మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లో టాప్ స్టార్ అనేకన్నా ఇండస్ట్రీకి మూలస్తంభం లాంటివాడు అనుకుంటారు చాలా మంది సినీ పెద్దలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా రంగంలో చిరంజీవిని మొదటి యాక్షన్-డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు. అంతకుముందు హీరోల సినిమాలలో ఈ అంశాలున్నా వాటికి అంత ప్రాముఖ్యత ఉండేది కాదు. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా తెలుగు తెరపై మొట్టమొదటి సారిగా ‘బ్రేక్ డ్యాన్స్’ చేసిన ఘనత చిరంజీవికే దక్కుతుంది.
దక్షిణాది హీరోలలో డాన్స్ చేయడంలో గొప్ప పేరు సంపాదించిన మొదటి హీరో చిరంజీవి మాత్రమే అని చెప్పడంలో సందేహం లేదు. ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా నటిస్తున్న గొప్ప నటుడు. ఆయన వెండితెరపై కనపడితే చాలు అనుకుంటారు ఆయన అభిమానులు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి మలయాళం సూపర్‌హిట్ ‘లూసిఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించనున్నట్లు సమాచారం. వెండితెరపై మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ జోడీకి మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరు నటించిన సినిమాలు చాలావరకు విజయం సాధించాయి.
వీళ్లిద్దరిని సినిమాలో జంటగా చూసి చాలాకాలమే అయింది. దీంతో వీరు కలిసి మళ్లీ ఎప్పుడు నటిస్తారా? అని ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. అలాంటి వారి ఆశలు ఫలించేలా ఓ న్యూస్ బయటికి వచ్చింది. మలయాళంలో మోహన్‌లాన్ నటించిన ‘లూసిఫర్’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకు వి.వి.వినాయక్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రమ్యకృష్ణను సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో ప్రముఖ నటి మంజు వారియర్ పోషించిన పాత్రలో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని యూనిట్ భావిస్తోందట. ఆ రోల్‌ను ఆమె చేతే చేయించాలని వినాయక్ అనుకుంటున్నారని, దీనిపై త్వరలోనే రమ్యకృష్ణను కలిసి పాత్ర గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్ పోషించేందుకు రమ్యకృష్ణ అంగీకరిస్తే ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ కావడం మాత్రం పక్కా.











