పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ‘సాహో’ సినిమా అవకాశం అందుకున్నప్పటికీ, దాన్ని ఆశించిన స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోయాడు దర్శకుడు సుజిత్. తన రెండో సినిమానే ప్రభాస్ వంటి హీరోతో పని చేయడం అంటే మాటలు కాదు. ‘సాహో’ సినిమా రిజల్ట్ టాలీవుడ్ లో ఎలా ఉన్నా బాలీవుడ్ లో మాత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేయబోయే మళయాళం రీమేక్ ‘లూసిఫర్’ బాధ్యతలను సుజిత్ పై పెట్టారు నిర్మాతలు. అయితే ‘లూసిఫర్‘ కథను మన తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చడంలో విఫలం చెందాడు దర్శుకుడు సుజిత్.
మెగాస్టార్ లాంటి హీరోతో సినిమా చేసే అవకాశం మిస్ అయినందుకు సుజిత్ కూడా కాస్త ఫిల్ అయ్యాడు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రభాస్ నటించిన ‘ఛత్రపతి’ సినిమాతో హీరోగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాకు కూడా సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని, తనకు ఎలాంటి బాలీవుడ్ ఆఫర్ రాలేదని సుజిత్ స్వయంగా చెప్పాడు. అయితే సుజిత్ ‘సాహో’ చిత్రం తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఒక అదిరిపోయే కథను సిద్ధం చేసుకున్నాడని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
తను రెడీ చేసుకున్న కథకు హీరో గోపీచంద్ అయితే బాగుంటాడని భావించిన సుజిత్ ఈ మధ్యనే గోపీచంద్ ను కలిసి కథ వినిపించాడని టాక్ నడుస్తోంది. ఆ కథలోని ఎలిమెంట్స్ గోపీచంద్ కు కూడా బాగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఫుల్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉండనున్నదని, ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాపై త్వరలోనే ఒక అఫీషియల్ న్యూస్ రానున్నదని సమాచారం. ప్రస్తుతం గోపీచంద్, సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. సంపత్ నది సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో సినిమాను గోపీచంద్ చేస్తాడని టాక్ నడుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ‘లూసిఫెర్ రీమేక్ వెర్షన్ కు తమిళ డైరెక్టరా?











