు వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. జగన్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే వైసీపీ అక్టోబర్ 25న ఎన్డీయేలో చేరడం ఖాయమని సమాచారం అందుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజుల వరకు ఆగక తప్పదు!











