సోనూసూద్ – నెటిజన్లే కాదు జనమంతా రియల్ హీరోగా కొనియాడుతున్న పేరిది. ఈ కరోనా ఒక హీరోనే ఈ సమాజానికి పరిచయం చేసింది. అరుంధతి సినిమాలోని నటనకు ఉత్తమ విలన్ గా నంది అవార్డును అందుకున్న సూన్ సూద్ సినిమా జీవితం చాలా విచిత్రంగానే ఉంటుంది. మరో ముఖ్యవిషయమేమిటంటే సోనూను మన తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత దర్శకుడు శివనాగేశ్వరరావుకే దక్కుతుంది. నిజానికి అతని ఎంపిక, అతని పాత్ర కూడా తమాషాగానే ఉంటుంది.
పంజాబ్ నుంచి సినిమా రంగానికి…
పంజాబ్ లోని మోగ అనే పట్టణంలో పుట్టిన సోనూ అసలు సినిమా రంగానికి వచ్చిపడటమే విచిత్రం. అతను నాగపూర్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశాడు. మోడలింగ్, ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్ లు చేసేయడంతో సినిమాల మీద మోజు పెరిగింది. నటనలో శిక్షణ తీసుకున్నా అవకాశాలు వెంటవెంటనే వచ్చి పడలేదు. 1999 లో కుళ్ళళలగర్ అనే తమిళ సినిమాలో సౌమ్య నారాయణ అనే పూజారి పాత్రతో అతను తెరకు పరిచయమయ్యాడు. మరి తెలుగులోకి ఎలా వచ్చాడో తెలుసుకుందాం.
శివనాగేశ్వరరావు కంట్లో ఇలా పడ్డారు
జయసుధ, నితిన్ కపూర్ లు దర్శకుడు శివనాగేశ్వరరావుతో ‘హ్యాండ్సప్’ అనే తీయాలనుకున్నారు. అందులో కొత్త విలన్ ని పరిచయం చేస్తే ఫ్రెష్ గా ఉంటుందన్నది శివనాగేశ్వరరావు ఆలోచన. చాలామంది కొత్త వాళ్లకు ఆడిషన్ చేశారు. ఎవరూ నచ్చలేదు. దాంతో మోడల్ కోఆర్డినేటర్ సుష్మా కౌర్ కొన్ని ఫొటోలు పంపడంతో వాటిలో ఓ ఫొటో నచ్చేసింది శివనాగేశ్వరావుకు.. అతనే సోనూ సూద్. అప్పటికే అతను తమిళ సినిమా చేశాడు. అందులో గుడిలో పూజారి పాత్ర. ఆ సినిమా సెన్సార్ ప్రాబ్లమ్ కారణంగా విడుదల కాలేదు. అతనిది పూజారి వేషమే అయినా ప్రతి శుక్రవారం గుడిలో తలుపులు వేసుకుని నమాజు చేసుకునే ముస్లిం పాత్ర. తమిళనాడు కు ఐఎస్ఐ ఏజంటుగా వచ్చి పూజారిగా మారిన పాత్ర కావడంతో సెన్సార్ అభ్యంతరాలు వచ్చాయట.
డైలాగ్ చెప్పలేకపోయాడు
డైలాగ్ చెప్పమని శివనాగేశ్వరరావు అంటే కొంచెం ప్రాక్టీసు చేసుకుని చెబుతాను అన్నాడట. డైలాగ్ చెప్పాక ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి కాబట్టి ఎలా చెప్పిన సరిచేసుకోవచ్చన్న నమ్మకంతో అవకాశం ఇచ్చేశారు. అతని అసెస్టెంటు పాత్ర తనికెళ్ల భరణిది. ఆరు టేక్ లు తిన్నా తెలుగు సరిగా రాకపోవడంతో డైలాగ్ సరిగా పలకలేకపోతున్నాడు. దాంతో అతనికి డైలాగులు తక్కువ చేస్తే బాగుంటుందన్న ఆలోచన భరణికి, శివనాగేశ్వరరావుకు వచ్చినా దాని ఇంపాక్ట్ అంతగా ఉండదేమో అనిపించింది. దాంతో వారికి కొత్త ఆలోచన వచ్చింది. అదేంటంటే అతను డైలాగ్ హిందీలో చెబుతాడు… భరణి దాన్ని తెలుగులోకి అనువదిస్తాడు… ఇలా చేస్తే కొత్తగా ఉంటుంది అని కూడా అనిపించింది. ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యింది.
క్లైమాక్స్ లో నాగబాబు..బ్రహ్మానందం..సోనూసూద్ ని తిట్టే సీన్..’క్యా బోల్తా హై వో’..అని సోనూ సూద్ అంటాడు..భరణి వాళ్ళు తిట్టే తిట్లు అన్నీ హిందీ లో చెబుతాడు..సోను…’తుం కో టుకడే టుకడే కర్కె మార్ దుంగా’…భరణి వీళ్లకు తెలుగులో చెబుతాడు..‘మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేసి చంపుతాను’…నాగబాబు ముందుకు వచ్చి షర్ట్ బటన్స్ తీసి..’నువ్వు మాగాడివైతే చంపరా’.. భరణి దాన్ని హిందీలో’ఆగర్ తుం మర్డ్ హై తో మార్ రే’..ఇలా నాగబాబు బాగా రెచ్చ గొట్టేసరికి భరణి సోనూసూద్ ఎదురుగా నిలబడి షర్ట్ బటన్స్ తీసి..మార్ రే.. మార్ రే.. మారో ముఝే’..అని రెచ్చగొడతాడు..సోనూ ఆవేశం ఆపుకోలేక భరణి తన మనిషే అనే స్పృహ లేకుండా భరణిని కాల్చేస్తాడు.. స్పాట్ లో చచ్చిపోతాడు భరణి.
ఇది కొత్త ప్రయోగమైనా సన్నివేశం బాగా రక్తికట్టింది. అవసరం అనేది కొత్త మార్గాన్ని చూపిస్తుందనటానికి ఇదే ఉదాహరణ. అటు విలన్ గా సోనూ పాత్ర, ఇటు అసిస్టెంటుగా భరణి పాత్ర… రెండూ పండాయి. అలా సోనూ తెలుగు పరిశ్రమ దృష్టిలో పడ్డాడు. ఓ మంచి నటుడిని, వ్యక్తిని తెలుగు తెరకు పరిచయం చేయగలిగానన్న సంతృప్తి తనకు ఉందని దర్శకుడు శివనాగేశ్వరరావు అంటుంటారు.











