ఉన్నమాటంటే వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది ? ఏపీ పరిస్థితి పైన పటారం లోన లొటారంగా ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యల్లో నిజం లేదా ? ఆంధ్ర ప్రదేశ్ నిరాశ , నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతోందన్న ప్రతిపక్షాల వాదన వాస్తవం కాదా ? ప్రశ్నించే పై ఎదురుదాడి చేస్తున్న జగన్ భజన బృందం, కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలపై మాత్రం మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏమిటి ?
మొగుడు కొట్టినందుకు కాదు ఆడపడుచు నవ్వినందుకు ఏడ్చిందట. ఇప్పుడు ఏపీలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇదే రకంగా ఉందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు అద్వాన్నంగా ఉన్నాయంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై జగన్ సర్కార్ గగ్గోలు పెడుతోంది. మా ప్రభుత్వం పై ఇంతటి నిందలేస్తారా ? కావాలంటే రండి ఏపీ మొత్తం తిప్పి మేము చేసిన అభివృద్ధి చూపిస్తాం అంటూ సన్నాయి నొక్కుళ్ళు నొక్కుతున్నారు వైసీపీ మంత్రులు. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం జగన్ భజన బృందం చెబుతున్నంత ధీటుగా మాత్రం లేవనేది రాష్ట్రంలో వినిపిస్తున్న టాక్.
నిజానికి జగన్ ప్రభుత్వం పరిపాలనలోనూ, ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడంలోనూ వైఫల్యం చెందిందనేది బహిరంగ రహస్యం. కేవలం జగన్ ఒంటెద్దు పోకడ పాలన తప్ప రాష్ట్రంలో ఎక్కడా సరయిన పరిపాలన కనిపించడం లేదనేనది స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతి స్పష్టత లేకపోవడం,రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టు సంస్థలను వెంటాడిన తీరు, కోర్టుల్లో నిత్యం మొట్టికాయలు తింటున్న వైనం, రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం నిధులు మంజూరు చేసినా ఆ పనుల్లో జరుగుతున్న జాప్యం, పీపీఏల రద్దు విషయంలో కేంద్రం చెప్పినా, రాష్ట్రానికి జరిగే నష్టం పై బాధ్యతగా ప్రభుత్వానికి సూచన ఇవ్వాలనే ఆలోచనతో అనుభవం కలిగిన ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన సూచనలను గుడ్డిగా వ్యతిరేకించిన వైనం ఇవన్నీ జగన్ అసమర్ధతకి తార్కాణాలుగా నిలుస్తున్నాయి.
నిజానికి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బయటి నుంచి పెట్టుబడులు రావాలి.కానీ జగన్ మూడేళ్ళ పాలనలో స్టెయిన్ లెస్ స్టీల్ పై ప్లాంట్, కాస్టిక్ సోడా ప్లాంట్ తప్ప వచ్చిన పెట్టుబడులు శూన్యమే.అదేసమయంలో పథకాల పంపిణీ పేరిట దుబారా, రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచెత్తడం,ఎక్కడా కానరాని అభివృద్ధి పనులు వీటిపైనా జగన్ ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కుంటూనే ఉంది. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ పరిస్థితి కక్కలేక, మింగలేక సతమతమవుతున్నట్లుగా అన్నట్లుగా తయారయ్యిందట.దీంతో వైసీపీ అధిష్టానం ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. ఇక హై కమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రులు కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ప్రెస్ మీట్ లు పెట్టి ప్రకటనలు చేశారు.
అయిట్ వైసీపీ నేతల తీరు విస్మయానికి గురిచేసిందే చర్చ జోరందుకుంది. ప్రతిపక్షాలు ఏదైనా చిన్నపాటి విమర్శ చేస్తే ఒకరికి పది మంది ఎదురుదాడి చేస్తారు. అలాంటిది పక్క రాష్ట్ర మంత్రి పరువు తీసేలా వ్యాఖ్యలు చేస్తే కనీసం గట్టిగా ఖండించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం తెలంగాణలో తమకున్న ఆస్తులు కాపాడుకోవాలని, అదే సమయంలో అక్కడి టీఆర్ఎస్ తో ఉన్న రాజకీయ లాలూచీ కారణంగానే వైసీపీ నాయకత్వం కేటీఆర్ వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేసమయంలో వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాల కంటే.. టీఆర్‌ఎస్ తో ఉన్న సత్సంబంధాలే ముఖ్యంగా కనిపిస్తున్నాయని , రాష్ట్ర ప్రయోజనాలు ఎలా పోయినా పరవాలేదు, తాము టీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ఏ పనీ చేయకూడదు అనే ఆలోచనలో వైసీపీ ఉందని కొందరు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
మొత్తం మీద ఏపీ ప్రతిష్ఠ జాతీయ స్థాయిలో మసకబారుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం దానిని చక్కదిద్దే ప్రయత్నం చేయకపోగా , పొరుగు రాష్ట్రాల నేతలు చులకన చేసి మాట్లాడుతుంటే మౌనం వహించడం ఒక ప్రభుత్వాధినేతకి తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రానున్న రోజుల్లో మరిన్ని మాటలు పడాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ అంశంలో జగన్ సర్కార్ స్పందిస్తుందా ? లేక తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిపోతున్నా చోద్యం చూస్తూ కూర్చుంటుందా అనేది వేచి చూడాలి.