పార్లమెంటు వర్షాకాలలో ఎలా వ్యవహరించాలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. వర్చువల్ సమావేశం ద్వారా ఎంపీలతో మట్లాడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్లమెంటులో ఎలా వ్యవహరించాలో వివరించారు. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను పార్లమెంటులో ప్రస్తావించాలి గాని మరీ ఇబ్బందులు పెట్టేలా వ్యవహరించరాదంటూ ముఖ్యమంత్రి ఉద్బోదించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఈ సమావేశాల్లో ప్రస్తావించాలని, ఈ అంశంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ పొందాలని ఎంపీలకు ఆయన సూచించారు. ఎన్నాళ్ల నుంచో బకాయి పడ్డ పోలవరం ప్రాజెక్టు నిధులను కేంద్రం విడుదల చేసేలా సమావేశాల్లో ప్రస్తావించాలని సీఎం చెప్పారు. పోలవరం నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాల్సి ఉందని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ నిధులు కూడా వచ్చేలా పార్లమెంట్ సభ్యులు ఒత్తిడి చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రితో జరిగిన వర్చువల్ మీటింగ్ వివరాలను వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత మిథున్ రెడ్డి విలేకరులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశామని, అంతకు ముందు ఈ ప్రాజెక్టుపై తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదని మిథున్ రెడ్డి విమర్శించారు. పోలవరం అంశంపై త్వరలోనే కేంద్ర మంత్రులను కలుస్తామని, నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు.
జీఎస్టీ బకాయిలు కూడా పెండింగ్ లో ఉన్నాయని, ఆ నిధుల విడుదలకు అధికారులతో చర్చించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారని ఎంపీ వివరించారు. గరీబ్ కళ్యాణ్ కింద రాష్ట్రానికి నిధులు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, ప్రతి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్నది సీఎం ఉద్దేశ్యమని, ఈ విషయంలో కేంద్రం మద్దతు కోరాలని భావిస్తున్నామని మిథున్ రెడ్డి చెప్పారు. విజయనగరం జిల్లా సాలూరులో గిరిజనుల కోసం గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించాలన్నది సీఎం లక్ష్యమని, దీనిపై కూడా సబలో ప్రస్తావిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు.
మాపై తప్పుడు ప్రచారం…
అంతర్వేదిలో రథం తగులబడిన సంఘటనను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలు లాభ పడదామనుకుంటున్నాయని, ఈ సంఘటనపై నిజాలు నిగ్గు తేలేందుకు సీబీఐ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని మిథున్ రెడ్డి అన్నారు. “అంతర్వేది ఘటనను అడ్డం పెట్టుకుని మతకలహాలు తీసుకురావాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వారి ఆటలు సాగువు“ అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన దోషులను శిక్షించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ అంశంతో పాటు సీఆర్డీఏ, ఫైబర్ గ్రిడ్ లపై కూడా సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మారాలు చేసిన పంపిన దిశా బిల్లు, కౌన్సిల్ రద్దు బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని, ఈ విషయంపై కూడా సభలో ప్రస్తావించాలని సీఎం సూచించినట్లు మిథున్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రావాల్పిన నిధులు, ఇతర అంశాలపై కేంద్రాన్ని కోరతామే తప్ప ఘర్షణ వాతావరణం మాత్రం తమకు ఇష్టం లేదని ఆయన అన్నారు.











