హైదరాబాద్ మహానగరమట.. విశ్వనగరమట.. పైగా వరల్డ్ క్లాస్ సిటీ అట. ఈ మాటలను మనం తరుచూ కొంతమంది రాజకీయ నాయకులు చేసే ఉపన్యాసాల్లో వింటూ ఉంటాం. వారి మాటలు విన్న మనం కూడా హైదరాబాద్ నిజంగానే విశ్వనగరం అని భ్రమలో ఉంటాం. కానీ మొన్న కురుసిన వర్షానికి హైదరాబాద్ విశ్వనగరమా? వరల్డ్ సిటీనా? అనే సందేహం, ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో తలెత్తుతున్నాయి.
కొంత మంది రాజకీయ నాయకులు తమ ఊకదంపుడు ఉపన్యాసాల్లో హైదరాబాద్ విశ్వనగరమని.. ప్రపంచ నగరాల్లోని మిగతా టాప్ నగరాల కంటే ముందంజలో హైదరాబాదే దూసుకుపోతుందని ఒకటే డబ్బా కొడుతుంటారు. అది విన్న మనం కూడా బహుశా ఇదే నిజమేమోనని గర్వంగా ఫీలవుతామ్. కానీ మొన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ ఎండుటాకుళ్లా గజగజ వణికిన తరువాత హైదరాబాద్ విశ్వ నగరం కాదు.. విషాద నగరమని అభిప్రాయానికి వస్తున్నారు.
విశ్వ కాదు..విషాదమే!
వర్షం సృష్టించిన బీభత్సానికి ఏమాత్రం తట్టుకోని హైదరాబాద్ నగరం.. విశ్వ నగరం ఎలా అవుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విషాదాన్ని మిగిల్చిన నగరంగానే చూడాలంటున్నారు పలువురు రాజకీయనాయకులు. పెద్ద వర్షాలు కురిసినప్పుడు మాత్రమే కాదు చిన్న వర్షాలకు కూడా హైదరాబాద్ అతలాకుతలం మనం గతంలో చూసే ఉంటాం. గత రోజులు కురిసిన వర్షానికి హైదరాబాద్ నగరం రోడ్లు చెరువులను తలపిస్తుంటే, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. వరద నీరు కాలనీలను, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన ఘటనలు మనం చూశాం. వరద నీరు పోయేందుకు సరైనా మార్గాలు లేకపోవడంతో ఆ వరద నీరంతా ఇళ్లల్లోకి చేరిపోతుంది.
ఎక్కడ చూసినా దాదాపు నాలాలు, చెరువలన్నీ కబ్జా దారుల చేతుల్లోకి పోవడమే దీనికి ప్రధాన కారణమని మేధావులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి మురుగు నీరు, వరద నీరు పోయేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. కానీ హైదరాబాద్ నగర వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటి పైపులైన్లను వరద కాల్వలకు కలిపేశారు. దీంతో వర్షం కురుసినప్పుడు ప్రవాహం ఎక్కువై ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.
5 లక్షల జనాభకు సరిపడే డ్రైనేజీ వ్యవస్థ…
నగరంలో 5 లక్షల జనభాకు సరిపడా మాత్రమే హైదరాబాద్ డ్రైనజీ వ్యవస్థ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ జనాభ సుమారు 1కోటి 50 లక్షల వరకు ఉంది. దీనికి తోడు ఎక్కడికక్కడ నాలాలు కబ్జాలకు గురై అక్రమ ఇళ్లు వెలిశాయి. ఒకప్పుటి చెరువులు.. కబ్జాలకుగురై కుంటలుగా మారుతున్నాయి. హైదరాబాద్‌కు ఒకప్పుడు లేక్ సిటీగా పేరుంది. కానీ ఇప్పుడు చెరువు భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. చెరువులకు ఆనుకుని అడ్డగోలుగా ప్లాట్లు వెలుస్తున్నాయి. దీంతో వర్షాలు కురిసినప్పుడు నీరు వెళ్లేందుకు సరైనా మార్గాలు ఉండట్లేవు. ఈతరుణంలో ఆ వర్షపు నీరు వెళ్లేందుకు దారుళ్లేక ఆ నిరంతా ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. ఈక్రమంలో కాలనీలు, లోతట్లు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. అదేవిధంగా వర్షాలు కురిసినప్పుడల్లా రోడ్లు కోతకు గురవుతున్నాయి. రోడ్ల నాణ్యతను కాంట్రాక్టర్లు పాటించట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కబ్జా కొరల్లోకి నాలాలు, చెరువులు…
అయితే రాజకీయ నాయకులు ఎన్నికలు ముందు మాత్రమే ప్రజల సమస్యలను పట్టించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత మళ్లీ అంతామామూలే. నాలాలు, చెరువులు కబ్జా కొరల్లోకి వెళుతున్నాయి. వాటిని అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. చెరువులను కబ్జాలు చేసి వాటిని ప్లాట్లుగా చేసే వారిపై చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తప్పులను చూసి చూడనట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తే మొన్న జరిగిన విపత్తే మళ్లీ పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
కట్టలు తెగుతున్న ప్రజాగ్రహం..
మొన్న కురిసిన వర్షానికి నగర జనం బిక్కుబిక్కు మంటూ తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. మనుషులు, పశువులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. కొంత మంది మృతదేహాలను గుర్తించారు. ఇంకా కొంత మంది ఆచూకి కోసం ఇప్పటికీ అధికారులు వెతుకుతున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్న అధికార పార్టీ నాయకులకు ప్రజల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, భేతి సుభాష్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డికి ఇలాంటిదే ఒక చేదు అనుభవం ఎదురైంది.
ఎమ్మెల్యే సుబాష్‌రెడ్డి.. నీట మునిగిన తన ఉప్పల్ నియోజకవర్గం పర్యటనకు గురువారం వెళ్లారు. పడవపై దర్జాగా వెళ్లడంతో ప్రజలు అతనిపై సీరియస్ అయ్యారు. వర్షాలకు ఇండ్లు కూలాయని, విలువైన వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయని, తమకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యే పేరు రాసి చనిపోతామని చెప్పారు. ఎమ్మెల్యే పడవ దిగి తన కారు ఎక్కబోతుంటే తన కాన్వాయ్‌పై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పును, రాళ్లను విసిరినట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిను ప్రజలు ప్రశ్నించారు. మరికొంత మంది అధికార పార్టీ నేతలను కూడా స్థానిక ప్రజలు అడ్డుకున్నారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.
ఇప్పటికైనా హైదరాబాద్‌ను విశ్వనగరమని… మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని ప్రజలు కోరుతున్నారు. విశ్వ నగరమంటే వర్షాలకు మునిగే విధంగా ఉండకూడదని, ఎలాంటి ప్రతికూల వాతావరణాన్నైనా తట్టుకుని నిలబడేలా ఉండాలని మేధావులు తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేస్తున్నారు.











