ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎవరి మీదో కాదు.. సాక్షాత్తూ తన మంత్రివర్గ సహచరులపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం ఏమిటీ అనుకుంటున్నారా…. ఎందుకు సీరియస్ అయ్యారని ఆలోచిస్తున్నారా… ఇంకెందుకు క్యాబినెట్ సమావేశాల్లో అంతర్గత అంశాలను మీడియాకు లీక్ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
గురువారం నాడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు మంత్రివర్గ సహచరులు. ఏజెండాలోని అన్ని అంశాలు చర్చించిన తర్వాత అధికారులను, ఇతరులను బయటకు పంపేసి క్యాబినెట్ సహచరులతో పలు అంశాలపై చర్చించారు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి.
ఈ సందర్భంగా మంత్రివర్గంలో ఏం జరుగుతోందో మీడియాకి తెలిసిపోతోందని, ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాస్తున్న మీడియాకి చాలా విషయాలు లీక్ అవుతున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. “మనం ఏం మాట్లాడుకుంటున్నామో అక్షరం కూడా పొల్లుపోకుండా మీడియాకు తెలిసిపోతోంది. పైగా మన ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న వారికి తెలుస్తోంది. వారు దాన్ని చిలువలు పలువలు చేసి రాస్తున్నారు. ఇలా మంత్రివర్గ సమావేశాల్లో అంతర్గత అంశాలను ఎందుకు చెబుతున్నారు’’ అని ఆయన సహచర మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా లీకులు ఇస్తున్న వారెవరో తనకు తెలుసునని, మరోసారి ఇలాంటిది జరిగితే కఠిన నిర్ణయాలు తీసుకుంటానని హెచ్చరించినట్లు సమాచారం.
మంత్రివర్గ సమావేశం వివరాలను సమాచార శాఖ మంత్రి మాత్రమే మీడియాకు వివరించాలని, మిగిలిన వారెవ్వరూ మీడియా ముందు పెదవి విప్పరాదంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి హుకుం జారీ చేసినట్లు చెబుతున్నారు.
జిల్లా విలేకరుల వద్ద లీక్…
మంత్రుల కొందరు రాజధానిలో మంత్రివర్గ సమావేశం జరిగితే లీకులు మాత్రం వారి జిల్లాలో ఉండే విలేకరులకు జారవేస్తున్నారని సమాచారం. రాజధానిలో ఉన్న విలేకరులకు చెప్తే విషయం బయటకు పొక్కుతుందనే కారణంగా ముందుగా జిల్లాలో ఉండే రిపోర్టర్లకు మంత్రివర్గంలో అంశాలను చేరవేస్తున్నట్లు చెబుతున్నారు. ఆ విలేకరులు తమకు వచ్చిన సమాచారాన్ని రాజధానిలో ఉండే వారికి లీక్ చేస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి.
జిల్లాలో తమ పట్టు ఉండాలంటే అక్కడి విలేకరులతో మంచి సంబంధాలు నెరపడం రాజకీయ నాయకులకు చాలా అవసరం. అక్కడి వారితో బాగుంటే ఆ తర్వాత రాజధానిలో విలేకరులతో బాగుండవచ్చునన్నది మంత్రుల అభిప్రాయం. పైగా రాజధానిలో ఉన్న విలేకరులతో తాము సఖ్యంగా ఉంటే ఆ విషయం బయటకు పొక్కుతుందని, అదే జిల్లాలో వారితో ఉంటే అది సాధారణ విషయంగా పరిగణిస్తారన్నది మంత్రుల అభిప్రాయంగా చెబుతున్నారు. దీని కారణంగానే జిల్లాలో ఉండే విలేకరులకు మంత్రివర్గ సమావేశం వివరాలు తెలియజేస్తున్నట్లు చెబుతున్నారు.
ఆ మంత్రికి చివాట్లు…!?
రాజధానికి సమీపంలోని ఓ నగరానికి చెందిన మంత్రిని ముఖ్యమంత్రి చివాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. ఆ మంత్రికి వ్యతిరేకంగా ఓ పత్రికలో వరుసగా కథనాలు వచ్చాయని, వాటిని ఆపడంలో భాగంగా ఆ విలేకరులకు ఆయనే లీకులు ఇస్తున్నారని అనుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం నాటి మంత్రివర్గ సమావేశంలో ఆ మంత్రికి అక్షింతలు వేసినట్లు తెలిసింది. మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మీడియాకు లీకవడం కొసమెరుపు.











