వైసీపీ పాలనలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై ఆ పార్టీ నేతల ఇష్టారాజ్యం సాగింది. అదికారంలో ఉన్న తమను ప్రశ్నించే నాథుడే లేరన్న రీతిలో వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరు జనానికి ఆగ్రహం తెప్పించింది. అంతేకాకుండా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి తీసుకుని వచ్చి… తొలుత అదనపు ఈవో పోస్టు,.ఆపై ఐఏఎస్ అధికారులకు మాత్రమే ఇచ్చే ఈవో పోస్టును కట్టబెట్టిన వైసీపీ నేతలు కొండపై తమకు ఇష్టం వచ్చిన రీతిలోనే వ్యవహరించారు. ఇక రోజా లాంటి నేతలైతే వారం వారం కొండపైకి వస్తూ.. వచ్చిన ప్రతిసారి ఓ భారీ మందను తమ వెంటేసుకుని వచ్చి… అలా తమ వెంట వచ్చిన వారి నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసుకున్నారన్న విమర్శలూ లేకపోలేదు. మొత్తంగా కొండపై వైసీపీ నేతల దారుణాలకు కూటమి సర్కారు రాకతో తెర పడింది.
పరమ పవిత్రమైన తిరుమల కొండపై ఇష్టారీతిన అక్రమాలకు పాల్పడ్డ వారి ఆగడాలు ఇక నిలిచిపోయాయిలే అనుకునేంత పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తిరుమల కొండ అన్నా.. అక్కడి వెంకన్నస్వామి అన్నా అపార భక్తి భావనలు ఉన్న టీవీ5 చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బీఆర్ నాయుడు) టీటీడీ చైర్మన్ గా ఎంపికవడంతో ఈ డిమాండ్లు మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి బీఆర్ నాయుడు ఏడాదికి కనీసం 5 నుంచి 6 సార్లు తిరుమల కొండపైకి వెళ్లి తన ఇష్ట దైవం వెంకన్నను దర్శించుకుంటూ ఉంటారు. అయితే వైసీపీ పాలన సాగిన గత ఐదేళ్లలో బీఆర్ నాయుడు ఒక్కటంటే ఒక్కసారి కూడా తిరుమల వెళ్లలేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. వైసీపీ జమానాలో కొండపైఅన్నీ అరాచకాలే జరిగాయని, ఫలితంగా కొండపై పవిత్రత దెబ్బతిన్నదని, ఈ కారణంగానే గడచిన ఐదేళ్లలో తాను ఒక్కసారి కూడా తిరుమల వెళ్లలేదని ఆయన చెప్పుకొచ్చారు.
టీటీడీ చైర్మన్ గా ఎంపికైన సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా బీఆర్ నాయుడు పలు కీలక అంశఆలను ప్రస్తావించారు. తిరుమల కొండపై పవిత్రతను కాపాడటమే తన పరమావధిగా పనిచేస్తానని ఆయన తెలిపారు. అందులో భాగంగా హిందువులు కాని వారిని తిరుమల కొండపై విధులు నిర్వర్తించకుండా చర్యలు చేపడతామన్నారు. ప్రస్తుతం అలా హిందువులు కాకున్నా తిరుమల కొండపై పనిచేస్తున్న వారిని తక్షణమే అక్కడి నుంచి పంపించివేస్తామని తెలిపారు. కొండపై ఇక ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపడతామన్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా జరిగిన అక్రమాలపై తగిన రీతిలో చర్యలు తీసుకుని తీరతామని కూడా నాయుడు చెప్పారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించిన వారిని ఉపేక్షించేది లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
నాయుడు వ్యాఖ్యలు, వెంకన్న భక్తుల మనోభావాలు, కూటమి సర్కారు ఇప్పటిదాకా చేపట్టిన చర్యలను బట్టి చూస్తే… వైసీపీ జమానాలో తిరుమల కొండపై జరిగిన అక్రమాలను, వాటికి కారకులైన వారు అంత సులభంగా తప్పించుకోలేరన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొండపై నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు అవుతున్న శారదా పీఠం నిర్మాణాలను అక్రమ నిర్మాణాలుగానే టీటీడీ ప్రకటించింది. అంతేకాకుండా కొండపై ప్రతిదీ దేవదేవుడిదేనని, అలా కాకుండా తమ మఠం నిర్మాణాలు కడతామంటే కుదరదని కూటమి సర్కారు గట్టి సంకేతాలనే పంపింది. ఈ నేపథ్యంలో నీతి, నిజాయతీతో వెంకన్న కార్యక్రమాలను నిర్వహిస్తామని చెబుతున్న నాయుడు లాంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా వస్తుండటంతో కొండపై అక్రమార్కుల ఆటలు ఇక సాగవని చెప్పొచ్చు.