శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను కుప్పం నియోజకవర్గానికి తరలించామని సీఎం జగన్ చెప్పుకుంటున్నారు. హంద్రీ నీవా జలాలను సీఎం జగన్ సోమవారం విడుదల చేశారు. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రజలు.. భార్యకు రవిక ముక్క కొనిపెట్టలేని వాడు.. మరదలికి పట్టు చీర కొనిపెట్టిన చందంగా ఎద్దేవా చేస్తున్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులను గాలికి వదిలేసి.. కుప్పం నియోజకవర్గానికి జగన్ నీరు పారించడాన్ని ప్రజలు అదే విధంగా పరిగణిస్తున్నారు. ఇందులో పచ్చి రాజకీయ కోణం తప్ప ప్రజలకు మంచి చేసే ఉద్దేశమేమీ లేదనేని స్పష్టం అవుతోందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హంద్రీ నీవా సుజల స్రవంతిలో భాగంగా రూ.560 కోట్లతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను సీఎం జగన్ ఆగమేఘాల మీద కంప్లీట్ చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి సోమవారం నీళ్లని విడుదల చేశారు. ఇదే శ్రద్ధ మిగతా ప్రాజెక్టుల మీద ఎందుకు లేదని.. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు మీద ఎందుకు లేదని అంతా ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఆయన్ను దిగజార్చే ఉద్దేశంతోనే కుప్పానికి నీళ్లు పారించారని అంటున్నారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం పులివెందులను పూర్తిగా గాలికి వదిలేశారు.
పులివెందులలో చీనీ తోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. అంతుచిక్కని తెగుళ్లకు తోడు, నీళ్లు కూడా లేకపోవడంతో వందల ఎకరాల్లో పంట నాశనం అయింది. తెగుళ్లకు తోడు గిట్టుబాటు ధర కూడా లేదు. వైఎస్ఆర్ జిల్లాలో 64 వేల ఎకరాల్లో చీనీ తోటలుండగా.. పులివెందుల నియోజకవర్గంలోనే 48 వేల ఎకరాల్లో పంట సాగులో ఉంది. వేలాది కుటుంబాలు చీనీ తోటలపై ఆధారపడి జీవిస్తున్నాయి. దీంతో రైతులు విలవిలలాడుతున్నారు. సొంత నియోజకవర్గంలో రైతులను పట్టించుకోని జగన్.. పంతంతో చంద్రబాబు నియోజకవర్గం అయిన కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు. దీంతో పులివెందుల ప్రజలు జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహంతో ఉన్నారు. కుప్పంపై ఫోకస్ పెట్టి సొంత నియోజకవర్గాన్ని జగన్ గాలికి వదిలేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
తొలుత సీఎం జగన్ వైనాట్ 175లో భాగంగా వైనాట్ కుప్పం అంటూ ముందుకు వెళ్లారు. అందులో భాగంగానే కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చారు. మరోవైపు, చంద్రబాబు సైతం వైనాట్ పులివెందుల అంటూ ప్రచారంతో దూసుకెళ్తున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. తాజాగా పులివెందులను జగన్ పట్టించుకోకపోవడంతో అక్కడ ఈసారి ఆయనకు గడ్డు పరిస్థితులు ఎదరవుతాయని అంటున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాకపోయినా.. సీఎం జగన్ తీరు.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మారిపోయిందని పులివెందుల నేతలు ఎప్పటి నుంచో అంటున్నారు. అసలు తమని పట్టించుకోవడమే మానేశారని ఆ మధ్య పులివెందుల పర్యటన సందర్భంగా స్థానిక నేతలు జగన్ ను నిలదీసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాలతో ఈసారి జగన్ కు పులివెందుల కాస్త కష్టంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











