వైసీపీలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాతి స్థానం ఎవరిదన్న ప్రశ్న గతంలో వినిపిస్తే… అది ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డిదేనని అందరూ ఠక్కున చెప్పేవారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాయిరెడ్దితో పాటుగా ఐదేళ్లుగా ప్రభుత్వ సలహాదారు పదవిలో సకల శాఖా మంత్రిగా దర్పం ఒలకబోసిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా యాడైంది. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయాక సజ్జల సైలెంట్ అయిపోతే… అప్పటిదాకా ఢిల్లీకే పరిమితమైనట్టుగా కనిపించిన సాయిరెడ్డి మళ్లీ ఇప్పుడు యాక్టివ్ అయిపోయారు. మొన్నటిదాకా పార్లమెంటరీ పార్టీ నేత పదవితో పాటు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని పార్టీకి చెందిన ఆయా అనుబంధ సంఘాలతో భేటీలు అంటూ ఆయన కాలం వెళ్లదీసేవారు. తాజాగా ఇప్పుడు గతంలో మాదిరే ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవిని దక్కించుకున్న సాయిరెడ్డి… తాడేపల్లిని వదిలి విశాఖకు షిఫ్ట్ అయిపోయారు.
ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా సాయిరెడ్డికి కేవలం విశాఖ, శ్రీకాకుళం జిల్లాల పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే దఖలు పడ్డాయి. విజయనగరం జిల్లాకు ఆయన పర్యవేక్షణ అవసరం లేదంటూ మాజీ మంత్రి, ప్రస్తుతం శాసనమండలి విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పడంతో ఆ జిల్లాను సాయిరెడ్డి బాధ్యతల నుంచి తప్పించారు. సాయిరెడ్డికి తిరిగి ఈ పదవిని అప్పగించడంలో జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లుగా వైసీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా.,..సుదీర్ఘ కాలం పాటు ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ గా ఉన్న సాయిరెడ్డి… తన డాబూదర్పాలను వెలగబెట్టడంతో పాటు పలు చోట్ల భూకబ్జాలకు కూడా పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అదే సమయంలో ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఈ వివాదాల్లో చిక్కుకున్న సందర్భంగా సాయిరెడ్డి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
ఏపీ వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో కూటమి పార్టీలదే మెజారిటీ. ఇక విశాఖ జిల్లాలో మెజారిటీ టీడీపీది. ఎప్పటిలాగే విశాఖ నగరంలో టీడీపీ ఆధిపత్యం చాలా విస్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులను కాపాడుకునే విషయంలో వైసీపీ చాలానే కష్టపడక తప్పదు. పార్టీ అధికారంలో ఉండగా…విశాఖలో చక్రం తిప్పిన సాయిరెడ్డి… ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ శ్రేణులను కూడా కాపాడాల్సిందేనన్నభావనతోనే జగన్ ఆయనను తిరిగి ఉత్తరాంధ్ర జిల్లాల కో ఆర్డినేటర్ గా పంపించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అదికార కూటమి నుంచి విశాఖకు సంబంధించిన దూసుకువచ్చే ప్రశ్నలకు కూడా సాయిరెడ్డే సమాధానం చెప్పుకుంటారన్న భావనతోనే జగన్ తిరిగి ఆయనకు ఈ పదవిని కట్టబెట్టినట్లుగా పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే… దేశ రాజదాని ఢిల్లీలో మొన్నటిదాకా వైసీపీకి ఏ అవసరం పడినా పార్టీ అధిష్ఠానం నుంచి నేరుగా సాయిరెడ్డికి సమాచారం వెళ్లేది. సాయిరెడ్డి కూడా ఆ పనిని నిమిషాల్లోనే పూర్తి చేసేవారు. అయితే ఇప్పుడు కొత్తగా ఢిల్లీలో అవసరమైన ప్రతి పనిని జగన్ తనకు అనుంగు భక్తుడైన తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి చెబుతున్నారట. సాయిరెడ్డి కంటే బాగా జూనియర్ అయిన గురుమూర్తిని జగన్ తన పనులకు పురమాయిస్తున్నారంటే… సాయిరెడ్డిని క్రమంగా ఢిల్లీ నుంచి కూడా దూరం చేయడం ఖాయమేనన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి. గడచిన ఐధేళ్ల పాటు ఎంపీగా ఉన్న గురుమూర్తి కూడా ఢిల్లీలో పరిచయాలను బాగానే పెంచుకున్నారు. జగన్ చెప్పిన పనులను ఆయన ఇట్టే చేసేస్తున్నారట. అసలే ఆస్తుల పంచాయితీ నేపథ్యంలో జన్మనిచ్చిన తల్లి, తోడబుట్టిన చెల్లిలతో బహిరంగ యుద్ధమే చేస్తున్న జగన్… ఇప్పుడు సాయిరెడ్డి ప్రాధాన్యాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటున్న తీరుపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.